Smiling Relieves Stress: నవ్వితే నొప్పి, బాధ తగ్గిపోతాయా? ఒత్తిడి నుంచి బయటపడచ్చా? స్టడీలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి
Smiling Relieves Stress: నవ్వడం వల్ల ఒత్తిడి, బాధ వంటి సమస్యలు నిజంగానే తగ్గిపోతాయా? తాజా అధ్యయనాలు చిరునవ్వు గురించి ఏం చెబుతున్నాయి వంటి ఆసక్తికరమైన విషయాలు కొన్నింటిని తెలుసుకోండి.

నవ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ఏ రకంగా మంచిది, నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటని చాలా మందికి తెలియదు. నిజానికి నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చట. అంతేకాదు ప్రస్తుత ప్రపంచంలో చాలా మందిని అనారోగ్యం పాలు చేస్తున్న ఒత్తిడిని తగ్గించే శక్తి చిరునవ్వుకు ఉందని ఈ మధ్య కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నవ్వు నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? తాజా అధ్యయనాలు చిరునవ్వు గురించి ఎలాంటి విషయాలను చెబుతున్నాయి ఇక్కడ తెలుసుకోవచ్చు.
సాధారణంగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే స్వచ్ఛమైన, అందమైన నవ్వు నవ్వుతారు. కానీ అది లోతైన ప్రయోజనాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును నవ్వు మీ అంతర్గత ఆనందాన్ని ప్రతిబింబించడమే కాకుండా, సానుకూల భావోద్వేగాలను కూడా ఆకర్షిస్తుందట. జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నొప్పి లేదా బాధ అనిపించినప్పడు నవ్వడం వల్ల మనసు, శరీరం రెండూ ప్రభావితం అవుతాయట. రెండింటిలోనూ సానుకూల ప్రభావం పడి బాధ, నొప్పి తాలూకా అసౌకర్యం నుంచి బయటపడచ్చట.
నవ్వితే నిజంగానే నొప్పి, బాధ, ఒత్తిడి తగ్గుతాయా?
సాధారణంగా నొప్పి లేదా బాధ కలిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, ప్రతిస్పందన పెరిగి ఒత్తిడికి గురవుతారు. కానీ నొప్పి, బాధ కలిగిన సమయంలో చిరునవ్వు నవ్వితే వీటి ప్రభావం చాలా వరకూ తగ్గుతుందట. ఎలాగంటే నవ్వడం వల్ల గుండె కొట్టుకునే రేటు తక్కువగా, స్థిరంగా ఉంటుందట. దీనివల్ల భావోద్వేవంగా కాస్త సానుకూలంగా ఉంటారు. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా ఉండచ్చు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
దీని గురించి చేసిన ఒక అధ్యయనంలో పరిశోధకులు 57 మందిని పరిశీలించారు. ఇందుకోసం వారిని చాలా చల్లని నీటి బకెట్లో చేతులను ఉంచమని అడిగారు. ఇది నొప్పి సహనశీలతను అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాధారణ పద్ధతి. ఇలా చేస్తున్నప్పుడు, వారి గుండె కొట్టుకునే రేటు, ముఖ కవళికలు నమోదు చేశారు. ఈ సమయంలో బాధ పడ్డవారి కన్నా, చిరునవ్వు చిందించిన వారి గుండె కొట్టుకునే రేటు తక్కువగా ఉందని తేల్చారు. బాధ కలిగిన సమయంలో నవ్వడం అనేది శరీరంపై ప్రభావవంతమైన, శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉందని చెబుతున్నారు.
ఫేసియల్ ఫీడ్బ్యాక్ హైపోథిసిస్ సిద్ధాంతం ప్రకారం..
ఫేసియల్ ఫీడ్బ్యాక్ హైపోథిసిస్ సిద్ధాంతం ప్రకారం, ముఖభావాలు మన అనుభూతులపై ప్రభావం చూపించవచ్చని ఇంతవరకు చేసిన కొన్ని అధ్యయనాలు చూపించాయి. వీటి ప్రకారం నవ్వు అనేది ఒత్తిడిని తగ్గించడానికి , మనోధైర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. చిరునవ్వు చిందించడం వల్ల మనిషి మెదడులో ఎండార్ఫిన్స్ (ఆనంద రసాయనాలు) విడుదల అవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మూడ్‌ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మరొక అధ్యయనం ప్రకారం బాధ కలిగిన సమయంలో నవ్వడం ఒత్తిడిని తగ్గించుకోవడంలో మనకు చాలా బాగా సహాయపడుతుంది. కేవలం నవ్వడం ద్వారా మనం శరీరంలో ఒత్తిడి లక్షణాలను, రక్తపోటును తగ్గించుకోవచ్చని తేలింది. చిరునవ్వు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా, మంచి భావోద్వేగ స్థితిని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. నవ్వు భౌతిక అనుభూతిని తగ్గించకపోయినా భావోద్దేగ భారాన్ని మాత్రం తగ్గించగలగుతుంది. నొప్పి ఉన్నప్పటికీ వ్యక్తి విశ్రాంతిగా ఉండేలా చేస్తుంది.
సామాజిక లాభాలు కూడా..
- చిరునవ్వు అనేది ఒక సామాజిక సంకేతం కూడా. మానవ సంబంధాలు , సానుకూల స్పందనలు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
- ఇతరుల ముందు నవ్వుతున్నప్పుడు మనం మరింత సానుకూల స్పందన పొందుతాం, ఇది మన మనోధైర్యాన్ని పెంచుతుంది.
- మరింత సంతోషంగా , ఉత్పాదకంగా ఫీల్ అవడానికి సహాయపడుతుంది.
- ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా అందంగా కనిపించేందుకు కూడా నవ్వు దోహదపడుతుంది.
ఫేక్ స్మైల్ కూడా మంచిదేనట!
కొన్ని సార్లు నవ్వినట్లు నటించడం, బలవంతంగా నవ్వడం కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుందట. అది కూడా మీ మూడ్ , సంతోషాన్ని మెరుగుపర్చగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం