Cold weather and Heart Attack: చలికాలంలో అధికంగా శ్రమ పడితే గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా?-does overexertion in winter increase the risk of heart attack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cold Weather And Heart Attack: చలికాలంలో అధికంగా శ్రమ పడితే గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా?

Cold weather and Heart Attack: చలికాలంలో అధికంగా శ్రమ పడితే గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా?

Haritha Chappa HT Telugu

Cold weather and Heart Attack: చలికాలంలో ఎక్కువమంది గుండెపోటు సమస్య బారిన పడుతూ ఉంటారు. దీనికి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు.

చలికాలంలో గుండె కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Unsplash)

Cold weather and Heart Attack: శీతాకాలంలో వాతావరణం చల్లబడిపోతుంది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అధికంగా శారీరకశ్రమకు గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణాలను కూడా వివరిస్తున్నాయి. చలికాలంలోనే ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతూ ఉంటారు. చల్లగా ఉండే వాతావరణం గుండె పై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.

చలికాలంలో గుండెపోటు...

వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీనివల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. రక్తనాళాలు ఇలా సంకోచించడం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. ఈ ప్రభావం గుండెపై పని భారాన్ని పెంచుతుంది. గుండె మరింతగా పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి అధికంగా పడుతుంది. రక్తపోటు, రక్త ప్రసరణ పై కూడా తీవ్రంగా చెడు ప్రభావం పడుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే చల్లని ఉష్ణోగ్రతల వల్ల రక్తం పలుచగా కాకుండా కాస్త మందంగా మారుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ప్రవహించడం కష్టమవుతుంది. దీనికోసం గుండె తన పంపింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాల్సి వస్తుంది. దీంతో గుండెపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇది కూడా గుండెపోటుకు కారణమే అని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు.

చలికాలంలో అధికంగా శారీరక శ్రమకు గురైనా లేక చెమటలు పట్టేలా ఆడినా, వ్యాయామాలు చేసినా... హృదయ స్పందన రేటు అలాగే అధిక రక్తపోటు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది హృదయనాళ వ్యవస్థ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల కూడా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే శారీరక శ్రమ పెరిగిందో, ఆక్సిజన్ శరీరానికి మరింతగా కావాల్సి వస్తుంది. కానీ శరీరంలో అంత ఆక్సిజన్ దొరకకపోవచ్చు. దీనివల్ల గుండె కండరాల్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇది కూడా గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

చలికాలంలో చేసే అధిక వ్యాయామాలు, అధిక శ్రమ గుండెపోటుకు కారణమయ్యే ఛాన్సులు ఎక్కువ. గుండెపై పెరిగిన పని భారం, ఆక్సిజన్ సరఫరా తగ్గడం వంటివి గుండెపోటు వచ్చేలా చేస్తాయి. కాబట్టి చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తలు తీసుకోండి

1.చలికాలంలో తేలికపాటి వ్యాయామాలను చేయాలి. అలాగే శారీరక శ్రమ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

2. ఐదు, పది నిమిషాలు వ్యాయామాలు చేశాక గ్యాప్ తీసుకొని మళ్లీ వ్యాయామాలు మొదలుపెట్టడం మంచిది. దీనివల్ల హృదయస్పందన తీరులో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటివి జరగవు.

3. చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడే దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. అలా అని మదీ బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. దీనివల్ల మరింతగా రక్త ప్రసరణ పై ప్రభావం పడుతుంది.

4. తీవ్రంగా అలసిపోయే పనులను చలికాలంలో చెయ్యకపోవడమే మంచిది. చల్లని వాతావరణంలో ప్రతి గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది గుండె కోలుకోవడానికి సహాయపడుతుంది.

5. చలికాలంలో నీళ్లు తాగే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. దాహం వేయకపోవడం వల్ల చాలామంది నీళ్లు తాగరు. కానీ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. గుండె పనితీరుకు, శారీరక శ్రమకు పుష్కలంగా ద్రవాలు అందుతూ ఉండాలి. దాహం వేసినా, వేయకపోయినా ప్రతి గంటకు నీళ్లు తాగుతూనే ఉండండి.

6. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారు, కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నవారు శీతాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామాలను తగ్గించుకోవాలి. తేలికపాటి ఆహారాన్ని తింటూ, నడకతోనే సరిపెట్టుకోవాలి. ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చికిత్సలు తీసుకోవాలి.