Morning Erections: ఉదయం లేవగానే అంగస్తంభన జరిగితే మంచి సూచనా కాదా?
Morning Erections: చాలా మంది అబ్బాయిల్లో ఉదయం లేవగానే అంగస్తంభన జరుగుతుంది. ఇదేమైనా అనారోగ్యానికి సూచనా అని సందేహం ఉంటుంది. కానీ అది నిజం కాదు. దానికి కారణాలేంటో తెల్సుకోండి.
మార్నింగ్ ఎరెక్షన్ లేదా ఉదయం లేవగానే అంగం గట్టిపడటం చాలా మంది అబ్బాయిల్లో జరుగుతుంది. మేలుకుంటూనే ఈ అనుభూతి కలుగుతుంది. అయితే ఇది అనారోగ్యానికి సంకేతమా? లేదా ఆరోగ్యకరమేనా అనే సందేహం ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి అబ్బాయిలోనూ ఇది జరగొచ్చు. కానీ వయసు పెరుగుతున్నా కొద్ది మార్నింగ్ ఎరెక్షన్ తగ్గుతుంది. హార్మోన్లలో తేడాలు రావడమే దానికి కారణం.
అసలు మార్నింగ్ ఎరెక్షన్ ఎందుకొస్తుంది?
శృంగార వాంఛలే దీనికి కారణం కాదు. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే కొన్ని ప్రక్రియలు దీనికి కారణం. ఇవి నిరంతరం ఆరోగ్యం కోసం శరీరంలో జరిగే అంతర్గత పనులు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు పురుషుల్లో హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. దానివల్ల అంగస్తంభన అనుకోకుండా జరగొచ్చు. గాఢనిద్ర, హార్మోన్ల స్థాయులు, నరాల వ్యవస్థ అన్నీ దీనికి కారణమవుతాయి. అయితే అందరిలోనూ ప్రతిరోజూ ఇలా జరగకపోవచ్చు. కొందరిలో వారానికి ఒకటో రెండు సార్లు జరగొచ్చు. అది కూడా సాధారణమే.
ఆరోగ్యానికి సంకేతం:
టెస్టోస్టిరాన్:
ఆరోగ్యకరమైన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే సరైన స్థాయుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉండటం. ఈ హార్మోన్ స్థాయులు ఉదయం చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల శారీరక ఉత్తేజం కలిగి ఎరెక్షన్ జరగొచ్చు. దీనర్థం మీ శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులు సరిగ్గా ఉన్నాయనే ఆరోగ్యకర చిహ్నం.
రక్త ప్రసరణ:
పురుషాంగానికి జరిగే రక్తప్రసరణలో మార్పుల వల్ల కూడా ఎరెక్షన్ జరుగుతుంది. పురుషాంగంలో ఉండే చిన్న గదులను ఎరెక్టైల్ టిష్యూ లేదా కణజాలం అంటారు. దాంట్లో రక్త ప్రసరణ జరుగుతుంది. వాటివల్ల ఎరెక్షన్ జరగొచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన రక్తసరఫరా వల్ల ఇలా జరుగుతుందనేది మంచి సూచనే. ఒకవేళ రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే ప్రియాపిజ్మ్ అనే సమస్య మొదలవుతుంది. దానివల్ల ఎరెక్షన్ జరిగిన ప్రతిసారీ నొప్పిగా ఉంటుంది. ఇది కొన్ని గంటలసేపు అలాగే ఉంటుంది. ఇది మాత్రం అనారోగ్యానికి సూచనే.
శృంగార ఆరోగ్యం:
అంగస్తంభన లోపం అనారోగ్యానికి సూచన. ఉదయాన్నే అంగం గట్టిపడటం శృంగార సామర్థ్యానికి మంచి సంకేతం అనుకోవచ్చు. అసలు ఉదయం ఇలా జరగకపోతేనే ఏదో సమస్యకు సంకేతం అనుకోవచ్చు. కానీ అందరిలోనూ ఇది జరగాలని మాత్రం చెప్పలేం. వ్యక్తిని బట్టి మారుతుంది.
నరాల ఆరోగ్యం:
పారాసింపథెటిక్ నరాల వ్యవస్థ వల్ల అంగస్తంభన అనేది జరుగుతుంది. ఇదే మన శరీరం నిద్ర పోడానికి, విశ్రాంతి తీసుకోడానికి కారణం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందని మార్నింగ్ ఎరెక్షన్ సంకేతంగా తెల్పుతుంది.
ఇబ్బంది ఎప్పుడంటే..
- అంగస్తంభన జరిగినప్పుడు నొప్పి ఉంటే అది నిర్లక్ష్యం చేయకూడదు. పురుషాంగంలో ఏదైనా సమస్యకు ఇది సంకేతం.
- ఉదయాన్నే వచ్చిన ఎరెక్షన్ అరగంట లేదా ఇంకొచెం ఎక్కువసేపు ఉండొచ్చు. కానీ గంటలకొద్దీ ఇలాగే ఉంటే అది అనారోగ్య సంకేతం. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
- వారానికి ఇన్ని రోజులు, ఇన్ని సార్లు మార్నింగ్ ఎరెక్షన్ జరగాలని చెప్పలేం. ఇది వ్యక్తిని బట్టి మారొచ్చు. కానీ సాధారణంగా కన్నా కాస్త భిన్నంగా ఎక్కువ రోజులు జరిగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.