ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు, కానీ నేటి జీవనశైలిలో ఫిట్ గా ఉండడం కష్టంగా మారిపోయింది. శారీరక శ్రమ తగ్గిపోయి ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం కామన్ అయిపోతోంది. అటువంటి పరిస్థితిలో, బరువు పెరగడం సహజం. ఇది అనేక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. బరువు పెరగడం వల్ల అనేక జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బిజీ జీవితం కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. వాటిల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం.
ఉద్యోగాల వల్ల రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. ఇది ఆరోగ్యంపై ఎన్నో చెడు ప్రభావాలను చూపుతుంది. చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతున్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి రాత్రి పూట భోజనం ఎప్పుడు తినకూడదో, ఎప్పుడు తినాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బరువు పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారని మీరు వినే ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు బరువు పెరుగుతారు. అయితే, రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల 24 గంటల పాటు శరీరంలో 'లెప్టిన్' అనే హార్మోన్ తగ్గుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. దీని లోపం వల్ల ఆకలి ఎక్కువై ఆహారాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇది కాకుండా, రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎటువంటి శారీరక శ్రమ ఉండదు. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
రాత్రిపూట కాస్త తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మంచిది. పగటిపూట శారీరక శ్రమ చేయడం ద్వారా క్యాలరీలను బర్న్ చేసుకోవాలి. ఇలా చేస్తే బరువును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి పూట భారీ భోజనాలు తినడం కూడా ప్రమాదకరమే. వ్యాయామం ద్వారా మీరు తీసుకునే కేలరీలను బర్న్ చేసుకోవాలి. అయితే రాత్రిపూట భారీ ఆహారాలు ఆలస్యంగా తినడం అలవాటుగా మార్చుకోవద్దు. వీలైనంత త్వరగా భోజనం ముగించడానికి ప్రయత్నించండి. భోజనం తిన్న తరువాత కొద్దిసేపు నడవండి. ఇది మీ బరువును కూడా నియంత్రిస్తుంది. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది.
రాత్రిపూట మీరు వీలైనంత వరకు సాయంత్రం ఏడు కల్లా భోజనం పూర్తి చేసుకోవాలి. ఆ తరవాత పావుగంట సేపు వాకింగ్ చేయాలి. ఆ తరువాత ఒక గంట పాటూ నిద్రపోకుండా ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే ఆ కేలరీలన్నీ శరీరంలోనే బరువు రూపంలోనే పేరుకుపోతుంది. రాత్రిపూట మీరు తినే ఆలస్యంగా తినే ఆహారాలు కచ్చితంగా మీరు బరువును పెంచుతాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్