Chicken Health Problems: బ్రాయిలర్ చికెన్ తింటే స్త్రీ పురుషుల్లో సంతాన సమస్యలు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Chicken Health Problems: ఎంతోమందికి చికెన్ అంటే ఇష్టం. ప్రతిరోజు చికెన్ తినే వారు కూడా ఉన్నారు. అయితే చికెన్ తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయనే వాదన సమాజంలో ఉంది. అది అంతవరకు నిజమో తెలుసుకుందాం
Chicken Health Problems: ముక్క లేనిదే ముద్ద దిగనివారు ఎంతోమంది. ముఖ్యంగా ప్రతిరోజూ చికెన్ బిర్యాని, చికెన్ కర్రీ, చికెన్ వేపుడు తినేవారు కూడా ఉన్నారు. మనదేశంలో నాటు కోళ్లతో పోలిస్తే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి అధికంగా ఉంది. మార్కెట్లో 90% బ్రాయిలర్ కోళ్ల మాంసమే దొరుకుతుంది. ధర పరంగా కూడా బ్రాయిలర్ కోళ్లు తక్కువగా లభిస్తాయి. కాబట్టి అన్ని వర్గాల వారు వాటిని తింటారు. అయితే బ్రాయిలర్ కోళ్లను కోళ్ల ఫామ్ లలో పెంచుతారు. అవి తింటే ఆరోగ్యకరము కాదని, వాటికి కొన్ని రకాల ఇంజక్షన్లు, ఔషధాలు ఇస్తారనే వాదనలు ఉన్నాయి. దీనివల్ల బ్రాయిలర్ చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. ఇందులో ఎంత నిజమో తెలుసుకుందాం.

బ్రాయిలర్ చికెన్ అంటే
నాటు కోళ్లు ఇంటి చుట్టూ ఉన్న ఆహారాలు చిన్న చిన్న పురుగులు తింటూ స్వేచ్ఛగా పెరుగుతాయి. వాటిని ప్రత్యేకంగా పెంచరు. బ్రాయిలర్ కోళ్లు ప్రత్యేకమైనవి వీటిని ఫారాల్లో పెంచుతారు. వీటికి స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు. నాటు కోళ్లతో పోలిస్తే బ్రాయిలర్ కోళ్లు అతి త్వరగా తక్కువ కాలంలోనే పెరుగుతాయి. 50 రోజుల్లోనే ఇవి ఎదిగి మార్కెట్‌కు వచ్చేస్తాయి. అందుకే ఎక్కువ మంది బ్రాయిలర్ కోళ్ల ఫామ్ లో నడుపుతూ ఉంటారు. తొలిసారిగా 1930లో ఇలా ఫారాల్లో కోళ్లను పెంచడం మొదలైందని చెప్పుకుంటారు.
సాధారణంగా నాటు కోళ్లు పెరిగేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. కానీ బ్రాయిలర్ కోళ్లు కేవలం 40 నుంచి 50 రోజుల్లోనే రెండు కిలోల బరువు వచ్చేస్తాయి. అందుకోసం వాటికి ప్రత్యేకమైన ఆహారాన్ని వేయిస్తారు. అలాగే కొన్ని రకాల టీకాలు వేస్తారు. నాటు కోళ్లకు ఉన్నంత రోగనిరోధక శక్తి బ్రాయిలర్ కోళ్లకు ఉండదు. ఒక్క కోడికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే మిగతా కోళ్లు కూడా ఆ వ్యాధి బారిన త్వరగా పడతాయి.
కొన్నిచోట్ల బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరిగేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నట్టు బయటపడింది. ఆ హార్మోన్ల ఇంజక్షన్ల వల్ల కోళ్లు త్వరగా పెరుగుతాయి. ఆ కోళ్లను తినడం వల్ల కోళ్లు త్వరగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు ఇంతకుముందే తేల్చాయి. అయితే అన్ని కోళ్ల ఫారాల్లోని అన్ని కోళ్లకు ఇలా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి పెంచుతున్నారని చెప్పలేం. కొన్ని రకాల బ్యాక్టిరియా, వైరస్ వంటి వాటిపై దాడి చేస్తూ ఉంటాయి. అలా వైరస్‌ల నుంచి రక్షణగా కొన్ని రకాల టీకాలు ఇస్తూ ఉంటారు. మనిషికి ఎలా టీకాలు అవసరమో, బ్రాయిలర్ కోళ్లకు కూడా వ్యాక్సిన్లు అవసరం. అయితే ప్రతి కోడికి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చే ప్రక్రియ జరగడం లేదని చెబుతున్నారు కోళ్ల ఫారాల యజమానులు. అలా ప్రతి కోడికి హార్మోన్ ఇంజక్షన్ ఇస్తే అందుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందని, అప్పుడు కిలో చికెన్ ధర 700 రూపాయలకు అమ్మాల్సి వస్తుందని చెబుతున్నారు.
చికెన్ మితంగా తింటే ఎలాంటి సమస్యలు రావు. అధికంగా తింటే మాత్రం ఊబకాయం బారిన పడతారు. మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుంది. అలాగే పిల్లలు యుక్త వయసుకు త్వరగా వచ్చేస్తారు. కాబట్టి చికెన్ ను బాగా ఉడికించి కూర రూపంలో తింటేనే మంచిది. బిర్యానీ రూపంలో తినడం వల్ల చికెన్ ఎక్కువ సేపు ఉడకదు. కాబట్టి చికెన్ తినాలనుకునేవారు అధిక సమయం పాటు చికెన్ బాగా ఉడికించి తినాల్సిన అవసరం ఉంది.
సంతాన సమస్యలు వస్తాయా?
కోళ్ల ఫారంలోని కోళ్లను సహజంగా పెంచితే ఇలాంటి సమస్యలు రావు. కానీ వాటికి యాంటీబయోటిక్స్, కెమికల్స్ వేసి పెంచితే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాంసం అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు కొన్ని కోళ్లకు రసాయనాలు ఎక్కిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అలాంటి చికెన్ ను తింటే మహిళలకైనా, పురుషులకైనా పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతూ వస్తుంది. మహిళలు త్వరగా మెనోపాజ్ వంటి సమస్యల బారిన పడతారు. పురుషుల్లో వీర్యకణాల చలన శీలత తగ్గుతుంది. వాటి సంఖ్య తగ్గిపోవచ్చు. దీనివల్ల వీరు పిల్లలను ఉత్పత్తి చేయలేరు.
ఏం చేయాలి?
చికెన్ తినకుండా ఉండడం కష్టం. కాబట్టి వారంలో మూడుసార్లకు మించి తినకపోవడమే మంచిది. ఆ మూడుసార్లు కూడా దాన్ని ఎక్కువసేపు ఉడికించిన తరువాతే తినాలి. బిర్యానీ రూపంలో ఎక్కువగా చికెన్ తీసుకోకూడదు. చికెన్ బిర్యాని తినాలనిపిస్తే నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తినాలి. చికెన్ కర్రీని అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉడికిస్తే మాంసంలో ఉన్న వైరస్‌లు, బ్యాక్టీరియాలు బయటినుంచి ఎక్కించిన యాంటీ బయోటిక్స్ నాశనం అవుతాయి. అప్పుడు అది సురక్షితమైన ఆహారంగా మారుతుంది. అప్పుడు మీరు వీటిని తినవచ్చు.
టాపిక్