Milk and Hair Growth: ప్రతిరోజూ పాలు తాగితే జుట్టు పొడవుగా పెరుగుతుందా? ఇందులో నిజం ఎంత?-does drinking milk every day make your hair grow longer how true is this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk And Hair Growth: ప్రతిరోజూ పాలు తాగితే జుట్టు పొడవుగా పెరుగుతుందా? ఇందులో నిజం ఎంత?

Milk and Hair Growth: ప్రతిరోజూ పాలు తాగితే జుట్టు పొడవుగా పెరుగుతుందా? ఇందులో నిజం ఎంత?

Haritha Chappa HT Telugu

Milk and Hair Growth: కొంతమంది పాలు తాగితే జుట్టు పెరుగుతుందని చెబుతారు. పాల వల్ల జుట్టు ఎలా పెరుగుతుందో ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం.

పాలు తాగితే జుట్టు పెరుగతుందా? (Pixabay)

జుట్టు పెరుగుదల అనేది అన్ని వయసుల వారికి ముఖ్యం. ఎందుకంటే ఒక మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, అందాన్ని ఇచ్చేది జుట్టే. కానీ ఆధునిక కాలంలో అతిగా జుట్టు రాలిపోతుంది. ఎన్ని రకాల సంరక్షణ ఉత్పత్తులను వాడుతున్నా ఫలితం ఉండడం లేదు. అయితే పాలు తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందనే అభిప్రాయం మాత్రం ఎంతోమందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునడానికి ప్రయత్నిద్దాం.

పాలు ఆరోగ్యకరమైనవి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మనకు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12 కూడా పాలలో లభిస్తాయి. మొత్తం మీద ఈ పోషకాలు అన్నీ కూడా పాలు తేవడం ద్వారా మనం పొందవచ్చు. ఇవి మన చర్మానికి గోళ్ళకు, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అయితే రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల జుట్టు పెరుగుతుందని మాత్రం చెబుతూ ఉంటారు.

ప్రొటీన్ అధికంగా ఉంటే

మన జుట్టు పెరుగుదలకు ముఖ్యంగా కావలసింది ప్రోటీన్ కంటెంట్. ఎందుకంటే జుట్టు కెరాటిన్ తో తయారవుతుంది. ఈ కెరాటిన్ అనేది జుట్టు కుదుళ్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆ కెరాటిన్ తయారీకి ప్రోటీన్ అవసరం. అంటే ఆరోగ్యకరంగా జుట్టు పెరగాలంటే పాలల్లో ఉండే ప్రోటీన్ మనకు అత్యవసరమని, ప్రతిరోజు పాలు తాగితే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. పాలలో కేసిన్ ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల ప్రోటీన్. ఈ ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైనది. కాబట్టి పాలు తీసుకోవడం వల్ల కొత్త జుట్టును ఉత్పత్తి చేయడానికి కావలసిన పోషకాలు అందుతాయి.

జుట్టు పెరుగుదలకు ప్రోటీన్స్ ఎంతో అవసరం. అయినప్పటికీ ప్రోటీన్ మరీ అధికంగా తీసుకుంటే మాత్రం జుట్టు పెరుగుదల సవ్యంగా జరగదు. జుట్టు పెరుగుదల అనేది జన్యు శాస్త్రం, హార్మోన్ల సమతుల్యత మొత్తం ఆరోగ్యం పై కూడా ఆధారపడి ఉంటుంది. మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ విటమిన్, ఎక్కువ ఖనిజాలు వంటివి తీసుకోకూడదు. ఇది జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.

జుట్టు పెరుగుదలకు పాలతో పాటు ఎన్నో విటమిన్లు అవసరం పడతాయి. పాలల్లో ఉండే ప్రోటీన్ మాత్రమే జుట్టును పెంచదు. ఈ ప్రోటీన్ తో పాటు ఎన్నో పోషకాలు అవసరం పడతాయి.

విటమిన్ డి అనేది ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లను అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల అలోపేసియా అనే వ్యాధి కూడా రావచ్చు. దీనివల్ల జుట్టు మొత్తం రాలిపోతుంది.

బి విటమిన్లు కూడా జుట్టు పెరుగుదలకు అత్యవసరమైనవి. విటమిన్ బి12 సహా బి విటమిన్లన్ని పాలల్లో ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందేలా చేస్తాయి. అలాగే బి విటమిన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలను తినడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు.

విటమిన్ ఏ

మన జుట్టు ఆరోగ్యంగాపెరగడానికి కావాల్సినది విటమిన్ ఏ. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నెత్తిని తేమగా ఉంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. సెబమ్ అనేది జుట్టును పెంచే ఒక సహజ నూనె. కాబట్టి దానికోసం మీరు విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలను తినాలి.

పైన చెప్పిన విటమిన్లన్నీ మన జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. కేవలం పాలు తాగడం ద్వారానే కాదు... ఇవన్నీ తినడం ద్వారా కూడా మీరు జుట్టును పెంచుకోవచ్చు. పైన చెప్పిన విటమిన్లు ఉన్న ఆహారాలు తినడం ద్వారా మీరు జుట్టును ఆరోగ్యంగా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు.

కాల్షియం కూడా ముఖ్యం

జుట్టు ఆరోగ్యానికి కాల్షియం కూడా చాలా ముఖ్యం. క్యాల్షియం పాలల్లో అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచడానికి క్యాల్షియం ఎంతో అవసరం. అయితే కాల్షియం స్థాయిలలో కూడా సమతుల్య అవసరం. దాన్ని అతి తక్కువగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. రెండు కూడా జుట్టు సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి మీ శరీరానికి ఎంత అవసరమో అంత పోషకాలని తీసుకోవాలి. జుట్టు పెరుగుతుంది కదా అని ప్రోటీన్, క్యాల్షియం వంటివి మరీ అధికంగా తీసుకోకూడదు.

జట్టు పల్చబడడంలో హార్మోన్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాలల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆవుల నుండి వచ్చే పాలల్లో అధికంగా కనిపిస్తాయి. కొన్ని అధ్యయనాలు చెబుతున్న ప్రకారం హార్మోన్ల సమస్య కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి మీరు ముందుగా హార్మోన్లు అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించుకోవాలి.

మీరు మీ జుట్టు పెరుగుదల కోసం సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. మీరు అధికంగా తాగాలి. ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవాలి. లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు వంటివన్నీ అధికంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీ జుట్టును బలంగా మారుస్తాయి.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం