Papaya for Dengue: కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకుల రసం..ప్లేట్‌లెట్లను పెంచుతాయా?
Papaya for Dengue: డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు బొప్పాయి ఆకుల రసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం చూస్తుంటాం. వాటివల్ల నిజంగా ప్రయోజనాలున్నాయా? ఎంత మోతాదులో తీసుకోవచ్చో చూద్దాం.
ఈ వర్షాకాలంలో దోమలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా దేశమంతటా రోజూ ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. మరి డెంగ్యూ జ్వరం వచ్చిన వారు అందరికీ ప్రధానంగా ఎదురయ్యే సమస్య శరీరంలో ప్లేట్‌లెట్లు పడిపోవడం. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం, పానీయాలు తాగడం వల్ల ఈ ప్లేట్‌లెట్లు పెరుగుతాయని జనాల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో... కొబ్బరి నీళ్లు తాగితే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి అనేది ఒకటి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే పెరుగుతాయనేది మరొకటి. మరి ఇవి నిజమేనా? వీటి వల్ల డెంగ్యూ జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే విషయాలపై వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
సాధారణంగా మనిషికి ఏ రకమైన జ్వరం వచ్చినా అతని శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. రోగి శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం లాంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది. అయితే డెంగ్యూ జ్వరం విషయంలో ఇది మరి కొంత ఎక్కువగా ఉంటుంది. జ్వర తీవ్రత తగ్గే కొద్దీ మళ్లీ శరీరంలో ప్లేట్‌లెట్లు పెరగడం మొదలవుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
సొంతవైద్యం వద్దు:
ఇలా జ్వరంతో బాధ పడుతున్న వారు కేవలం బొప్పాయి ఆకుల రసం తాగడం, కొబ్బరి బొండం నీరు తాగడం చేస్తుంటారు. కేవలం వీటి వల్ల మాత్రమే ప్లేట్ లెట్లు పెరుగుతాయనుకోవడం పొరపాటే. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవడం తప్పనిసరి. వాటితో పాటు కొద్ది మోతాదులో వీటిని తాగడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అలాగని వీటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల రోగికి జీర్ణ, కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతాయని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎంత మోతాదులో తీసుకోవచ్చు?
తలనొప్పి, జ్వరంతో బాధ పడుతున్న వారు ఎవరైనా సరే ముందు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ యాంటిజెన్ పరీక్ష పాజిటివ్ అని వస్తే అది డెంగ్యూ జ్వరం అని అర్థం. తర్వాత వైద్యుని సిఫార్సు ప్రకారం మందుల కోర్సులు వాడుకోవడం తప్పనిసరిగా చేయాలి. మందులు వాడుతూ మాత్రమే బొప్పాయి ఆకుల రసం, కొబ్బరి నీళ్లను తాగాలి. పెద్దలైతే భోజనానికి ముందు 30 మిల్లీ లీటర్లు, పిల్లలైతే ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు మూడు సార్లు చొప్పున తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వద్దు. అదే కొబ్బరి నీళ్లను పూటకు ఒక గ్లాసు చొప్పున తాగవచ్చు. ఈ విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి వైద్యానికి పరిమితం కావడం ప్రమాదం అని చెబుతున్నారు.
టాపిక్