అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే అరటిపండ్లు, మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరకడంతో పాటు శరీరానికి అధిక ప్రయోజనాలు కలిగిస్తాయి. కేవలం ఫిజికల్ వర్కౌట్లు చేసే సమయంలో ఎనర్జీ కోసం, ఎసిడిటీ సమస్యను నివారించేందుకు అరటిపండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవేకాకుండా, అరటిపండు చేసే మరో మేలు ఏంటంటే, హైబీపీని అదుపు చేయడం. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ - రెనల్ ఫిజియాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ విషయం రుజువైందట.
అరటిపండ్లలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు ఆరోగ్యం విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మీ రక్తపోటుపై ఉప్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాలా మందికి తెలుసు. చాలా సార్లు, ఉప్పును పూర్తిగా తగ్గించమని ఇతరులకు సలహా ఇస్తారు కూడా. కానీ, ఈ అధ్యయనం ప్రకారం, ఉప్పగా ఉండే ఆహారాన్ని తగ్గించడం కంటే, మీ ఆహారంలో పొటాషియంను చేర్చడం వల్ల బీపీని మరింత ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చట. పొటాషియం అందించే పండ్లలో అరటిపండ్లు, చిలకడదుంపలు, పాలకూర, ఇతర పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి.
ఇంకొక మంచి విషయమేమిటంటే, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, మీరు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటున్నప్పటికీ రక్తపోటు తగ్గడంలో ఎలాంటి మార్పు ఉండదని తేలింది.
ఈ అధ్యయనంలో శరీరం వివిధ స్థాయిల సోడియం, పొటాషియంలకు ఎలా స్పందిస్తుందో పరిశోధనలు జరిపారు. వారి ప్రయోగాలలో పొటాషియం తీసుకోవడాన్ని రెట్టింపు చేసినప్పుడు, పురుషులలో బీపీ 14 mmHg వరకు, మహిళల్లో 10 mmHg వరకు తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది జరిగింది. అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలకు కేవలం సోడియం (ఉప్పు) తగ్గించడం కంటే మీ ఆహారంలో శక్తివంతమైన పోషకాలను చేర్చడం ఎంత ముఖ్యమో దీని ద్వారా స్పష్టమైంది.
సోడియంను అదుపు చేయడంలో లింగ తేడాను కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అధ్యయనం ప్రకారం, మహిళల మూత్రపిండాలు సహజంగానే సోడియంను కొంత మంచిగా నియంత్రించగలవు. ఒక విధంగా, మహిళలకు, ముఖ్యంగా రుతుక్రమం ముగిసే ముందు, అధిక రక్తపోటు నుండి సహజ రక్షణ ఉంటుంది. కానీ, మగవారిలో మాత్రం సోడియంను సహజంగా నిర్వహించడంలో అంతగా సమర్థవంతంగా ఉండరట. కాబట్టి వారికి పొటాషియం ఎక్కువగా అవసరం అవుతుందని అధ్యయనం తెలియజేసింది.
పొటాషియం ప్రయోజనాలను అందుకోవడానికి రోజుకు 2 అరటిపండ్లు తింటే సరిపోతుంది. ఆడవారు కేవలం 1 అరటిపండు తింటే చాలట. అదే డయాబెటిస్ రోగులు అయితే అరటిపండ్లను తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం