Headache in Winter: చలికాలంలో తరచూ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఇలా రెమెడీ చేసుకుని విముక్తి పొందండి!
Headache in Winter: చలికాలంలో తలనొప్పి సర్వసాధారణం. ఈ సమస్యకు పరిష్కారం కూడా అంతే సులభం. కారణాన్ని అర్థం చేసుకుంటే, పరిష్కారం కూడా రెడీ అయిపోయినట్లే. మరి అదేంటో చూసేద్దామా..
చలికాలంలో చాలామంది బయట తిరగడానికి ఇష్టపడరు. దానికి కారణం ఏదో ఆరోగ్య సమస్య పట్టిపీడిస్తుందనే భయం. అలా భయపెట్టే సమస్యల్లో ఒకటి ఈ తలనొప్పి. ఎందుకు వస్తుందో తెలియదు, ఎంతసేపటికి తగ్గుతుందో తెలియదు. దీనిని బయటకు చూపించలేం. మౌనంగా భరించనూ లేం. కానీ, అంచనా వేయగలం. వాతావరణాన్ని బట్టి చలికాలం వచ్చే తలనొప్పిని పసిగట్టి దానికి తగ్గ రెమెడీని ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..
తలనొప్పికి కారణాలు తెలుసుకోండి..
- చలికాలంలో వచ్చే తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో మొదటిది ఉష్ణోగ్రత తగ్గడం, చల్లని పొడి గాలులను పీల్చుకోవడం కావొచ్చు.
- సాధారణంగా చలికాలంలో మన రక్తం చిక్కగా అవుతుంది. ఆ పరిస్థితుల్లో మనం నిలబడి ఉన్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా మన తలకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని ఫలితంగా తలనొప్పి వస్తుంది.
- ఈ సీజన్‌లో మనకు దాహం తక్కువగా వేస్తుంది. కాబట్టి, నీటి కొరత లేదా డీహైడ్రేషన్ కూడా నొప్పికి కారణం కావచ్చు.
- సైనస్, నిద్ర విధానంలో మార్పు, ఆహారపు అలవాట్లు వంటి ఇతర కారణాలు కూడా తలనొప్పిని పెంచుతాయి.
- చలికాలంలో మూసివున్న తలుపులు, గదులలో నిరంతరం వెలుగుతున్న హీటర్ల వల్ల వెంటిలేషన్ సరిగా లేకపోవడం కూడా తలనొప్పి సమస్యను పెంచుతుంది.
- విటమిన్-D లోపం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. చలికాలంలో వాతావరణానికి భయపడి గదుల్లో ఉండిపోతాము. కాబట్టి, విటమిన్-D లోపం కలిగి మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తుంది. దీని కోసం మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు మాంసాహారం తింటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాకాహారులైతే, పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, జున్ను మొదలైనవి తీసుకోండి. అలాగే, మీ ఆహారంలో పుట్టగొడుగులు, నారింజ మొదలైన వాటిని కూడా చేర్చుకోండి.
- గదులలో హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించవచ్చు. హీటింగ్ వల్ల గదిలోని గాలి పొడిగా మారుతుంది. దీని వల్ల కూడా తలనొప్పి సమస్య వస్తుంది.
- గదిలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కార్బన్ మోనాక్సైడ్ విషప్రభావం నుండి రక్షణ పొందడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఉపయోగించవచ్చు.
- మీకు చలి వల్ల తలనొప్పి వస్తే, గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
తేమతో రాజీ పడకండి..
చలికాలంలో మనకు దాహం తక్కువగా వేస్తుంది. రక్తం చిక్కబడటం వల్ల శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నీటి కొరత వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఏ అవయవానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే, అక్కడ నొప్పి వస్తుంది. శరీరానికి నీటి అవసరాన్ని తీర్చండి. దాహం వేసినా, వేయకపోయినా 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలి. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది మన రక్తం చిక్కదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చలికాలంలో రక్తం చిక్కబడటం వల్ల వచ్చే సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
యోగా చేయండి
చలికాలంలో వచ్చే తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి, శరీరంలో శక్తిని పెంచే పనులు చేయాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కోసం క్రమం తప్పకుండా యోగా చేయడం ఉత్తమం. సూర్యనమస్కారం, అనులోమ-విలోమ, కపాలభాతి, సూర్యభేది వంటి ప్రాణాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.
సూప్ తాగచ్చు..
చలికాలంలో సూప్ తాగడం మంచిది. ప్రొసెస్ చేసిన పౌడర్లతో చేసిన సూప్ తాగితే తలనొప్పికి కారణం కావచ్చు. అందుకే ఈ సీజన్‌లో తాజా కూరగాయలతో సూప్ చేసుకోవడం మంచిది.
అద్భుతంగా పనిచేసే ఇంటి చిట్కాలు ఇవిగో..
సొంఠి, దాల్చినచెక్క పొడి, పసుపు, మిరియాలు. ఈ నాల్గింటిని సమాన పరిమాణంలో చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగం అయిపోయినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఈ ద్రావణం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో తేనె, నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల తలనొప్పి మాత్రమే కాదు, చలి వల్ల వచ్చే ఏ సమస్యా మీ దరికి చేరదు.
తరచుగా సైనస్ వల్ల సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతుంటే కూడా తలనొప్పి మొదలవుతుంది. దీని కోసం నాసికా ద్వారాలను శుభ్రం చేయడం అవసరం. దాని కోసం ఒకటిన్నర గ్లాసుల నీటిలో ఒక టీస్పూన్ వాము, రాతి ఉప్పు కలిపి ఆవిరి పట్టడం వల్ల ప్రభావవంతమైన ఫలితంగా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి వాము, రాతి ఉప్పు వేసుకున్న నీటిని పుక్కిలించవచ్చు. రెండు చుక్కల ఆవు నెయ్యిని వేడి చేసి ముక్కులో వేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.