Kids Health: నిద్రపోయే ముందు పిల్లలకు టీవీలు, ఫోన్లు చూపిస్తున్నారా? భవిష్యత్తులో వారు బరువు పెరగడం ఖాయం
Kids Health: పిల్లలు స్క్రీన్ టైమును తగ్గించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఏ పిల్లలు అయితే నిద్రపోయే ముందు ఫోను, టీవీ వంటివి చూస్తారో వారు భవిష్యత్తులో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది.

Kids Health: పిల్లల్లో స్థూలకాయం సమస్య పెరుగుతోంది. ఎంతోమంది పిల్లలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఏ పిల్లలు అయితే రాత్రిపూట నిద్రపోవడానికి ముందు ఫోన్లు, టీవీలు ఎక్కువ సమయం పాటు చూస్తారో వారు భవిష్యత్తులో ఊబకాయం బారిన పడే అవకాశం ఉన్నట్టు ఆధ్యయనం చెబుతుంది.
రెండేళ్ల నుంచి 12 సంవత్సరాల మధ్య గల వెయ్యి మంది పిల్లలపై ఈ అధ్యయనకర్తలు సర్వే నిర్వహించారు. వారు ఎంత సేపు ఫోన్ చూస్తారో వారి నిద్రా విధానాలు, ఆహారపు అలవాట్లు వంటివి తెలుసుకున్నారు. ప్రీస్కూల్ వయస్సు ఉన్న పిల్లల్లో 27% మంది, పాఠశాల వయసు ఉన్న పిల్లల్లో 35% మంది నిద్ర వేళకు ముందు అరగంట కంటే ఎక్కువసేపు ఫోను, టీవీ వంటివి చూస్తున్నట్టు గుర్తించారు.
నిద్ర వేళకు ముందు ఎక్కువసేపు టీవీ, ఫోను చూసే పిల్లలతో పోలిస్తే... అలా ఫోను, టీవీ చూడకుండా త్వరగా నిద్రపోయే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎవరైతే నిద్రవేళకు ముందు ఫోన్లు, టీవీలు చూస్తారో... ఆ పిల్లలు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
ఏ పిల్లలకైతే ఫోను, టీవీలు బాగా అలవాటు అవుతాయో... ఆ పిల్లలు తక్కువ శారీరక శ్రమను కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల కూడా వారు ఊబకాయం, ఇతర అనారోగ్యాల బారిన భవిష్యత్తులో పడే అవకాశం అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పరిశోధకులు రెండేళ్ల నుంచి 12 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలు 10 నుండి 12 గంటల పాటు నిద్రపోవడం అవసరం. చాలామంది పిల్లలు రాత్రి పదిగంటలకు నిద్రపోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఫోన్ చూడకూడదు, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి రోజుకు ఒక గంట మాత్రమే ఫోను లేదా టీవీ ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. రోజుకి ఆరేడు గంటలు ఫోన్లు టీవీలు చూసే పిల్లలు అధికంగానే ఉన్నారు.
కరోనా సమయంలో పిల్లల స్క్రీన్ సమయం మరింతగా పెరిగినట్టు అధ్యయనాలు చెప్పాయి. బీబీసీ చేసిన సర్వేలో 79 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు వినియోగం గురించి తీవ్రంగా ఆందోళన చెందినట్టు గుర్తించారు.
భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పటినుంచే వారి స్క్రీన్ సమయాన్ని కుదించాల్సిన అవసరం ఉంది. నిద్రపోవడానికి ముందు స్క్రీన్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి. పిల్లలు ఆలస్యంగా కాకుండా రాత్రి 8 నుంచి 9 గంటల లోపే నిద్రపోయేట్టు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. అలాగే పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం వంటి అలవాట్లను వారికి ప్రోత్సహించాలి.
టాపిక్