Roasted Chicpeas: వేయించిన శనగలంటే మీకు ఇష్టమా..? ఈ మాస్టర్ ట్రిక్‌తో ఇంట్లోనే టేస్టీగా, క్రిస్పీగా తయారు చేసుకోండి!
Roasted chickpeas: వేయించిన శనగలంటే చాలా మంది ఇష్టం. వీటిని తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్చిన శనగలను ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఇప్పుడు మీరు ఇంట్లో సులభంగా చిక్పీస్ వేయించవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
కాల్చిన శనగలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఇనుము, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగ ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇవి కేవలం ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు.. రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే శనగలను ఇంట్లో వేయించుకున్నప్పుడు బయట బజారులో దొరికే వాటిలాగా క్రిస్పీగా ఉండవని చాలా మంది చెబుతుంటారు. మీకూ అలాగే జరుగుతుంటే.. ఈ ట్రిక్స్ మీ కోసమే. ఈ మాస్టర్ ట్రిక్స్‌తో శనగలను వేయించారంటే ప్రతిసారి క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి.

శనగలు మార్కెట్ స్టైల్లో వేయించే మాస్టర్ ట్రిక్..
- ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు వేసి చక్కగా కలపండి.
- ఇప్పుడు అదే పాత్రలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగలను తీసుకుని నానబెట్టాలి.
- ఈ నీటిలో శనగలు నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానిన తర్వాత వాటిని వడకట్టి పక్కక్కు ఆరబెట్టుకోవాలి. (ఉదయాన్నే తినాలనుకునే వాళ్లు రాత్రంతా నానబెట్టుకోవచ్చు)
- ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు ఉప్పును వేసి వేడి చేయండి. శనగల కంటే ఉప్పు ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.
- ఉప్పు కాస్త వేడిక్కిన తర్వాత వడకట్టి ఆరబెట్టుకున్న శనగలను దాంట్లో వేసి వేయించండి.
- అధిక మంట మీద వేయిస్తూ ఉంటే ఉప్పు వేడయ్యేకొద్దీ శనగలు చక్కగా వేగుతాయి.
- కొద్ది నిమిషాలకే మార్కెట్ స్టైల్ క్రిప్సీ రోస్టెట్ చనా రెడీ అయిపోతుంది. ఇష్టంగా తినేయచ్చు.
కేవలం శనగలే కాదు ఇతర ధాన్యాలను కూడా..
ఈ చిట్కాలతో శనగలు మాత్రమే కాదు మినుములు వంటి ఇతర ధాన్యాలను కూడా క్రిస్పీగా బజారులో లభించే వాటిలాగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్ లాగా ఉపయోగపడతాయి.
వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చలికాలంలో ఉదయం, సాయంత్రం రుచిగా, క్రిస్పీగా ఏదైనా తినాలకునే వారికి ఈ శనగలు మంచి ఎంపిక. జలుబు, కఫంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇవి డయాబెటిస్. థైరాయిడ్ రోగులకు కూడా మంచి ఆహారం. అధిక బరువు ఉంటే, వేయించిన శనగలు తిని పెరుగుతున్న బరువును నియంత్రించవచ్చు. అయితే బరువు పెరగాలనుకునే వారు వేయించిన శనగలు తినకూడదు.