చూయింగ్ గమ్ నమలడం యువతకు ఎంతో ఇష్టం. దాన్ని నములుతూ బెలూన్ లా ఊదుతూ ఆనందిస్తారు. అది మనం నమిలి ఉమ్మేస్తాం కదా దానితో ఏ సమస్యా ఉండదనుకుంటారు. నిజానికి మీకు తెలియకుండానే చూయింగ్ గమ్ రూపంలో ప్లాస్టిక్‌ను నమిలేస్తున్నారు. ఒక చూయింగ్ గమ్‌లో ఎన్నో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. అవి మీకు తెలియకుండానే మీ శరీరంలో చేరుతాయి.
ఒక చూయింగ్ గమ్ నమలడం వల్ల వందలాది చిన్న ప్లాస్టిక్ ముక్కలు నేరుగా ప్రజల నోట్లోకి విడుదల అవుతాయి. దీన్ని తినడం ఎంతో ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, పర్వతాల శిఖరాల నుండి సముద్రం అడుగు వరకు మనం పీల్చే గాలిలో కూడా మైక్రోప్లాస్టిక్స్ అని పిలిచే చిన్న ప్లాస్టిక్ ముక్కలను చేరిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
మన ఊపిరితిత్తులు, రక్తం, మెదడుతో సహా మానవ శరీరాల అంతటా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మైక్రోప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం. యుసిఎల్ఎలో పిహెచ్డి విద్యార్థిని లీసా లోవ్ చూయింగ్ గమ్ నమిలి పరిశోధనకు సహకరించింది. పరిశోధకులు ఆమె లాలాజలంపై రసాయన విశ్లేషణ చేయడానికి ముందు 10 బ్రాండ్లకు చెందిన చూయింగ్ గమ్ ముక్కలు ఏడు వరకు నమిలారు. ఒక గ్రాము (0.04 ఔన్సుల) గమ్ సగటున 100 మైక్రోప్లాస్టిక్ శకలాలను విడుదల చేసిందని పరిశోధకులు కనుగొన్నారు.
సంవత్సరానికి 180 గమ్ ముక్కలను నమిలేవారు సుమారు 30,000 మైక్రోప్లాస్టిక్స్ తీసుకుంటారని పరిశోధకులు తేల్చారు. ఇతర పరిశోధనల్లో ఒక ప్లాస్టిక్ బాటిల్లోని ఒక లీటరు నీటిలో సగటున 240,000 మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని అంచనా వేశారు.
మార్కెట్లలో సాధారణంగా విక్రయించే చూయింగ్ గమ్‌ను సింథటిక్ గమ్ అని పిలుస్తారని. ఇందులో పెట్రోలియం ఆధారిత పాలిమర్స్ ఉంటాయని పరిశోధకులు తెలిపారు. చూయింగ్ గమ్ పై ఉండే కవర్ పై ఈ పాలిమర్స్ గురించి రాసి ఉండదు. ట్రీ సాప్ వంటి మొక్కల ఆధారిత పాలిమర్లను ఉపయోగించి తయారు చేసే చూయింగ్ గమ్ రకాలను పరిశోధకులు పరీక్షించారు. రెండింటిలోనూ మైక్రోప్లాస్టిక్స్ పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు.
గత వంద సంవత్సరాలకు పైగా చూయింగ్ గమ్ నములుతున్నట్టు అంచనా. ఇందులో వాడే ఈ పదార్ధాలను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అందుకే దీన్ని తినేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. మీ ఆరోగ్యం బావుండాలంటే చూయింగ్ గమ్ తినకపోవడమే మంచిది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం