ఈ ఏప్రిల్ నెలలోనే ఎక్కువమంది అనారోగ్యం పాలవుతున్నారట? ఎందుకో తెలుసా-do you know why so many people are getting sick this april ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ ఏప్రిల్ నెలలోనే ఎక్కువమంది అనారోగ్యం పాలవుతున్నారట? ఎందుకో తెలుసా

ఈ ఏప్రిల్ నెలలోనే ఎక్కువమంది అనారోగ్యం పాలవుతున్నారట? ఎందుకో తెలుసా

Haritha Chappa HT Telugu

ఏప్రిల్‌లో ఎక్కువ మంది అనారోగ్య పాలవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణాలు ఏంటో కూడా వివరిస్తున్నాయి. వేసవికాలం ప్రారంభంలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

ఏప్రిల్ నెలలోనే ఎక్కువమందికి రోగాలు (Pixabay)

ఏప్రిల్ నెలలో మనదేశంలో ఎక్కువ మంది గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా శీతాకాలంలో ఎక్కువగా కనిపించే రోగాలు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఎక్కువ మందికి ఈ వ్యాధులు సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలు కూడా వివరిస్తున్నారు.

ఏప్రిల్ లో ఎందుకు?

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటిపూట తీవ్రమైన వేడి కనిపిస్తోంది. రాత్రిపూట ఆకస్మికంగా చల్లదనం వస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు, మేఘాలు కనిపిస్తున్నాయి. ఇలా వాతావరణంలో హఠాత్తుగా జరిగే హెచ్చుతగ్గులు శరీరంలోని ఉష్ణోగ్రత వ్యవస్థను గందరగోళ స్థితికి చేరుస్తున్నాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వాతావరణం అనుకూలంగా ప్రజలు దుస్తులు ధరించలేకపోతున్నారు. దీని వల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు ఫిజీషియన్లు వివరిస్తున్నారు.

శీతాకాలం ముగిసిపోయింది. కానీ ఇంకా గాలి కాలుష్యం తగ్గలేదు. వేడి గాలులు, నిర్మాణ పనులు కారణంగా గాలిలో దుమ్ము ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గొంతు ముక్కులో చికాకు పెరుగుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ సులభంగా మొదలైపోతోంది.

శీతాకాలంలో ఎక్కువ ఆహారాలు తిని, శారీరక శ్రమ తక్కువగా చేస్తారు. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. శీతాకాలం నుంచి బయటపడి వేసవికాలంలో అడుగుపెట్టే సమయానికి వేడి అకస్మాత్తుగా పెరిగి శరీరం అలసిపోయేలా చేస్తోంది. దీని వల్లే ఏప్రిల్ లో అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

ఏప్రిల్ లో వేడి పెరగగానే అందరూ శీతలపానీయాలు వెంటపడతారు. అలాగే చల్లని నీరు తాగడం, ఐస్ క్రీములు అధికంగా తినడం, ఏసీలలోనే జీవించడం వంటివి చేస్తారు. ఇన్ని మార్పులను శరీరం ఒకేసారి తీసుకోలేదు. శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ కు కూడా కారణం అవుతుంది. అందుకే ఏప్రిల్ నెలలో ఎక్కువమంది దగ్గు ఇన్ఫెక్షన్, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటితో బాధపడుతూ ఉంటారు.

ఇలా జాగ్రత్త పడండి

నీరు పుష్కలంగా తాగాల్సిన అవసరం ఉంది. అలాగే వేడి వేడి సూపులు, పాలల్లో పసుపు కలుపుకొని తాగితే ఎంతో ఆరోగ్యం. అలాగే జ్వరం, దగ్గు వచ్చినప్పుడు చల్లని ఆహారాలకు ఐస్ క్రీములకు దూరంగా ఉండండి. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఖచ్చితంగా మాస్కుని ధరించండి. ప్రతిరోజు ఆవిరి పట్టేందుకు ప్రయత్నించండి. ఇది గొంతు, ముక్కు సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉన్న ఆహారాలను అధికంగా తినాలి. ప్రతిరోజు అల్లం, వెల్లుల్లి, ఆకుపచ్చ కూరగాయలు తినాల్సిన అవసరం ఉంది. శ్వాస తీసుకడంలో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఇంటి దగ్గరే ఉండకుండా వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం