Noodles Prasadam: ఆ గుడిలో నూడుల్స్‌ను ప్రసాదంగా ఎందుకు అందిస్తారో తెలుసా? ఆ గుడి అందుకే చాలా స్పెషల్
Noodles Prasadam: భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందులో ఒకటి కోల్ కతాలోని కాళీమాత ఆలయం. అక్కడ ప్రసాదంగా నూడుల్స్‌ను అందిస్తారు.
Noodles Prasadam: కోల్‌కతా నడిబొడ్డున సందడిగా ఉండే వీధులలో ఉంటుంది ప్రసిద్ధ కాళీ మందిర్. ఆ ప్రాంతానికి వెళ్తే చాలు ఆధ్యాత్మిక చింతన పెరిగిపోతుంది. భక్తి పారవశ్యంతో మనసు నిండిపోతుంది. ఈ దేవాలయం దైవభక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ఆలయ నిర్మాణ సౌందర్యం కళ్ళను కట్టిపడేస్తుంది. ఈ ఆలయానికి వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకోవడానికి ఒక కారణం ఉంది. ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలో నూడుల్స్ ను ప్రసాదంగా అందిస్తారు. దశాబ్దాలుగా అక్కడ నూడిల్స్ అమ్మవారి ప్రసాదం.
కాళీమాత మందిరంలో ఇచ్చే నూడుల్స్‌ను ‘చౌ మెయిన్’ అని పిలుస్తారు. ఇది సాంప్రదాయ వంటకంగా చెప్పుకుంటారు. ఈ నూడిల్స్ ప్రసాదంగా అందించడం వెనుక ఒక కథను కూడా చెబుతారు. ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రస్తుతం కాళీమాత మందిరం ఉన్న ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం చైనా వారు వలస వచ్చి ఉండేవారు. ఆ కుటుంబంలోనే ఒక బాలుడికి తీవ్ర అనారోగ్యం అయింది. వైద్య నిపుణులు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. అప్పుడు బాలుడు కుటుంబం ఒక చెట్టు కిందకి ఆ బాలుడిని తీసుకుని వచ్చింది. అక్కడ రెండు నల్ల రాళ్లు ఉన్నాయి. వాటిని స్థానికులు కాళీదేవిగా పూజించేవారు. చైనా కుటుంబం కూడా చాలా రోజులపాటు బాలుడిని అక్కడే ఉంచి కాళీమాతను ప్రార్ధించింది. కొన్ని రోజులకు బాలుడు ఆరోగ్యం చక్కగా అయింది. దీంతో అక్కడున్న చైనా వారు కూడా కాళీమాతను పూజించడం ప్రారంభించారు. చైనా పద్ధతిలోనే ఆ ప్రాంతంలో ఖాళీ మందిరాన్ని నిర్మించారు. ఇదంతా 80 ఏళ్ల క్రితం జరిగింది. చైనా వారు అమ్మవారికి మొదటి నుంచి నూడిల్స్ నే ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలయాన్ని సంరక్షించుకునే వ్యక్తి కూడా ఒక చైనీయుడే. అతను చైనీస్ హిందువుగా చెప్పుకుంటాడు.
నూడిల్స్ ఎలా ప్రసాదమైంది?
చైనీస్ వంటకాలలో ప్రధానమైనది నూడుల్స్. అంతర్యుద్ధం సమయంలో చాలామంది చైనీస్ శరణార్థులు కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డారు. అలాగే వారి వంటకాలను స్థానికులకు పరిచయం చేశారు. అప్పటినుంచి కాళీమాతను పూజించేటప్పుడు నూడిల్స్ ని ప్రసాదంగా ఇవ్వడం ప్రారంభించారు. అలా అందరికీ అదే అలవాటయింది. అప్పుడప్పుడు మోమోలను ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు.
ఈ కాళీ మందిరానికి నూడిల్స్ ప్రసాదంగా అందించడమే ఇప్పుడు ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ఎంతోమంది దేశ విదేశాల నుంచి వచ్చి కాళీ మాత ఆలయాన్ని దర్శించుకుంటారు. నూడుల్స్ ను ప్రసాదంగా తీసుకుంటారు.