Ugadi 2025: ఈ ఏడాది ఉగాది సంవత్సరం కొత్త పేరేంటో తెలుసా? ఆసక్తికరమైన విశేషాలు ఇదిగో
Ugadi 2025: కొత్త తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేస్తోంది. ఈసారి ఆ ఉగాది నామ సంవత్సరం ఏమిటో దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ఉగాది మన తొలి తెలుగు పండుగ. తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమయ్యే రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజు ఉగాదిని నిర్వహించుకుంటాం. ఈసారి మార్చి 30న ఉగాది వచ్చింది. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలోనే ఉగాది ఏర్పడుతుంది. 2025లో మార్చి 30న మనం ఉగాది పండుగ రోజు నిర్వహించుకోబోతున్నాము.
ఉగాది పదం పుట్టుక
యుగాది అనే పదం నుంచి ఉగాది పుట్టిందని చెప్పుకుంటారు. యుగానికి ఆది అంటే ఏడాది ప్రారంభాన్ని ఈ పదం సూచిస్తుంది. మన పంచాంగం ప్రకారం ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. గత ఏడాది ఉగాదిని క్రోధినామ సంవత్సరంతో నిర్వహించుకున్నాం. ఈసారి విశ్వావసు నామ సంవత్సరంగా ఉగాది పండుగను నిర్వహించుకుంటాం. కేవలం తెలుగు వారికే కాదు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల వారికి ఉగాది ప్రత్యేకమైన పండుగ.
ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా
మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా బాగా నిర్వహించుకుంటారు. ఇది అక్కడ అతిపెద్ద పండుగ. ఎంతోమంది గ్రామాలకు వెళ్లి ఈ పూజలు నిర్వహించుకుని వస్తారు. అలాగే కేరళ, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా ఉగాదిని నిర్వహించుకుంటారు.సిక్కులు ‘వైశాఖి’ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక బెంగాలీలు ‘పోయిలా భైశాఖి’ అనే పేరుతో ఉగాదిని నిర్వహించుకుంటారు. మలయాళీలు విషు అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉగాదిని రకరకాల పేరుతో పిలుచుకొని నిర్వహించుకుంటారు.
ఉగాది వస్తుందంటే వారం రోజులు ముందు నుంచే ఇంట్లో పనులు మొదలైపోతాయి. ఇల్లును పరిశుభ్రంగా చేసుకుంటారు. రంగవల్లులు ఇంటి ముందు కళకళలాడిపోతాయి. మామిడి ఆకుల తోరణాలు కడతారు. దానధర్మాలు చేస్తారు. పిండి వంటలు చేస్తారు. పూజలు పునస్కారాలు ఆరోజు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఉగాది పచ్చడి ఎంతో ముఖ్యమైనది. ఆరోజు ఉగాది పచ్చడి తిన్నాకే ఇంకేదైనా ఆహారం తింటారు. తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పిండి వంటలతో ఇష్టదైవాన్ని పూజిస్తారు. ఆరోజు పులిహోర, బొబ్బట్లు కచ్చితంగా ఉండాల్సిందే.
ఉగాది రోజు చేసే పూజ ఆ ఏడాదంతా శుభాలు అందిస్తుందని చెప్పుకుంటారు. ఏడాదంతా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకునేవారు. ఉగాది పండుగ రోజు ఆ దైవాన్ని ప్రార్థిస్తారు. ఉగాది పచ్చడిని బెల్లం, పులుపు, కారం, చేదు, తీపి, వగరు... ఇలా షడ్రుచులతో తయారుచేస్తారు. ఇందులో ముఖ్యమైనది వగరు. ఇది ఉగాదికి వచ్చే మామిడి పంట ద్వారా వస్తుంది. ఈ రోజు మీరు ఏ పనిని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని కూడా చెప్పకుంటారు. అందుకే ఎంతోమంది ఉగాది రోజు కొత్త వాహనాలను కూడా కొంటూ ఉంటారు.
ఉగాది రోజు చేసే మరొక పని పంచాంగ శ్రవణం. ఆ ఏడాదంతా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చెప్పుకుంటారు. రాశి ఫలాలు తెలుసుకొని ఎలాంటి పరిహారాలు దేవతలకు చేయాలో కూడా ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్