Healthy Meal Plate: మీ భోజనం ప్లేటు లో ఏమేం ఉండాలో తెలుసా? రోజూ తినాల్సిన ఆహారం ఇదిగో-do you know what should be on your meal plate here is the food to be eaten daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Meal Plate: మీ భోజనం ప్లేటు లో ఏమేం ఉండాలో తెలుసా? రోజూ తినాల్సిన ఆహారం ఇదిగో

Healthy Meal Plate: మీ భోజనం ప్లేటు లో ఏమేం ఉండాలో తెలుసా? రోజూ తినాల్సిన ఆహారం ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 14, 2025 06:30 PM IST

Healthy Meal Plate: ఒకప్పుడు అన్నం, కూర, పప్పుచారు, పెరుగు అన్నీ ఉంటేనే తినేవారు. కానీ ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లతో పొట్ట నింపేసుకుంటున్నారు. నిజానికి మనం తినే అన్నం ప్లేట్లో ఏమేమి ఉండాలో తెలుసుకోండి.

మనం తినే ప్లేటులో ఏం ఉండాలి?
మనం తినే ప్లేటులో ఏం ఉండాలి? (Pixabay)

ఒకప్పుడు సంపూర్ణ భోజనం చేసేవారు. మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా అన్నం, పప్పు, కూర, చారు, పెరుగు... ఇలా అన్ని ప్లేట్లో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏదో ఒకటి తిని పొట్ట నింపేసుకుంటున్నారు. దీనివల్ల ఎంతోమంది పోషకాహార లోపం బారిన పడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతున్న ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎంతోమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. వారు ఉండాల్సిన బరువు, ఎత్తు కంటే తక్కువగా ఉన్నారు. అలాగే పెద్దవారిలో కూడా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండడమో, తక్కువ ఉండడమో ఉంటుంది. కానీ ఆరోగ్యమైన బరువు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనారోగ్యకరంగా కనిపిస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి పోషకాహారం అందాలో, శరీరం ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిరోజూ మనం తినే భోజనం ప్లేట్లో ఉండాల్సిన పదార్థాల గురించి తెలుసుకోండి.

ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకుంటేనే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సమతుల ఆహారం అంటే అందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మైక్రో న్యూట్రియంట్స్ ఇలా అన్నీ ఉండాలి. మన రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు వంటి వాటి నుంచి కార్బోహైడ్రేట్లు అందుతాయి. ఇక పప్పులు, వేరుశనగలు, బీన్స్, బఠానీలు, గుడ్లు, చికెన్ వంటివి ప్రోటీన్లను అందిస్తాయి.

ప్రోటీన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జంతువుల ప్రోటీన్. రెండోది మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్. జంతు ప్రోటీన్ అనేది చికెన్, కోడిగుడ్లు వంటి వాటినుంచి వస్తుంది. ఇక మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్ పప్పులు, వేరుశనగలు, బీన్స్ వంటి వాటి నుంచి వస్తుంది. కాబట్టి శాఖాహారులు, మాంసాహారులు తమ తమ ఇష్టాలను బట్టి ఎంపిక చేసుకొని ప్రోటీన్ కోసం ఆహారం తినాల్సి వస్తుంది. ఇక మీరు ప్రతిరోజు తినే పళ్లెంలో కచ్చితంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ఉండాలి. అలాగే ఫైబర్ నిండుగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని అన్నిటికంటా కాస్త తక్కువగా తినాలి. అలాగే కాల్షియం అందేందుకు పెరుగును తినాలి. పనీర్, పాలు, పెరుగు వంటి వాటిలో కాల్షియం అధికంగా అందుతుంది. రోజూ పెరుగన్,నం పాలు తాగినా కూడా కాల్షియం లోపం రాకుండా ఉంటుంది.

మీరు తినే ప్లేట్లో కనీసం నాలుగైదు రకాల ఆహారాలు ఉండేలా చూసుకోండి. ఒకేలాంటి ఆహారం తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. ధాన్యాలు, దుంపలు, మాంసాహారం, కోడిగుడ్డు, కూరగాయలు వంటివన్నీ మీ ప్లేట్లో కనిపించాలి. వాటితో వండిన ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. చివరలో కచ్చితంగా కప్పు పెరుగును మాత్రం మర్చిపోవద్దు.

అల్పాహారంలో ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లను తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది. అలాగే ఆకుపచ్చని ఆకుకూరలను వారంలో కనీసం నాలుగు సార్లు తినేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజూ పప్పు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఒకరోజు బియ్యంతో చేసిన అన్నం తింటే మరో రోజు గోధుమలు, ఇంకొక రోజు సజ్జలు, క్వినోవా, ఓట్స్ ఇలా ధాన్యాలను మారుస్తూ ఉండండి. దీనివల్ల మీరు బరువు పెరిగే అవకాశం కూడా తక్కువ. ఇక దుంపల విషయానికొస్తే బంగాళదుంపలు మీ బరువును పెంచేస్తాయి. కాబట్టి వాటిని బాగా ఉడికించాకే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినండి. కూరలు అధికంగా తినడం వల్ల పోషకాహార లోపం రాదు. అలాగే బరువు కూడా పెరగరు. కాబట్టి అన్నాన్ని తగ్గించి కూరలను అధికంగా తినేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో సాయపడతాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner