Pomegranate Recipe : దానిమ్మ గింజలతో రెసిపీ.. కొత్త రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
Pomegranate Recipe : ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. పండ్లు తీసుకోవడం చాలా మంచిది. అయితే దానిమ్మతో రెసిపీ తయారు చేసి చూడండి. కొత్తగా ఉంటుంది.
ఉదయం మనం తీసుకునే ఆహారం మెుత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రోజంతా మనం యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం తీసుకునే ఆహారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉదయం పూట మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే బలంగా ఉంటారు. అందులో భాగంగా పండ్లు తీసుకోవడం కూడా మంచిదే. రోజూ ఇడ్లీ, దోసె, వడలు తిని..తిని బోర్ కొడితే కొత్తగా దానిమ్మ గింజలతో బ్రేక్ ఫాస్ట్ చేయండి. అయితే దీనిని ఉదయం తినొచ్చు. అన్నం తినేప్పుడు సైడ్ డిష్‌లాగా వాడుకోవచ్చు.
దానిమ్మ ఫ్రైస్ కచ్చితంగా చాలా మందికి నచ్చుతుంది. దానిమ్మ గింజలతో రెసిపీ చేసేందుకు టైమ్ ఎక్కువగా పట్టదు. పదార్థాలు కూడా తక్కువే ఉంటాయి. నిజానికి దానిమ్మ పండు రుచికరమైనది మాత్రమే కాదు.., పోషకమైనది కూడా. మామూలుగా దానిమ్మ తినడానికి ఇష్టపడని వారి కోసం దానిమ్మ ఫ్రూట్ ఫ్రై చేస్తే కచ్చితంగా ఇష్టంగా తింటారు.
మీరు మీ కుటుంబం కోసం దానిమ్మతో రెసిపీ చేయాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి. దానిమ్మ గింజల రెసిపీ తయారు చేసే విధానం ఉంది.
దానిమ్మ గింజల రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దానిమ్మ గింజలు-1 కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 1, పెసరు పప్పు- 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము - 1/2 కప్పు, కరివేపాకు - 2 కట్టలు, నూనె - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి.
తయారీ విధానం
ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేరుగా ఉంచుకోవాలి.
తర్వాత ఓవెన్‌లో బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఉల్లి పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాలింపు వేయాలి.
తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి, కొద్దిగా ఉప్పు చల్లి మెత్తగా వేయించాలి.
తర్వాత దానిమ్మ గింజలు వేసి రుచికి సరిపడా ఉప్పు చల్లి కలపాలి.
చివరగా కొబ్బరి తురుము వేసి బాగా తిప్పితే రుచికరమైన దానిమ్మ గింజల రెసిపీ రెడీ.
దానిమ్మ ప్రయోజనాలు
దానిమ్మలో ఐరన్, మెగ్నీషియం సహా విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి అనేక పోషకాలు దొరుకుతాయి. తాజా దానిమ్మ గింజలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కనబరుస్తుంది. ఇది ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి దానిమ్మ ఎంతో ఆరోగ్యకరమైనది.
దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో వాపు, మంటను తగ్గిస్తాయి. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ దానిమ్మ రసం తాగటం వలన నరాల బలహీనతను తగ్గించుకోవచ్చు.
దానిమ్మ శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, కండరాలలో బలాన్ని పెంచుతాయి దానిమ్మ గింజలు. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని ఐరన్ పోషకం శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది.