మహిళలు నిత్యం ఇంటి పనుల్లోనే గడుపుతారు. వారు ఉద్యోగాలు చేస్తున్నా, చేయకపోయినా కూడా ఇంటి పనుల్లో గంటలు గంటలు కష్టపడాల్సిందే. ఇంటిల్లిపాదికి ఆ ఇంటి ఇల్లాలి కష్టాన్ని గుర్తించలేరు. ఒక తాజా అధ్యయనం ప్రకారం ఒక ఇల్లాలు ప్రతిరోజూ ఏడు గంటల పాటూ ఇంటి పనులు చేస్తుందని తెలిసింది.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు ‘టైమ్ యూజ్ సర్వే’ను విడుదల చేసింది. ఇది జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు భారతీయులు ఎలాంటి కార్యక్రమాలలో తమ సమయాన్ని గడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం. ఈ సర్వేలో నిద్ర, భోజనం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి స్వీయ సంరక్షణ కార్యక్రమాల నుండి వినోదం, సామాజిక కార్యక్రమాలు, ఇంటి పనుల వరకు వివిధ కార్యకలాపాలను పరిశీలించింది.
ఈ సర్వే ప్రకారం భారతీయులు తమ ఎక్కువ సమయాన్ని స్వీయ సంరక్షణలో గడుపుతున్నట్టు తేలింది. పురుషులు తమ సమయంలో 49.3 శాతం, మహిళలు 49 శాతం తమ సమయాన్ని స్వీయ సంరక్షణకు కేటాయిస్తున్నట్టు సర్వే చెప్పింది. ఇక మహిళలు స్వీయ సంరక్షణ తరువాత ఎక్కువ సమయం ఇంటి పనుల్లోనే గడుపుతున్నట్టు బయటపడింది.
మహిళలు, పురుషులు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసుకుంటే కాస్త ఆందోళన కలుగుతుంది. పురుషులు తమ సమయంలో 20.3 శాతం సమయాన్ని సామాజిక,వినోద కార్యక్రమాలకు కేటాయిస్తుంటే, మహిళలు 19.8 శాతం సమయాన్ని ఇంటి పనులు, సంరక్షణ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు.
రోజువారీ నిమిషాలలో, ఒక మహిళ ఇంటి పనులకు 426 నిమిషాలు (7 గంటలు 6 నిమిషాలు) ఖర్చు చేస్తుంటే, ఒక పురుషుడు కేవలం 163 నిమిషాలు (2 గంటలు 43 నిమిషాలు) మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. అంటే ఇంటి బాధ్యతలు మోస్తున్నదే ఆడవారే.
భారతీయ మహిళలు అధికంగా వంటగదిలో గడుపుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వృద్ధులైన కుటుంబ సభ్యుల, పిల్లల సంరక్షణలో బిజీగా ఉంటున్నారు. పురుషులు వార్తాపత్రిక చదువడం, స్నేహితులతో చిట్ చాట్ చేయడం వంటివి చేస్తున్నారు.
ఉద్యోగాల్లో కూడా లింగ వివక్ష ఉంది. మహిళల ఉద్యోగంలో గత సంవత్సరం కంటే కొంత మెరుగుదల కనిపించింది. 2024లో 25 శాతం మంది మహిళలు (15-59 సంవత్సరాలు) ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొన్నారు. 2019లో ఇది 21.8 శాతం మాత్రమే ఉంది. పురుషులకు రోజుకు సగటు ఉద్యోగ సమయం 473 నిమిషాలు ఉంటే, మహిళలకు 341 నిమిషాలు మాత్రమే ఉంది.
సంబంధిత కథనం