Sankranthi 2025: సంక్రాంతికి నిప్పుల మీద నుంచి పశువులను నడిపించే సాంప్రదాయం గురించి తెలుసా? ఇలా ఎక్కడ చేస్తారంటే
Sankranthi 2025: సంక్రాంతి సంబరాలు దేశమంతటా వైభవంగా జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ సంప్రదాయాలు ఉంటాయి. పాత మైసూరు ప్రాంతంలో పశువులను నిప్పు పైనుంచి దూకించే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఇది. ఇలా ఎక్కడ చేస్తారో తెలుసుకోండి.
సంక్రాంతి పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చేసుకునే అతి పెద్ద పండుగ. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాదంతా ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తారు. సంక్రాంతికి పట్టణాలన్నీ వెలవెల బోయి పల్లెటూళ్లు కళకళలాడుతాయి. సంక్రాంతికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంది. అన్నింట్లోనూ కొన్ని భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి రోజున పశువులను నిప్పులపై దాటించే లేదా నడిపించే సంప్రదాయం ఉంది.

నిప్పులపై పశువులు దూకడం
కర్ణాటకలోని మైసూరు-బెంగళూరు హైవే మీద ఉన్న పెద్ద పల్లెటూరు సిద్ధా లింగాపుర. ఆ ఊరిలో ఎక్కువ మందికి ఆవులు, గొర్రెలు, గేదెలు వంటి పశువులు ఉంటాయి. సంక్రాంతి వచ్చిందటే ఆవులు కూడా పండుగ కోసం సిద్ధమవుతాయి. సంక్రాంతి రోజు కుటుంబాలతో పాటు ఆవులు కూడా స్నానం చేస్తాయి. అది కూడా ముందుగా నూనెతో మర్థనా చేసుకుని ఆ తరువాత స్నానం చేయిస్తారు. తరువాత పశువులతో గ్రామంలో ఊరేగింపును నిర్వహిస్తారు. సాయంత్రం ఒకచోట నిప్పులు ఏర్పాటు చేసి అందరూ అక్కడ చేరుతారు. ఆ నిప్పుల మీద నుంచి పశువులను దూకిస్తారు. భయంతో పశువులు ఆ నిప్పును దాటుకుని వేగంగా పరుగులు పెడతాయి, అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కడెక్కడా ఇలా?
మైసూరు ప్రాంతంలోనే కాదు పాత మైసూరు ప్రాంతంలోని చాలా జిల్లాల్లో ఆవులను ఇలా నిప్పులపై నుంచి దాటించే సంప్రదాయం ఉంది.మైసూరు, మాండ్య, రామనగర, హసన్, తుమకూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్ లలో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.
మకర సంక్రాంతి అనేది భారతదేశం అంతటా జనవరి నెలలో జరుపుకునే పంటల పండుగ. దీనిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ప్రాథమికంగా, ఈ పండుగ సూర్యభగవానుడిని గౌరవించేందుకు రైతులు చేస్తారు. సంక్రాంతి అంటే శీతాకాలం ముగిసి వేసవి రోజులు ప్రారంభమవ్వడానికి ప్రతీక. మకర సంక్రాంతి అనేది సూర్యుని గమనంలో మార్పుతో ముడిపడి ఉంటుంది. నదుల్లో స్నానం చేయడానికి కూడా ఈ ఉత్తరాయణం పవిత్రమైన సమయం.
ఆవులు, ఎద్దులు, ఎద్దులతో కూడిన ఇంట్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతాయి. చలిని సైతం లెక్కచేయకుండా కుటుంబాలు ఉదయాన్నే చెరువులు, కాలువలు, జలాశయాలకు వెళ్లి పశువులకు స్నానం చేయిస్తాయి. వృద్ధులు, యువకులు ఎంతో ఉత్సాహంగా ఆవులను శుభ్రపరుస్తారు. పశువుల కొమ్ములను శుభ్రం చేస్తారు. కాళ్లు, శరీరానికి కూడా రంగులు వేస్తారు. పసుపును పూస్తారు. కొమ్ములను బెలూన్లు, అలంకరణ వస్తువులతో అలంకరిస్తారు. కొందరు ఆవులను దుప్పట్లతో కప్పి పూలు పెడతారు.
గ్రామంలోని ఆలయం దగ్గర పెద్దలు, చిన్న పిల్లలు చేరి ఈ కార్యక్రమం కోసం వేచి ఉంటారు. కొత్త బట్టలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. సాయంత్రం వేళ అలంకరించిన పశువులను ఊరేగించిన తరువాత ఒక వైపు గడ్డిని చల్లి, దానికి నిప్పు పెట్టి… వాటిపై నుంచి ఎగిరేలా చేశారు. ఎద్దుల తరువాత ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి ఇతర పశువులు నిప్పులపై నడిచేలా చేస్తారు. పశువుల యజమానులు కూడా తమ జీవులతో పాటూ మంటల పైనుంచి దాటుతారు. శీతాకాలంలో పశువులకు సోకిన బ్యాక్టిరియా, వైరస్, ఈగలను శుభ్రం చేసేందుకు ఇలా చేస్తారని చెప్పుకుంటారు.
సంబంధిత కథనం
టాపిక్