గుండె ఆరోగ్యానికి ఫ్లాసింగ్ వల్ల కలిగే లాభాలను ఒక వైద్య నిపుణుడు వివరించారు. దంతాలను ఫ్లాస్ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని చెప్పారు. నొప్పి నివారణ నిపుణుడు, అనస్థీషియాలజిస్ట్ అయిన డాక్టర్ కునాల్ సూద్ జూన్ 19న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఓ విషయం పంచుకున్నారు. రోజూ ఫ్లాసింగ్ చేస్తే నోటిలో వాపు తగ్గుతుందని, బ్యాక్టీరియా చేరదని చెప్పారు. దీనివల్ల స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు తేల్చినట్టు వివరించారు.
డాక్టర్ సూద్ తన పోస్ట్‌లో "ఫ్లాసింగ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందా? చిగుళ్ళు, గుండె రెండింటి రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ప్లేక్ వల్ల చిగుళ్ళ వాపు వస్తుంది. అప్పుడు పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్ లాంటి సూక్ష్మజీవులు రక్తంలోకి వెళ్తాయి. ఆ హానికరమైన బ్యాక్టీరియా సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP), IL-6 వంటి వాపు కారకాలను పెంచుతుంది. ఇవే కదా ధమనులను (రక్తనాళాలను) గట్టిపరిచి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి" అని వివరించారు.
"ఫ్లాసింగ్ నోటి నుంచి గుండెకు వెళ్ళే దారిని అడ్డుకుంటుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడంతో పాటు ఫ్లాస్ చేస్తే పళ్ళ మధ్య ఉండే 80 శాతం వరకు ప్లేక్ పోతుంది. కేవలం బ్రష్ చేస్తే ఇది సాధ్యం కాదు. 40,000 మందికి పైగా పెద్దలపై ఏడేళ్లపాటు జరిగిన ఓ స్టడీలో వారానికి కనీసం ఒక్కసారైనా ఫ్లాస్ చేసే వారికి ఇస్కీమిక్ స్ట్రోక్ రిస్క్ 22 శాతం తక్కువగా, కార్డియో-ఎంబోలిక్ స్ట్రోక్ రిస్క్ 44 శాతం తక్కువగా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ 12 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది" అని డాక్టర్ సూద్ పేర్కొన్నారు.
ఎంత తరచుగా ఫ్లాస్ చేయాలి అనే అంశాన్ని వివరిస్తూ "ప్రతిసారి ఫ్లాస్ చేసినప్పుడు చిగుళ్ళను దెబ్బతీయక ముందే బ్యాక్టీరియా పొరను మనం తొలగిస్తాం. వారానికి ఒక్కసారి చేసినా శరీరంలో వాపు తగ్గుతుంది. కానీ రోజూ చేస్తే మాత్రం బ్యాక్టీరియా వ్యాప్తి దాదాపు పూర్తిగా ఆగిపోతుంది." అని డాక్టర్ సూద్ స్పష్టం చేశారు.
(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా దంత ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా మీ దంత వైద్య నిపుణులను సంప్రదించండి.)