Sunday Motivation: ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేయండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది
Sunday Motivation: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయాన కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంతోపాటు రోజంతా సంతోషంగా సాగేలా చేస్తాయి.
Sunday Motivation: ఉదయం నిద్ర లేచాక మీరు మొదట ఏమి చేస్తారు? ఫోన్ చూడడం, సోషల్ మీడియా ఖాతాలను తెరవడం వంటివి చేస్తే ఆ రోజంతా మీకు గజిబిజిగానే ఉంటుంది. మీకు రోజంతా ప్రశాంతంగా సాగాలంటే ఆధ్యాత్మిక పద్ధతిలో మీ ఉదయాన్నే ప్రారంభించాలి. జీవితం చాలా బిజీగా సాగిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండగలిగే సమయం నిద్ర లేచిన వెంటనే దొరికే ఆ కాసేపే. ఉదయం పూట కొన్ని రకాల పనులను చేయండి. ఇవి ఆధ్యాత్మిక స్వభావాన్ని పెంచడంతోపాటు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.
ఉదయం లేచిన వెంటనే ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియా ఖాతాలు వంటివి చెక్ చేయడం మానేయండి. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. పావు గంట సేపు ధ్యానం చేయండి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఒక సౌకర్యవంతమైన స్థలంలో కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. ఏ ఆలోచనలను పెట్టుకోకండి. శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయం మీరు ఉత్సాహంగా ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ సమయంలోనే మీరు మీ గురించి ఆలోచించుకోవాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, దానికి ఏ మార్గాలను అనుసరించాలో కూడా ఒకచోట రాసుకోండి. కళ్ళు మూసుకొని మీ జీవితంలో జరిగిన మంచి విషయాలను తలచుకోండి. ఇది మీలో ఆనందాన్ని, సంతోషాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.
మరుసటి రోజు ఏం చేయాలో ముందు రోజే డైరీలో రాసుకోండి. మిమ్మల్ని ఆనంద పరచిన మూడు విషయాలు, మిమ్మల్ని కలవరపరిచిన మూడు విషయాలను ఒక చోట రాసుకోండి. ఇవి మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఒకరోజు ఉదయం రోజు వారి కార్యాకలాపాలు ప్రారంభించేముందు కాసేపు సూర్యకాంతిలో కూర్చోవడం చాలా ముఖ్యం. కాసేపు మార్నింగ్ వాక్ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఆరు బయట కూర్చుని కాఫీ తాగడం వంటివి చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది. సూర్యరశ్మి, ప్రకృతి మనకు మంచి స్నేహితులు. మీలో మానసిక శక్తిని పెంచుతాయి.
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఫోన్ ని చూడడం మాత్రం చేయవద్దు. లేచాక మీ పెంపుడు జంతువుతో కాసేపు ఆడుకోండి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీకు నచ్చిన కాఫీ, టీ తాగండి. కాసేపు వ్యాయామం చేయండి. యోగా, లాఫింగ్ వ్యాయామం వంటివి చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం మీకు నచ్చిన పనిని చేయడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. మీలో పాజిటివిటీ పెరుగుతుంది.