పీడకలలు ఎవరికీ నచ్చవు. భయపెడతాయి, కంగారు పెడతాయి, భయాందోళనకు గురిచేస్తాయి. ఇలా పీడకలలు రావడం సాధారణం అనుకుంటాం కానీ ఇది ఏమాత్రం సాధారణ విషయం కాదు. ఇవి భవిష్యత్తులో ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయనడానికి సంకేతాలని అధ్యయనం చెబుతోంది.
ది లాన్సెట్ కు చెందిన క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ఆటో ఇమ్యూన్ వ్యాధుల హెచ్చరిక సంకేతంగా ఈ పీడకలలను భావించాలి. లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారిలో ఎంతో మంది ఈ పీడకలలను ముందుగా అనుభూతి చెందినట్టు చెప్పారు. 676 మంది లూపస్ రోగులపై సర్వే చేశారు. వారిలో 100 మందిని లోతుగా విచారించారు.
రోగులు అనుభవించే నాడీ, మానసిక ఆరోగ్య లక్షణాల గురించి తెలుసుకున్నారు. వారి వ్యాధి మొదట ఎప్పుడు ప్రారంభమైందనే దానికి సంబంధించి వివరాలు సేకరించారు. మానసిక స్థితి మారడం, భ్రాంతులు కలగడం, వణుకు రావడం, అలసట వంటి లక్షణాలు ఎంతో మంది అనుభూతి చెందినట్టు చెప్పారు.
ఆటో ఇమ్యూన్ వ్యాధి బయటపడే ముందు ఎంతోమందికి కొన్ని రోజుల పాటూ పీడకలలు వేధించినట్టు గుర్తించారు. నాడీ సంబంధిత వ్యాధులు ఉన్న వారిలో కూడా ప్రారంభదశలో పీడకలలు వచ్చినట్టు కనిపెట్టారు. అధ్యయనంలో మంటల్లో కాలిపోయినట్టు, ఎవరో దాడి చేసినట్టు, ఎక్కడో చిక్కుకుపోయి నలిగిపోయినట్టు, లోయల్లో పడిపోయినట్టు వంటి పీడకలలు ఎంతో మందికి వచ్చినట్టు పరిశోధనల్లో పాల్గొన్న వారు చెప్పారు.
మరొక ముఖ్యమైన ఆవిష్కరణ ఏమిటంటే, ఈ పీడకలలు తరచుగా వ్యాధి మొదలవ్వడానికి ముందు వస్తాయి. పీడకలలు వస్తున్న వారిలో ఎక్కువగా ఆర్థరైటిస్, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చినట్టు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో లూపస్ రోగులలో 61% మందికి, రుమటాలజికల్ వ్యాధులు వచ్చిన వారిలో 34% మంది పీడకలల బారిన పడినట్టు గుర్తించారు.
లూపస్, ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు ఉన్న చాలా మందికి రోగ నిర్ధారణకు సుదీర్ఘ సమయం పట్టింది . ఇలా ఆటో ఇమ్యూన్ వ్యాధుల మొదటి లక్షణాలు మానసికమైనవిగా ఉంటాయి. ఏదేమైనా, అధ్యయనంలో చాలా మంది వైద్యులు ఇకపై పీడకలల లక్షణాల గురించి కూడా తమ వద్దకు వచ్చే రోగులను అడగాల్సి ఉంటుంది. రోగులు క్రమం తప్పకుండా పీడకలలు వస్తున్నాయని చెబితే వారికి ఎలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి వస్తుందో తెలుసుకోవాల్సి ఉంటుంది.
పీడకలలు వంటి లక్షణాలు రోగనిర్ధారణ చేసే ముఖ్యమైన అంశాలలో చేరవు. కాబట్టి రోగులు, వైద్యులు కూడా వీటిని పట్టించుకోరు. వ్యాధులను నిర్ధారించడానికి రక్త పరీక్షలు, మెదడు స్కాన్ చేయాల్సి ఉంటుంది.