Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఇవి ఆ సమస్యను సూచిస్తాయి-do not ignore if you experience these symptoms they indicate the problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఇవి ఆ సమస్యను సూచిస్తాయి

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఇవి ఆ సమస్యను సూచిస్తాయి

Haritha Chappa HT Telugu
Published Jul 08, 2024 11:07 AM IST

Health: శరీరానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో పోషకాలు లోపించినా కూడా ఆ సంకేతాలను శరీరం అందిస్తుంది.

పోషకాహార లోపం గురించి చెప్పే లక్షణాలు ఇవే
పోషకాహార లోపం గురించి చెప్పే లక్షణాలు ఇవే (shutterstock)

మన శరీరం అనారోగ్యం పాలైతే వెంటనే ఆ విషయాన్ని మెదడుకు తెలిసేలా చేస్తుంది. ఆ తరువాత అనారోగ్యం తాలూకు లక్షణాలు ఒక్కొక్కటిగా శరీరం బయటపెడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాంటే ఎన్నో రకాల పోషకాలు అవసరం. వాటిలో ఒక్కటి తక్కువైనా కూడా శరీరం వెంటనే స్పందిస్తుంది. కానీ చాలాసార్లు మనం శరీరం చూపించే ప్రతిచర్యలను అర్థం చేసుకోకుండా ఉంటాము. దీని వల్ల అవసరమైన పోషకాహారం అందక రోగాలు మొదలవుతాయి. కాబట్టి పోషకాహారలోపం ఏర్పడి… శరీరం అధికంగా ఎలాంటి సంకేతాలను చూపిస్తుందో తెలుసుకోండి. మీకు తరచూ ఆవలింతలు వచ్చినా, శరీరం చల్లగా అనిపిస్తున్నా మీలో కొన్ని విటమిన్లు లోపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. కాబట్టి శరీరంలోని ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, ఈ సమస్యలకు కారణమేమిటో తెలుసుకోండి.

నిద్ర లేకపోవడం వల్ల ఆవలింతలు రావడం చాలా సాధారణం. ఎవరైనా కంటి నిండా నిద్రపోక పోయినా, శరీరంలో చాలా అలసటగా ఉన్నా ఆవలింతలు అధికంగా వస్తాయి. ఆవలింత అనేది సహజమైన ప్రక్రియ. కానీ అలసట, బలహీనత కారణంగా కూడా పదేపదే ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆవలింతలు అధికంగా వస్తుంటే మీ శరీరంలో ఇనుము లోపించిందని అర్థం చేసుకోవాలి.

చేతులు, కాళ్ల కండరాల్లో తరచూ నొప్పి వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. చిన్న పని చేసినా కూడా శరీరం నొప్పులు పెడుతుంటే మీకు మెగ్నీషియం లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో నొప్పులు అధికంగా వస్తాయి. కండరాలు తిమ్మిరిగా అనిపిస్తాయి.

చేతులు, కాళ్ళలో జలదరింపు

చేతులు, కాళ్ళలో జలదరింపులాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తాయి. విటమిన్ బి12 లోపం శరీరాన్ని బలహీనపరుస్తుంది. దీని వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వ్యక్తికి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

వెన్నులో తరచూ నొప్పిగా అనిపిస్తున్నా, కాళ్లలో నొప్పి ఉన్నా, శరీరంలో విటమిన్ డి లోపించడం వల్లనే వస్తుంది. ఎముకల నొప్పులే కాదు విటమిన్ డి లోపం వల్ల తరచూ అనారోగ్యానికి గురికావడం, అధిక ఆందోళన, డిప్రెషన్, గాయాలు త్వరగా నయం కాకపోవడం వంటివి కూడా జరుగుతాయి.

అయోడిన్ లోపం

సాధారణ వ్యక్తులతో పోలిస్తే మీరు తరచూ జలుబు బారిన పడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. తరచూ జలుబు బారిన పడడం అనేది అది అయోడిన్ లోపం వల్ల కలుగుతుంది. ఇది హైపోథైరాయిడ్ సమస్య లక్షణం. కొన్నిసార్లు రక్తం లేకపోవడం, డయాబెటిస్, విటమిన్ బి12 లోపం కూడా జలుబుకు కారణం. ఈ లక్షణాలు శరీరానికి సరైన పోషకాలు అందడం లేదని సూచిస్తాయి. కాబట్టి పైన చెప్పిన ఏ లక్షణాలు శరీరంలో కనిపించినా తేలికగా తీసుకోకూడదు. వెంటనే అవసరమైన ఆహారాన్ని తినాలి. వైద్యులను కలిసి తగిన సప్లిమెంట్లను వాడాలి.

Whats_app_banner