Sunday Motivation: జీవితంలో ఈ రెండు ఎదురైనప్పుడు బాధపడొద్దు.. ఎన్నో పాఠాలు నేర్పుతాయి
Sunday Motivation: జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఆ పరిస్థితులే గురువులుగా చాలా విషయాలు అర్థమయ్యేలా చేస్తాయి. ఎదురుదెబ్బ తరిగినా మళ్లీ ఎలా పైకి లేవాలో చెబుతాయి.
ఎక్కువ శాతం మంది మనుషుల జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒడిదొడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వ్యాపారం చేసే వారైనా, ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా, ఏ పని చేసే వారైనా.. పరిస్థితులు మారుతూనే ఉంటాయి. అత్యంత సంతోషించే విశేషాలు ఉంటాయి.. కుంగిపోయే పరిస్థితులు ఎదురవ్వొచ్చు. అయితే, జీవితంలో రెండు విషయాలు మాత్రం గొప్ప గుణపాఠాలు నేర్పుతాయి. అందులో ఒకటోది ‘ఓటమి’ అయితే.. రెండోది 'కష్టాలు'. దాదాపు ప్రతీ ఒక్కరి జీవితంలో ఇవి ఎదురవుతాయి. అయితే, ఆ పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తారో, ఎలా ముందుకు సాగుతారనే విషయాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ రెండు పరిస్థితులు ఏం నేర్పిస్తాయో ఇక్కడ చూడండి.
ఓటమి నేర్పించేది ఇవే
ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓటమి ఎదురవడం సహజమే. ఉద్యోగం కోల్పోవడమో, వ్యాపారంలో నష్టం రావడమో, పరీక్షల్లో ఫెయిల్ అవడమో.. ఇలా జీవితంలో కొన్నిసార్లు ఓటములు ఎదురవుతుంటాయి. అయితే, భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే అనుభవాన్ని ఆ ఓటమే నేర్పిస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో.. ఎలా ముందుకు సాగాలో అనే విషయాలను ఆలోచించేలా చేస్తుంది. ఏం చేస్తే మళ్లీ భవిష్యత్తులో మళ్లీ ఆ ఓటమి ఎదురుకాకుండా ఉంటుందోననే ఆలోచనను రేకెత్తిస్తుంది. సమాధానం కోసం వెతికితే గొప్ప గుణపాఠాలను నేర్పిస్తుంది.
అందుకే ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా.. ఎందుకలా జరిగిందనే విషయాన్ని లోతుగా విశ్లేషించుకోవాలి. దాన్ని జయించేందుకు మార్గాలు వెతకాలి. వాటిపై కృషి చేయాలి. ఇలా చేస్తే సక్సెస్ అవడం ఖాయం. జీవితంలో ఒకానొక సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే.. అప్పట్లో ఓడిపోవడమే జీవితంలో పైకి తెచ్చేందుకు దోహదం చేసిందని ఆనందించే సమయం కూడా వస్తుంది. ఓటమి నేర్పే నిజమైన పాఠాలు, అనుభవాలు.. మరేది మనకు చెప్పలేదు. అందుకే ఓటమిని సవాలుగా తీసుకొని అధిగమించాలి. గెలుపునకు మెట్టుగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
కష్టాలు.. పోరాటాన్ని నేర్పుతాయి
చాలా మందికి ఓటములు ఎప్పుడో ఒకసారి ఎదురైతే.. కష్టాలు మాత్రం తరచూ పలుకరిస్తుంటాయి. జీవితంలో కష్టాలు సర్వసాధారణం. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరి పరిస్థితులను బట్టి కష్టాలు వస్తుంటాయి. ఒక్కోసారి ఊహించనివి కూడా ఎదురవుతాయి. అయితే, జీవితంలో కష్టాలు నిత్య పోరాటాన్ని నేర్పుతాయి. వాటిని ఎలా అధిగమించాలన్న కసిని పెంచుతాయి. కష్టాలను దాటేందుకు ఏం చేయాలో అన్న ఆరాటంలో కొత్త ఆలోచనలు పుడతాయి. కష్టాలతో కుంగిపోకుండా.. ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తే జీవితంలో ఎదిగేందుకు అవే తోడ్పడతాయి.
జీవితంలో ప్రాథమిక దశలోనే కష్టాలను ఎదుర్కొంటే.. ఆ తర్వాత వచ్చేవి పెద్దవైనా దాటేందుకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించే నేర్పరి తనం పెరుగుతుంది. ఎదురుదెబ్బలను సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కష్టాలు ఎదురవడం వల్ల జీవితంలో మనకు నిజంగా మద్దతుగా ఉండేదెవరో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలోని ప్రతీ దశలో ఎదురయ్యే కష్టాలు.. పోరాటపటిమను, సమస్యలను అధిగమించే తత్వాన్ని నేర్పుతాయి. జీవితంలో మొదట కష్టాలను ఎదుర్కొన్న చాలా మంది ఉన్నత శిఖరాలకు చేరారు. ఇదే స్ఫూరితో కష్టాలను ఎదురైనప్పుడు వాటిని అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్లాలి. ప్రతీ కష్టం వెనుక ఓ కారణం ఉంటుంది. దాన్ని గుర్తించి.. పరిష్కరించి మళ్లీ అది పునరావృతం కాకుండా చూసుకోవాలి.