DIY Monsoon Hair Care। వర్షాకాలంలో మీ జుట్టు సంరక్షణ కోసం సహజమైన హెయిర్ ప్యాక్‌లు!
DIY Monsoon Hair Care: వర్షాకాలంలో మీ జుట్టు సంరక్షణ కోసం కొన్ని హెయిర్ ప్యాక్ ల రెసిపీలను అందిస్తున్నాము. వీటిని ఈ సీజన్ లో తప్పకుండా ప్రయత్నించి చూడండి.
DIY Monsoon Hair Care: మాన్‌సూన్ అనేది ఒక రొమాంటిక్ సీజన్. వర్షంలో తడుస్తూ వాన చినుకులను ఆస్వాదించాలని చాలామందికి అనిపిస్తుంది. ప్రత్యేకంగా అమ్మాయిలు ఎక్కువగా వర్షంలో తడవాలని ఆరాటపడతారు. కానీ, ఈ వర్షపు నీరు మీ అందమైన కురులను దెబ్బతీస్తుంది. జుట్టు చిక్కులు పడటం, చిట్లిపోవడం లేదా రాలిపోవడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో మీ జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం మీరు పార్లర్లకు పరుగులు తీయాల్సిన పనిలేదు, హెయిర్ కేర్ ఉత్పత్తుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీ జుట్టును కాపాడుకోవచ్చు, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ మీకు మీరుగా ఇంట్లోనే స్వంతంగా తయారు చేసుకోగల కొన్ని హెయిర్ ప్యాక్ ల రెసిపీలను అందిస్తున్నాము. వీటిని ఈ వర్షాకాలం సీజన్ లో ప్రయత్నించి చూడండి.
ట్రెండింగ్ వార్తలు
వేప- శనగ పిండి హెయిర్ ప్యాక్
సిల్కీ హెయిర్ పొందాలనుకునే వారు ఈ హెయిర్ ప్యాక్ (DIY Neem- Gram Hair Pack) జుట్టుకు వర్తించాలి. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల వేప పొడి, 2 టీస్పూన్ల శనగపిండిని తీసుకొని కొన్ని నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌గా చేయండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టు, తలపై ఉదారంగా అప్లై చేయండి. సుమారు 30 నిమిషాలు ఆరనివ్వండి, ఆ తర్వాత నీటితో కడిగేసుకోండి.
శనగపిండి మీ స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది, వేప జుట్టును మెరిసేలా చేస్తుంది, చుండ్రు నివారణ సహా మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
నిమ్మ- మందార హెయిర్ ప్యాక్
డ్యామేజ్ ఫ్రీ హెయిర్ కోసం ఈ హెయిర్ ప్యాక్ (DIY Lemon Hibiscus Hair Pack) వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ చేయడానికి పెరుగు, నిమ్మరసం, ఆవాల నూనెను మిక్స్ చేసి, తలకు పట్టించండి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. దీని తర్వాత కొన్ని ఇప్పుడు కొన్ని మందార ఆకులను నీటిలో వేసి మరిగించాలి. అందులో ఒక నిమ్మకాయను పిండండి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచి మళ్లీ తేలికపాటి షాంపూతో కడిగేయండి. అనారోగ్యకరమైన, దెబ్బతిన్న జుట్టు కోసం, ఈ ప్యాక్ కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
గుడ్డు, నిమ్మకాయ - తేనె హెయిర్ ప్యాక్
ఆయిల్ ఫ్రీ స్కాల్ప్ కోసం ఈ హెయిర్ ప్యాక్ (DIY Egg Lemon Honey Hair Pack) వేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు గుడ్డు సొనలు, అలాగే ఒక గుడ్డులోని తెల్లసొన భాగం తీసుకోండి, ఇందులో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మీద అప్లై చేయండి, ఆరిపోయాక డీప్ క్లెన్సింగ్ షాంపూతో కడగాలి. ఇది మీ స్కాల్ప్ ను జిడ్డు లేకుండా, శుభ్రం చేస్తుంది. అలాగే జుట్టును మృదువుగా చేస్తుంది.
ఉసిరి -కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్
జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఈ హెయిర్ ప్యాక్ (DIY Amla Coconut Oil Hair Pack) వేసుకోవాలి. దీని కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకొని అందులో కొన్ని ఎండిన ఉసిరి ముక్కలను వేసి మరిగించండి, ఆపై ఈ నూనెను మీ జుట్టుకు పట్టించాలి. వారానికి రెండుసార్లు మీ జుట్టుకు అప్లై చేయండి. ఇది మీ తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పోషణను అందిస్తుంది. ఇది మీ జుట్టును రిపేర్ చేస్తుంది, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
సంబంధిత కథనం