Dish washing Powder: గిన్నెలు తోమే లిక్విడ్లు కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా సేంద్రియ పద్దతిలో తయారుచేసుకోండి-dish washing powder instead of buying dishwashing liquid make it organically at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dish Washing Powder: గిన్నెలు తోమే లిక్విడ్లు కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా సేంద్రియ పద్దతిలో తయారుచేసుకోండి

Dish washing Powder: గిన్నెలు తోమే లిక్విడ్లు కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా సేంద్రియ పద్దతిలో తయారుచేసుకోండి

Haritha Chappa HT Telugu

Dish washing Powder: గిన్నెలు తోమేందుకు డిటర్జెంట్లు, లిక్విడ్లు వాడుతాము. వాటిలో ఎక్కువగా రసాయనాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటి బదులు ఇంట్లోనే గిన్నెలు తోమే పొడిని తయారు చేసుకొని వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది.

గిన్నెలు తోమేందుకు సేంద్రియ వాషింగ్ పౌడర్ (pixabay)

Dish washing Powder: రసాయనాలు ఉండే ఉత్పత్తులు కన్నా సేంద్రీయ పద్ధతిలో తయారైన ఉత్పత్తులు వాడడం ఆరోగ్యానికి మంచిది. అయితే గిన్నెలు తోమే పౌడర్, సబ్బులు, లిక్విడ్లు వంటి వాటిలో రసాయనాలు ఎక్కువగా కలుపుతున్నారు. వాటితో తోమిన గిన్నెలను ఎంత సేపు కడిగినా నురగ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే గిన్నెలు తోమే పొడిని తయారు చేసుకుంటే మంచిది. ఇది సహజంగానే మురికిని వదిలిస్తుంది. ముఖ్యంగా రసాయన రహితంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇలాంటి కీడు జరగదు.

సేంద్రీయ పద్ధతిలో గిన్నెలు తోమే పొడి ఎలా తయారు చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని హెర్బల్ డిష్ వాషింగ్ పౌడర్ అంటారు. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. అలాగే నిమ్మ తొక్కలను కూడా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వేప ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. బేకింగ్ సోడాను కొని రెడీగా పెట్టుకోవాలి. కుంకుడుకాయలు కొన్ని రెడీగా పెట్టుకోవాలి. లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ ను ఈ తయారీలో వాడుకోవచ్చు. మీకు నచ్చిన నూనెను కొని పెట్టుకోండి .ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యాక తయారు చేయడం ఎలాగో చూద్దాం.

హెర్బల్ డిష్ వాషింగ్ పౌడర్ తయారీ

కుంకుడుకాయలను బాగా చితకొట్టి పొడిలా చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్ లోనే బేకింగ్ సోడా, నిమ్మ తోక్కల పొడి, నారింజ తొక్కల పొడి, వేప పొడి వేసి బాగా మిక్సీ పట్టాలి. అది మెత్తటి పొడిలా అవుతుంది. అందులోనే మీరు ఏ ఆయిల్ వాడాలనుకుంటున్నారో ఆ ఆయిల్ ని కూడా కొన్ని చుక్కలు వేయండి. యూకలిప్టస్, లావెండర్, టీ ట్రీ ఆయిల్... ఇలా మీకు నచ్చిన ఆయిల్ ని ఇందులో ఎంచుకోవచ్చు. అలా కలిపాక ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గాలి చొరబడిన కంటైనర్ లో వేసి మూత పెట్టండి.

గిన్నెలు తోమడానికి ముందు ఒక చిన్న కప్పులో ఒక స్పూను పొడిని వేసి నీళ్లు వేయండి. చేత్తోనే కలిపితే నురగలాగా వస్తుంది. ఇప్పుడు స్క్రబ్బర్ అందులో ముంచి గిన్నెలను తోముకోండి. ఎంతటి మురికైనా సులువుగా వదిలిపోతుంది.

ఇందులో రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎలాంటి కీడు జరగదు. అలాగే వేప పొడి, నిమ్మ తొక్కల పొడి, నారింజ తొక్కల పొడి వంటివి ఇందులో ఉన్నాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాని పూర్తిగా చంపేస్తాయి. అలాగే ఎలాంటి రసాయనాలు ఇందులో వాడలేదు. కాబట్టి చేతులు మందంగా మారకుండా సున్నితంగానే ఉంటాయి. అంతేకాదు ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పెద్దగా దీనికి ఖర్చవ్వదు. ఒకసారి తయారు చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఉపయోగపడుతుంది.

ఈ పొడిని ఏడాదికి సరిపడా ఒకసారి చేసి పెట్టుకున్నా మంచిదే. నిల్వ ఉంటుంది. ఇత్తడి వస్తువులు, వెండి వస్తువులు తోమడానికి కూడా ఈ పొడి ఉపయోగపడుతుంది.