Tips for Rosy Lips । గులాబీ రంగు పెదాలను పొందాలంటే.. ఈ రహస్యాలు తెలుసుకోండి!
Tips for Rosy Lips: పెదవులు సహజమైన మెరుపుతో వికసించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఆ అందమైన రహస్యాలను మీరూ ఇక్కడ తెలుసుకోండి.
Tips for Rosy Lips: ముఖంలో విచ్చుకునే చిరునవ్వు మీ అందాన్నే కాదు, మీ వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది. మీ చిరునవ్వు అందంగా కనిపించాలంటే మీ పెదాలు కూడా అందంగా, ఆరోగ్యంగా సహజమైన గులాబీ రంగులో ఉండాలి. పెదాలు అనేక విషయాల్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి మీ భావ వ్యక్తీకరణకు సొగసును జోడిస్తాయి. మీ పెదాలు చిన్న నవ్వుతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి, ముతిముడుపుతో కొంటె సైగ చేస్తాయి, హృదయపూర్వకమైన ముద్దుతో మీ బంధాన్ని దృఢంగా బంధిస్తాయి. ఇంతటి సామర్థ్యం కలిగిన మీ పెదవులను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.
కానీ, హైపర్పిగ్మెంటేషన్, పెదవులు నల్లబడటం, పొడిబారటం కారణంగా నిర్జీవంగా కనిపిస్తాయి. మీ పెదవులను పూర్వ వైభవానికి తీసుకురావడానికి, సహజమైన మెరుపుతో వికసించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుర్వేద నిపుణురాలు శ్రీధ, ఆరోగ్యకరమైన గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని ఆయుర్వేద రహస్యాలు తెలియజేశారు. ఆ అందమైన రహస్యాలను మీరూ ఇక్కడ తెలుసుకోండి.
మీ పెదాలను హైడ్రేట్‌గా ఉంచండి
పెదవుల సంరక్షణలో ప్రాథమిక దశల్లో వాటిని తేమగా ఉంచడం. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీ పెదాలను తేమగా, లోపలి నుండి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు అధికంగా ఉండే పండ్లను, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడవచ్చు. అదే సమయంలో పెదాలను కొరకటం, నొక్కటం చేయకూడదు.
ఎక్స్‌ఫోలియేషన్
పెదాలు పొడిబారి దానిపై చర్మం పొరలుగా మారినపుడు మీ పెదాలను ఎక్స్‌ఫోలియేషన్ చేయండి. వారానికి రెండుసార్లు, మీ పెదాలను సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ సెషన్‌తో విలాసపరచండి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, పెదాల కింది చర్మ పొరల్లో దాగి ఉన్న అందాన్ని ఆవిష్కరిస్తుంది. హోమ్‌మేడ్ లిప్ స్క్రబ్‌ను ఉపయోగించి సున్నితంగా మీ పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
హోమ్‌మేడ్ లిప్ స్క్రబ్ (DIY Homemade Lip Scrub)కోసం, కొన్ని బీట్‌రూట్ ముక్కలను ఒక టీస్పూన్ కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో కలపండి, అలాగే కొద్దిగా చక్కెరను కూడా కలపండి. ఈ మిశ్రమంలో మృదువైన టూత్ బ్రష్‌ను ముంచి, మీ పెదాలపై వృత్తాకార కదలికలతో సున్నితంగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి మీ చర్మానికి పోషణను అందించడానికి అవకాశం ఇవ్వండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ పెదవులు సిల్కీ మృదువుగా, ప్రపంచాన్ని జయించటానికి సిద్ధంగా ఉంటాయి.
SPF లిప్ బామ్‌ను వాడండి
సూర్యరశ్మికి మీ పెదాలు దెబ్బతినకుండా, నల్లగా మారకుండా వాటిని సంరక్షించండి. పెదాలకు SPF కలిగిన లిప్ బామ్‌ను అప్లై చేయడం వల్ల మీ పెదాలను కఠినమైన UV కిరణాల నుండి రక్షించడంలో సహాయపడవచ్చు. పొడిబారడం, పగుళ్లను అరికట్టడం ద్వారా మృదువుగా ఉంచవచ్చు.
లిప్ మాస్క్‌లతో పాంపరింగ్
లిప్ మాస్క్‌లతో మీ పెదవులను కాస్త ముద్దు చేయండి. లిప్ మాస్క్‌లు మీ పెదవుల చర్మంలోకి లోతుగా ప్రవేశిస్తాయి, వాటికి లోపలి నుండి పోషణ ఇస్తాయి, హైడ్రేట్ చేస్తాయి. ఈ DIY లిప్ మాస్క్‌తో కరుకుదనం, ఫ్లాకీనెస్, డ్రైనెస్‌కి వీడ్కోలు చెప్పండి.
దానిమ్మ గింజలను చూర్ణం చేసి, వాటిని మిల్క్ క్రీం లేదా రోజ్ వాటర్‌తో కలపడం ద్వారా టేస్టీ పేస్ట్‌ను తయారు చేయండి. ఈ ఆహ్లాదకరమైన మిశ్రమాన్ని మీ పెదాలకు అప్లై చేసి, 15 నిమిషాలు ఉంచండి, ఆపై ఆరాక శుభ్రం చేసుకోండి. దానిమ్మ గింజలు ముదురు రంగు పెదవులను గులాబీ రంగులో మెరిసేలా చేస్తాయి.
లిప్‌స్టిక్ వేసే ముందు లేయర్ వేయండి
మీ పెదవులకు లిప్‌స్టిక్‌లు , లిప్ గ్లోస్‌లతో మెరుగులు అద్దే ముందు, వాటికి కొంత రక్షణ అవసరం. హెర్బల్ లిప్ బామ్, లిప్ సీరమ్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా లిప్ బటర్‌తో విలాసవంతమైన లేయరింగ్ వేయండి. ఇది మీ సౌందర్య సాధనాల కోసం సరైన కాన్వాస్‌ను సృష్టిస్తుంది. రసాయనాలతో కూడిన కాస్మెటిక్స్ దుష్ప్రభావాల నుంచి పెదాలను కాపాడుతుంది. మీ విలువైన పెదవుల ఆరోగ్యం, అందం కోసం కాస్మెటిక్స్ కు బదులుగా హెర్బల్ ఉత్పత్తులను వాడండి.
సంబంధిత కథనం