పౌర్ణమి వెన్నెలలో ధ్యానం చేస్తే ఇన్ని లాభాలా? ఇది తెలిస్తే ఎవ్వరూ మిస్ చేయరు!-discover the incredible benefits of full moon meditation and wont want to miss this full moon day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పౌర్ణమి వెన్నెలలో ధ్యానం చేస్తే ఇన్ని లాభాలా? ఇది తెలిస్తే ఎవ్వరూ మిస్ చేయరు!

పౌర్ణమి వెన్నెలలో ధ్యానం చేస్తే ఇన్ని లాభాలా? ఇది తెలిస్తే ఎవ్వరూ మిస్ చేయరు!

Ramya Sri Marka HT Telugu

పౌర్ణమి రోజున వెన్నెల ఎంత అందంగా ఉంటుందో ఆ వెన్నెల్లో కూర్చుని ధ్యానం చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటుందట. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? దీన్నే ఫుల్ మూన్ మెడిటేషన్ అని అంటారు. ఇలా పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయట. అవేంటో ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుందాం రండి.

పున్నమి వెన్నెల్లో ధాన్యం చేస్తున్న యువతి

పౌర్ణమి రాత్రి వెన్నల వెలుగులు అంటే చాలా మందికి ఇష్టం. ఈ వెన్నెల కాంతి కేవలం కంటికి ఇంపుగానే కాదు మన మానసిక ఆరోగ్యానికి, శరీరానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే పౌర్ణమి రాత్రి చేసే ధ్యానానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీన్నే పౌర్ణమి ధ్యానం లేదా ఫుల్ మూన్ మెడిటేషన్ అంటారు. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇది ఎంతో పురాతనమైన,శక్తివంతమైన ధ్యాన పద్ధతి. ఈ ధ్యానంలో మనం చంద్రుని శక్తిని ఒడిసిపట్టుకుని మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చట. అంతేకాదు ఇది మన అంతర్ దృష్టిని మరింత బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఈసారి మే 12న అంటే నేడు మనం బుద్ధ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక చింతనలకు, మానసిక ప్రశాంతతకు బుద్ధ పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున పౌర్ణమి వెన్నెల్లొ ధ్యానం చేయడం మరింత శక్తినిస్తుంది, మనలోని సానుకూల శక్తిని పెంచుతుందట. ఎలాగో తెలుసుకుందాం రండి.

పౌర్ణమి రాత్రి ధ్యానం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:

ప్రశాంతమైన మనస్సును ప్రోత్సహిస్తుంది:

పౌర్ణమి వెన్నెల్లో ధ్యానం మనస్సును శాంతపరచడానికి, భావోద్వేగాలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఇది మనలో ప్రశాంతమైన ఫలింగ్ కలిగిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. పౌర్ణమి వెన్నెల శక్తి మన శరీరంలోని నీటి శాతంపై ప్రభావం చూపుతుందని, ఈ సమయంలో చేసే ధ్యానం జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతర్ దృష్టిని పెంచుతుంది:

పౌర్ణమి మనోశక్తిని, ఊహాశక్తిని పెంచుతుంది. ఈ సమయంలో చేసే ధ్యానం మనలోని అంతర్ దృష్టిని మేల్కొల్పుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గిస్తుంది:

ప్రశాంతమైన మనస్సు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పౌర్ణమి ధ్యానం ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో పరోక్షంగా తోడ్పడుతుంది.మనస్సును ప్రశాంతంగా ఉంచడం ద్వారా, ఆందోళన,డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది:

ఇది మనలోని భయాలు, అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది, తద్వారా వ్యక్తిగత వృద్ధికి, స్వీయ-అవగాహనకు మార్గం సుగమం చేస్తుంది.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది:

మనలోని సానుకూల శక్తులను పెంచడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనం మరింత ధైర్యంగా, నమ్మకంగా ఉండేలా చేస్తుంది. క్రమం తప్పకుండా పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మనస్సు ఏకాగ్రత,నిలకడ పెరుగుతాయి.

నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది:

పౌర్ణమి వెన్నెలకు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించే శక్తి ఉందని నమ్ముతారు. ఇది మనకు సానుకూల భావాలను కలిగిస్తుంది.అంతే కాదు ఈ ధ్యానం మనల్ని విశ్వంతో మరింత లోతుగా అనుసంధానం చేస్తుంది.

క్రియేటివిటీ పెరుగుతుంది:

మనస్సు ప్రశాంతంగా,స్వేచ్ఛగా ఉన్నప్పుడు, సృజనాత్మక ఆలోచనలు సులభంగా వస్తాయి. పౌర్ణమి ధ్యానం సృజనాత్మకతను పెంచడానికి సహాయపడుతుంది.

పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. పౌర్ణమి ధ్యానం మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ముఖ్యంగా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అలవాటు లేనివారికి కాస్త నొప్పులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ధ్యానం చేసేవారు ఒక మెత్తని కుషన్ లేదా కుర్చీలో కూర్చుని ధ్యానం చేయండి. మీకు సౌకర్యంగా ఉంటే పడుకొని కూడా చేయవచ్చు. ధ్యానం ప్రారంభించే ముందు కొద్దిగా స్ట్రెచింగ్ చేయడం మరీ మంచిది.

2. పౌర్ణమి శక్తి కొన్నిసార్లు మనస్సును కొంచెం ఎక్కువ ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఒకే చోట స్థిరంగా కూర్చోవడం లేదా ఒక విషయంపై ఏకాగ్రత నిలపడం కష్టంగా అనిపించవచ్చు. ఇది చాలా సహజమైన విషయం. అలాంటప్పుడు మీలో కలుగుతున్న ఆలోచనలు, భావాలపై శ్రద్ధ పెట్టండి, వాటిని గమనించండి. ఆ తర్వాత నెమ్మదిగా మీ శ్వాసపై లేదా మీరు ఎంచుకున్న ధ్యానంపై దృష్టి పెట్టండి. క్రమంగా ఇది సులభమవుతుంది.

3. ధ్యానం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు మనసులోకి వస్తుంటాయి. అలా రానివ్వండి. ధ్యానం చేసేటప్పుడు కేవలం వర్తమాన క్షణంలో ఉండటానికి ప్రయత్నించండి. దేనినీ వెనక్కి నెట్టడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ ఇది మీకు కష్టంగా అనిపిస్తే కాసేపు ధ్యానం ఆపండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.