డ్రై ఫ్రూట్స్‌తో రుచికరమైన లస్సీ తయారు చేసుకోండి, చల్లదనంతో పాటు ప్రొటీన్లను ఆస్వాదించండి!-discover the deliciousness of homemade dry fruit lassi a simple way to enjoy a refreshing drink loaded with protein ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  డ్రై ఫ్రూట్స్‌తో రుచికరమైన లస్సీ తయారు చేసుకోండి, చల్లదనంతో పాటు ప్రొటీన్లను ఆస్వాదించండి!

డ్రై ఫ్రూట్స్‌తో రుచికరమైన లస్సీ తయారు చేసుకోండి, చల్లదనంతో పాటు ప్రొటీన్లను ఆస్వాదించండి!

Ramya Sri Marka HT Telugu

వేసవి కాలం వచ్చిందంటే చాలు, శరీరం చల్లగా ఉండాలనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌తో లస్సీని తాగితే, ఇది కేవలం చల్లదనాన్ని మాత్రమే కాదు, మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లను కూడా అందిస్తుంది. లస్సీ ప్రోబయోటిక్ కావడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది.

ఇంట్లోనే లస్సీ తయారుచేసుకోవడం ఎలా?

వేసవిలో చల్లని పానీయం ఎవరు కాదనగలరు. అందులో అది ప్రొటీన్స్ అందించే డ్రింక్ అయితే ఇంకా బెస్ట్ కదా. అందుకే సమ్మర్లో ఎటువంటి కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఫుడ్ తయారుచేసుకోండి. ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయి ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన డ్రింక్ తయారు చేసుకోండి. దీని కోసం మీరు ఎక్కువ కష్టించాల్సిన అవసరం లేదు. వేసవిలో ఇంట్లో లస్సీ తయారు చేయడం చాలా సాధారణం. సాధారణంగా కాకుండా లస్సీని ఇంకాస్త ప్రత్యేకంగా, మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తాగుతారు. మళ్ళీ మళ్ళీ తాగాలని కోరుకుంటారు.

కావలసిన పదార్థాలు

  • పెరుగు (తాజాగా) - 1 కప్పు
  • జీడిపప్పు - 10 పప్పులు
  • బాదం - 10 పప్పులు
  • నల్ల ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
  • గుమ్మడికాయ గింజలు - 1 టీస్పూన్
  • పుచ్చకాయ గింజలు - 1 టీస్పూన్
  • సూర్యకాంత గింజలు - 1 టీస్పూన్
  • జర్మలకాయ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) - 1 టీస్పూన్
  • అక్రోట్లు - 2-3 ముక్కలు
  • మఖానాలు (లోటస్ సీడ్స్) - 5-6
  • ఎండిన కొబ్బరి తురుము - 1 టీస్పూన్
  • కుంకుమ పువ్వు (కేసరి) - కొద్దిగా
  • సోంపు - చిటికెడు (రుచి కోసం)
  • చక్కెర లేదా పంచదార - రుచికి తగినంత
  • చిల్‌డ్ వాటర్ - కొద్దిగా (అవసరమైతే)

డ్రై ఫ్రూట్ లస్సీ తయారీ విధానం:

  1. ముందుగా జీడిపప్పు, బాదం, ద్రాక్షలను 2-3 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
  2. పెరుగును చల్లబరచడానికి కాసేపటి వరకూ ఫ్రిజ్‌లో ఉంచండి.
  3. లస్సీ తయారు చేసే ముందు నానబెట్టిన బాదం గింజలను పొట్టు తీయండి.
  4. మిక్సీ జార్‌లో చల్లటి పెరుగు, రుచికి తగినంత చక్కెర, కొద్దిగా చిల్డ్ వాటర్ పోయండి.
  5. ఇప్పుడు అందులో నానబెట్టిన జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, సూర్యకాంత గింజలు, జర్మలకాయ గింజలు, సోంపు వేయండి.
  6. అవన్నీ వేసిన తర్వాత మిక్సీ సహాయంతో మెత్తగా బ్లెండ్ చేయండి.
  7. తయారైన లస్సీని ఒక గాజు గ్లాసులో పోసుకోండి.
  8. పైన చిన్నగా తరిగిన అక్రోట్ ముక్కలు, చిన్నగా తరిగిన మఖానాలు, కొద్దిగా ఎండిన కొబ్బరి తురుము వేయండి.
  9. చివరగా కుంకుమ పువ్వు రేకులతో అలంకరించి చల్లగా అందించండి.
  10. ఈ రుచికరమైన డ్రై ఫ్రూట్ లస్సీని తాగడం వల్ల మీకు శక్తితో పాటు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి!

ఈ లస్సీ వల్ల ఉపయోగాలు:

ఈ డ్రై ఫ్రూట్ లస్సీ ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఇది తక్షణ శక్తినివ్వడంతోపాటు, శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పెరుగు జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. వివిధ రకాల విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి, ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.