Muscle cramps: కూర్చున్న ప్రతిసారి కండరాల తిమ్మిర్లు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ రెండు యోగాసనాలు చేయండి చాలు!
Muscle cramps: కాసేపు కింద కూర్చున్నారంటే కాళ్ల కండరాల్లో తిమ్మిర్లు వచ్చి, పైకి లేవడం ఇబ్బందికరంగా మారుతుందా? ఈ సమస్య తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే మీరు తప్పకుండా ఈ రెండు యోగాసనాలు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేసి తిమ్మిర్ల సమస్యను కచ్చితంగా అరికడతాయి.
చాలా మందికి కూర్చోగానే కాళ్లు, చేతులకు తిమ్మిర్లు వస్తుంటాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తసరఫరా ఆగిపోయి తిమ్మిర్లు రావడం సాధరణమే అయితే కాపేపు కూర్చోగానే కాళ్ల కండరాలు తిమ్మిర్లు ఎక్కుతున్నాయంటే.. అది కూడా తరచుగా ఇబ్బంది పెడుతున్నాయంటే భయపడాల్సిందే. ఎందుకంటే దీని వల్ల బాధితుడు చేతులు, కాళ్ళ కండరాలలో తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య భరించలేనంతగా ఉంటుంది. ఈ నొప్పిని భరించడం బాధితుడికి కష్టమవుతుంది.
సాధారణంగా శరీరంలో నీరు లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటం, కండరాల నొప్పులు, కండరాల తిమ్మిర్లు వస్తుంటాయి. అలాగే పొటాషియం, కాల్షియం లోపించడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వంటి కారణాల వల్ల కూడా చేతులు, కాళ్లలో తిమ్మిర్ల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య మిమ్మల్ని తరచుగా వేధిస్తే, ఈ రెండు యోగా ఆసనాలను మీ దినచర్యలో చేర్చండి. ఇవి కండరాలను బలోపేతం చేయడం ద్వారా తిమ్మిర్ల సమస్యను సమర్థవంతంగా నియంత్రించగలవు.
కండరాల తిమ్మిర్లను తగ్గించే యోగాసనాలు:
1) పవనముక్తాసనం:
పవనముక్తాసనం యోగాలో ఒక ముఖ్యమైన ఆసనం. ఈ ఆసనాన్ని ఆంగ్లంలో 'విండ్ రిలీజ్ పోజ్' అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల ఉదరంలో ఉండే ఆపాన వాయువు బయటకు వెళుతుంది. అందుకనే ఈ ఆసనానికి పవన ముక్తాసనం అనే పేరు వచ్చింది. ఇది అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. పవనముక్తసనం శరీరంలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా కండరాలను రిలాక్స్ చేస్తుంది. తద్వారా తిమ్మిర్లు ఎక్కే సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పవనముక్తాసనం ఎలా వేయాలి?
- పవన్ముక్తసనం చేయడానికి, నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో వెల్లకిలా పడుకోండి.
- తరువాత గాలి పీల్చుకుంటూ మీ కాళ్ళను మడిచి 90 డిగ్రీలకు ఎత్తండి, శ్వాసను బయటకు తీయండి.
- మోకాళ్ళను ఛాతీ, పొత్తికడుపుకు దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి.
- ఇప్పుడు మీ మోకాళ్ళను మీ చేతి వేళ్ళతో పట్టుకోండి. మీ తలనుపైకి లేపండి.
- రెండు మోకాళ్లు ముఖం మీదకు వచ్చేలా, గడ్డం ఛాతికి ఆనేలా చేయండి. మోకాళ్లు మీ నుదిటికి తాకాలి.
- ఈ భంగిమలో ఉన్నప్పుడు శ్వాసను నార్మల్ గా తీసుకుని వదులుతూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు అలాగే ఉండాలి.
- తరువాత మళ్లీ నెమ్మిదిగా తలను కింది దించి, తరువాత పాదాలను చాపుకుని యాథాస్థితిలో పడుకోవాలి.
- ఇలా ప్రతిరోజూ ఈ యోగాసనాన్ని 2 నుండి 3 సార్లు చేశారంటే తిమ్మిర్ల సమస్య నుంచి ఇట్టే బయటపడచ్చు.
2) త్రికోణాసనం
తుంటి నుంచి శరీరాన్ని త్రిభుజాకారంలోకి తీసుకురావడాన్నే త్రికోణాసనం అంటారు. దీన్ని ఇంగ్లీషులో ట్రయాంగిల్ యోగా పోజ్ అంటారు. ఈ యోగాసనం కాళ్ల కండరాలను బలోపేతం చేయడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా తరచూ తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
త్రికోణాసనం వేయడం ఎలా?
త్రికోణాసన సాధనకు రెండు కాళ్లు చాచి నిలబడాలి.
ఒక చేతిని పైకి ఎత్తి ఉంచి, మరొక చేతిని కింద కాలికి లేదా నేలకు ఆనిస్తూ త్రిభుజాకారంలో ఉండాలి.
తరువాత మరో వైపుకు తిరిగి మరో కాలుకు చేతిని ఆనిస్తూ ఉండాలి.
ఇలా శరీరాన్ని త్రిభుజాకారంలో కదిలించడం వల్ల మీ కండరాలపై సానుకూల ప్రభావం పడుతుంది. కండరాలు ఉత్తేజితమవుతాయి.
ఈ ఆసనం మీ పిరుదులు, తొడల దృఢత్వాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
త్రికోణాసనం ప్రతిరోజూ చేయడం ద్వారా తిమ్మిర్ల సమస్య నుంచి బయటపడటమే కాకుండా.. మీ శరీర భంగిమను పర్ఫెక్ట్ గా మార్చుకోవచ్చు.
టాపిక్