Digestive Drinks: తిన్నది అరగడం లేదా? భోజనం తర్వాత ఈ డ్రింకులు తాగండి
Digestive Drinks:ఈ బిజీ ప్రపంచంలో ఏదో ఒకటి తిని భోజనాన్ని ముగిస్తున్న వారి సంఖ్య ఎక్కువే. అలా ఏదో ఒకటి తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొన్ని రకాల డ్రింకులు తాగడం ద్వారా అజీర్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.
Digestive Drinks: ప్రపంచం బిజీగా మారిపోయింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకొని తినే సమయం లేక ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని భోజనాన్ని ముగిస్తున్నారు. దీని వల్ల ఎంతో మందిలో జీర్ణ సమస్యలు వస్తున్నాయి. వారి పొట్ట ఆరోగ్యం కూడా మందగిస్తోంది. ఆహారం అరగక ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తిన్నది అరగాలంటే భోజనం చేశాక కొన్ని రకాల డ్రింకులను తాగడం అలవాటు చేసుకోండి. ఇవి మీ ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఆ డ్రింకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంబుచా
కొంబుచా అంటే పులియబెట్టిన టీ అని చెప్పుకోవచ్చు. దీనిలో ప్రోబయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మన పొట్టకు అవసరమైన బ్యాక్టీరియా, ఈస్ట్ వీటిలో ఉంటాయి. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు తీసుకుంటే ఆహారం సులువుగా విచ్ఛిన్నమవుతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరం వంటివి రావు. బయట మార్కెట్లో దీన్ని లభిస్తుంది. దీన్ని చక్కెర, బ్లాక్ టీ, ఈస్ట్ కలిపి తయారుచేస్తారు. కొన్ని వారాల పాటు పులియబెట్టి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఇది తీయటి ఆల్కహాల్‌లా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్లం టీ
అల్లంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ప్రతిరోజూ భోజనం చేశాక అల్లం టీని తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. అలా అని అల్లం టీలో పాలు కలుపుకొని తాగితే మాత్రం అజీర్తి సమస్యలు వస్తాయి. తాజా అల్లాన్ని తురిమి వేడి నీటిలో వేసి మరగబెట్టాలి. దాన్ని వడకట్టి ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం, వికారం, ఉబ్బరం వంటిది రాకుండా ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని కూడా పెంచుతాయి.
అలోవెరా జ్యూస్
అలోవెరా మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అలోవెరా ఆకు లోపల జెల్ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది చర్మ సంరక్షణకే కాదు, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కలబంద రసంలో ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పేగుల్లో యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలను తగ్గిస్తుంది. భోజనం తర్వాత కొద్దిగా కలబంద రసాన్ని తాగితే మంచిది.
చింతపండు రసం
చింతపండు రసం అనగానే చింతపండు నానబెట్టిన నీళ్లు అనుకోవద్దు. మనం ఇళ్లల్లో చేసుకునే చారునే. ఇక్కడ చింతపండు రసం అని చెబుతున్నాం. చారును భోజనం చేశాక ఒక గ్లాసుడు తాగేయండి. ఇది ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. పొట్టకి వెచ్చదనాన్ని ఇస్తుంది. జీర్ణ అసౌకర్యం కలగకుండా చూస్తుంది. కాబట్టి ఏం తిన్నా చివర్లో చారును తాగడం మాత్రం మర్చిపోవద్దు.
ప్రూనే జ్యూస్
మార్కెట్లలో ప్రూనే జ్యూస్ లభిస్తుంది. ప్రూనే అంటే ఎండిన రేగు పళ్ళు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఫైబర్, సార్బిటాల్, ఫినోలిక్ సమ్మేళనాలు అందుతాయి. ఇవి పేగు పనితీరును మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత జ్యూస్‌ను తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా సాగుతుంది.