ఎండాకాలంలో మామిడి పండ్లు, కాయలు దొరుకుతాయి. కానీ కాలం మారాక మామిడి పండ్లు గుర్తొచ్చినా, పులిహోర తినాలనిపించినా వెంటనే చేసుకొనేలా కొన్ని మార్గాలున్నాయి. తర్వాతి సంవత్సరం వరకు కూడా వివిధ రకాలుగా నిల్వ చేసుకోడానికి కొన్ని పద్ధతులున్నాయి అవేంటంటే..
బర్ఫీ చేయడం కాస్త సమయం, శ్రమతో కూడుకున్న పనే. కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. ముందుగా మామిడి పండ్ల రసాన్ని నీళ్లు పోయకుండా వెడల్పాటి కడాయిలో సన్నని మంట మీద ఉడికించాలి. దాదాపు అరగంట తరువాత రసం గట్టిపడుతుంది. అప్పుడు అందులో మీరు తినే రుచికి తగ్గట్లు పంచదార వేసుకుని మళ్లీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మరో 30- 45 నిమిషాలకి పంచదారంతా కరిగిపోయి రసమంతా ముద్దలా మారుతుంది. చేతితో పట్టుకుంటే లడ్డూ కట్టే అంత గట్టిగా అయిపోతుంది. అలా అయిన మిశ్రమాన్ని రెండ్రోజులు అలా వదిలేయండి. మూడో రోజు మీకిష్టమైన ఆకారంలో ఉండలుగా చేసుకోండి. లేదంటే కేకు ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రిజ్ లో పెడితే కనీసం సంవత్సరం నిల్వ ఉంటాయి. మామిడి పండు గుర్తొచ్చినపుడల్లా వీటిని తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఇవి చాలా సులభంగా చేసుకోవచ్చు. మామిడి పండు గుజ్జులో తగినంత పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాస్త లోతుగా ఉండే స్టీల్ ప్లేట్‌లో పలుచగా పోయాలి. ప్లేట్ అంతా సమంగా ఉండేలా చూసుకున్నాక ఎండలో పెట్టేయాలి. ఒక రెండు రోజులు ఎండలో ఎండాక ప్లేట్ నుంచి అట్టు తీయొచ్చు. ఇపుడు మరో రెండ్రోజులు ఇంకో వైపు కూడా ఎండనివ్వండి. అట్టు పూర్తిగా ఆరిపోయాక స్టీలు, గాజు డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది కూడా సంవత్సరం వరకూ పాడవ్వదు. ఒక స్వీట్ లాగా తినొచ్చు.
వరుగు చేసుకోడానికి ఇదే సరైన సమయం. ఈ మండే ఎండల్లో సన్నగా తరుగుకున్న మామిడి ముక్కల్ని ఎండబెట్టుకుని తరువాతి సంవత్సరం వరకూ వాడుకోవచ్చు. పప్పుల్లో, పులుపుగా ఉండాలనుకునే ఏ కూరలో అయినా ఈ వరుగు వేసుకోవచ్చు. మామిడి కాయ ముక్కల్ని సన్నగా తరిగి ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా నీటి శాతం పోయి ఎండే వరకూ ఆరబెట్టాలి. గాజు సీసాలో భద్రపరుచుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది.
అవసరమనుకున్నన్ని మామిడి కాయల్ని పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఈ మామిడికాయ గుజ్జులో పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు మీరిప్పుడు వెంటనే ఆ గుజ్జు తినలేనంత ఎక్కువగానే ఉండాలి. ఉప్పు నిండుగా ఉంటేనే గుజ్జు పాడవకుండా ఉంటుంది. లేదంటే తొందరగా బూజు పడుతుంది. దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అవసరం ఉన్నప్పడు పులిహోర చేసుకోడానికీ, పప్పుల్లోకి వాడుకోవచ్చు.