Bathukamma Rituals: బతుకమ్మ పండుగలో ఈ ఆచారాలు, వాటి అర్థాలు తెలుసా?
Bathukamma Rituals: బతుకమ్మ పండగలో వివిధ ఆచారాలు ఉన్నాయి. వాటికి వివిధ అర్థాలూ, ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో మీరూ తెలుసుకోండి.
తెలంగాణలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆ హడావిడే వేరు. రంగు రంగుల పూల గౌరమ్మలను అన్ని ఇళ్లలోనూ తయారు చేస్తారు. ముస్తాబైన ఆడపడుచులంతా ఒక్క చోట చేరి బతుకమ్మను ఆటపాటలతో పూజిస్తారు. అంతా ఒక చోట చేరి ఆనందంతో చిందులేస్తారు. మరి ఈ పండుగలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణ జాన పదాల నుంచి వచ్చిన ఆ పాటలు, ఆటలు ఆచారాలు... ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. అవి సాధారణ ఆచారాల్లాగే కనిపించినప్పటికీ అందులో ఎంతో విజ్ఞానం దాగి ఉంటుంది. అలాంటి ఆచారాలేంటో, వాటి ప్రత్యేకత ఏంటో చూసేద్దాం రండి.
పిల్లల కోసం:
కొందరికి పిల్లలు పుట్టి వెంటనే చనిపోతూ ఉంటారు. అలా జరుగుతున్నప్పుడు వారిని పుట్టిన వెంటనే పెంట మీద పిల్లల్ని పెట్టి తెచ్చుకుంటారు. వారికి పెంటమ్మ, పెంటయ్య అనే పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు బతుకమ్మను తమ పిల్లల్ని బతకనీయమని కోరుకుంటూ పూజలు చేసే సంప్రదాయం ఉంది. తమ సంతానం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికలూ ఇక్కడ కనిపిస్తాయి.
పూలలో ఔషద గుణాలు:
ప్రకృతిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు కదా. ఇలా పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. దాన్ని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా చేయడం వల్ల ఆ పూలలో ఉండే ఔషధ గుణాలతో నీరు పారి పంటలను సస్య శ్యామలం చేస్తాయని నమ్ముతారు. ఈ కాలంలో సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉంటాయి. చెరువుల్లాంటి నీటి వనరులన్నీ ఆ నీటితో కలుషితం అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు తంగేడు, గునుగు పూల లాంటి వాటిని చెరువుల్లో పెద్ద ఎత్తున నిమజ్జనం చేస్తారు. ఇక గౌరమ్మను చేసే పసుపు సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. చెరువులు, కుంటల్లో ఉండే నీటిని నీటిని చక్కగా శుభ్రపరుస్తాయి.
సత్తుపిండితో ఆరోగ్యం:
బతుకమ్మ పండుగలో నైవేద్యాలూ అంతే ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి. రకరకాల గింజలతో చేసే సత్తు పిండ్లు తయారు చేస్తారు. మొక్క జొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, జీడిపప్పు, బెల్లం, పాలు, యాలకులు చేర్చి చాలా తక్కువ పదార్థాలతోనే రుచికరమైన పొడులను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. వీటిని తెలంగాణ సంప్రదాయ నైవేద్యాలుగా చెబుతారు. ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉండి పేదవారికైనా సరే పౌష్టికాహారంగా పనికి వస్తాయి. వర్షాకాలంలో అందరికీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల అది పెరుగుతుంది. అందుకనే వీటిని ఇలా ఆచారాల్లో భాగం చేసుకున్నారు.