మీకు ప్రీడయాబెటిస్ ఉన్నట్లు తెలిసిందా? కేవలం మూడు నెలల్లో దాన్ని తగ్గించుకోండి-did you know you have prediabetes reduce it in just three months ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీకు ప్రీడయాబెటిస్ ఉన్నట్లు తెలిసిందా? కేవలం మూడు నెలల్లో దాన్ని తగ్గించుకోండి

మీకు ప్రీడయాబెటిస్ ఉన్నట్లు తెలిసిందా? కేవలం మూడు నెలల్లో దాన్ని తగ్గించుకోండి

Haritha Chappa HT Telugu

డయాబెటిస్‌కు ముందు దశ ప్రీడయాబెటిస్. ఈ దశలో జాగ్రత్తపడితే పూర్తిగా డయాబెటిక్ రోగి కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇందుకోసం ప్రీడయాబెటిస్ ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకోండి.

ప్రీడయాబెటిస్ తగ్గించుకోండిలా (Pixabay)

ప్రీడయాబెటిస్ అనేది ఒక ముందస్తు వార్నింగ్ అని చెప్పుకోవాలి. డయాబెటిస్ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పే హెచ్చరిక సంకేతమే అది. ప్రీడయాబెటిస్ ఉన్నవారు పూర్తి డయాబెటిస్ పేషెంట్‌గా మారకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కేవలం మూడు నెలల్లో ప్రీడయాబెటిస్ రోగులు అ వ్యాధిని తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు.

ప్రీ డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పే ఆరోగ్య పరిస్థితి. మీ శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేకపోతుందని కూడా చెప్పడమే దీని ఉద్దేశం. అలాగే ఇన్సులిన్ నిరోధకత ఉందని కూడా ప్రీ డయాబెటిస్ చెప్పకనే చెబుతోంది. ప్రీడయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

ప్రీడయాబెటిస్‌తో బాధపడే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు టైప్2 డయాబెటిస్ బారిన పడకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ప్రీ డయాబెటిస్‌తో బాధపడే వారికి రక్తంలో చక్కెర అధికంగా ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్రంలో ప్రోటీన్ అధికంగా చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాలు చెడిపోతాయి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే మూత్రపిండాలకు వ్యాధి పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి నరాల నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువ. ఇది జీవిత నాణ్యతను తగ్గిస్తుంది. స్పర్శ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే మీరు కళ్ళ ఆరోగ్యం పై కూడా ప్రభావం ఎంతో ఉంటుంది. అధిక గ్లూకోజ్ స్థాయిలు కళ్ళ వెనక ఉన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయి.రెటీనా వాపుకు కారణమవుతాయి. గ్లాకోమా, కంటి శుక్లాలు వంటివి వచ్చే అవకాశాలను పెంచుతాయి.

కాబట్టి ప్రీడయాబెటిస్ ఉందని తేలిన వారు పూర్తి డయాబెటిక్ గా మారకుండానే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. కేవలం మూడు నెలల్లోనే ఆరోగ్యంగా మారొచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రీ డయాబెటిస్ బారిన పడ్డారంటే మీరు డయాబెటిస్ రాకుండా అడ్డుకోవడానికి మీ చేతిలో ఎంతో కొంత సమయం ఉందనే అర్థం. ఇందుకోసం మీరు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, బెర్రీలు వంటి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పంచదార కలిపిన ఆహారాలను తినకూడదు. గ్లూకోజ్ శోషణను తగ్గించేలా ఫైబర్ అధికంగా ఉండే భోజనాలను తినాలి. అలాగే లీన్ ప్రోటీన్ ఉండే చికెన్, కోడిగుడ్లు, చేపలు వంటివి కూడా అధికంగా తినాలి.

ప్రతిరోజూ వ్యాయామం

వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటివి చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి మీరు వారానికి రెండుసార్లు తీవ్రమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అధిక బరువును వెంటనే తగ్గించుకొని ప్రీ డయాబెటిస్‌ను తిప్పి కొట్టవచ్చు.

ఒత్తిడి, నిద్రలేమి ఈ రెండూ కూడా ప్రీ డయాబెటిస్ తీవ్రతను పెంచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి రాత్రిపూట ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నిద్ర తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఒత్తిడిని కూడా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇలా మీరు పాటించడం వల్ల కేవలం మూడు నెలల్లోనే ప్రీ డయాబెటిస్‌ను సమర్ధంగా తిప్పి కొట్టవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/