Sweet Potato Rabidi: చిలకడదుంపలతో రబిడీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇదిగోండి రెసిపీ, లేట్ చేయకుండా ట్రై చేసేయండి!
Sweet Potato Rabidi: చిలకడదుంపలతో తయారుచేసిన రబిడీ ఎప్పుడైనా తిన్నారా.. ఈ రెసిపీతో ట్రై చేశారంటే, సూపర్ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేసేయొచ్చు. ఇంకో విషయం డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ రబిడీని నిస్సందేహంగా తినేయొచ్చు. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం రండి
స్వీట్ ఇష్టపడని వారు చాలా అరుదు కదా. స్వీట్ తినే ప్రతి ఒక్కరికీ రబిడీ అంటే కచ్చితంగా ఇష్టం ఉంటుంది. అయితే ఒక్కో రబిడీ ఒక్కో టేస్ట్‌లో ఉంటుంది. స్వీట్ అంటే ఇష్టం ఉండి, ఒకవేళ ఇప్పటి వరకూ మీరు రబిడీ టేస్ట్ చేయకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. ఐస్ క్రీమ్, జ్యూస్ కలిపి తింటే వచ్చే ఫీలింగ్ రబిడీ తిన్నాక రావడం ఖాయం. దాని కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి, ఇక్కడ ఇచ్చిన స్వీట్ పొటాటో (చిలకడ దుంప) రబిడీతో కొత్త టేస్ట్ ట్రై చేసేయండి.. మరింకెందుకు లేట్ రెసిపీ చూసేద్దాం రండి.
కావాల్సిన పదార్థాలు:
• 20 - నానబెట్టిన జీడిపప్పులు
• ½ కప్పు - కప్పు చిలకడ దుంప
• ½ + ½ కప్పుల నీరు
• 3 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి
• ¼ టీ స్పూన్ యాలికుల పొడి
• 25 కుంకుమ పువ్వు రెబ్బలు, (నానబెట్టినవి)
• చిటికెడు ఉప్పు
గార్నిషింగ్ కోసం
• 5 బాదంపప్పులు, నానబెట్టుకుని తరిగినవి
• 5 పిస్తా పప్పులు, రోస్ట్ చేసిన వాటి ముక్కలు
• 1 టీ స్పూన్ గులాబీ రేకులు (అవసరమనుకుంటేనే)
తయారీ విధానం:
- ముందుగా జీడిపప్పులను 6గంటల సేపు నీటిలో నానబెట్టుకోవాలి.
- 25 కుంకుమ పువ్వు రెబ్బలు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వేడి నీళ్లలో 2గంటల సేపు ఉంచాలి.
- ఇప్పుడు జీడిపప్పులను, చిలకడ దుంపను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అవసరమైనంత మేర అంటే అరకప్పుకు దాటకుండా నీళ్లు పోసుకుని పిండిగా మార్చుకోండి.
- ఒక పాన్ తీసుకుని అందులో అరకప్పు నీరు పోయండి. చిన్న మంటపై ఉంచి మీరు కలుపుకున్న జీడిపప్పు, చిలకడ దుంప మిశ్రమాన్ని అందులో వేయండి.
- ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కాసేపు ఉంచితే ఉడకడం మొదలవుతుంది.
- ఆ మిశ్రమం ఉడుకుతున్న సమయంలో మంటను చిన్నగా చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడకనివ్వండి.
- ఇప్పుడు అందులో బెల్లం పొడి వేసి మరో మూడు నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచండి.
- ఆ తర్వాత మంట ఆర్పివేసి యాలికుల పొడి, ముందుగానే ఉడకబెట్టుకున్న కుంకుమ పువ్వు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.
- అంతే, మీ చిలకడదుంప రబిడీ రెడీ అయిపోయినట్లే.
- వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి ముందుగా సిద్ధం చేసుకున్న బాదంపప్పులు, పిస్తా పప్పులు వేసి అతిథులకు అందించండి.
- చల్లారిన తర్వాత తాగాలనుకుంటే, కాస్త వేడి తగ్గిన రబిడీని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకుని తీసిన తర్వాత తాగేయొచ్చు.
ఇందులో చక్కెర ఉండదు కాబట్టి, డయాబెటిస్ పేషెంట్లు కూడా నిస్సందేహంగా తినేయొచ్చు. ఇంకెందుకు లేటు, మీరు రెడీ చేసిన రబిడీని పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా అందరికీ సర్వ్ చేసి మార్కులు కొట్టేయండి.
సంబంధిత కథనం