Cigarette: మీరు తాగే ఒక్కో సిగరెట్ మీ ఆయుష్షులో 22 నిమిషాలు తగ్గించేస్తుంది తెలుసా? మహిళలకు ఇంకా ప్రమాదం
Cigarette: ఒక తాజా అధ్యయనం ప్రకారం ప్రతి సిగరెట్ ఆ వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుంది. పురుషులు కాలిస్తే వ 17 నిమిషాల ఆయుష్షు తగ్గితే, మహిళలు మాత్రం 22 నిమిషాల ఆయుష్షును కోల్పోతారు. కాబట్టి సిగరెట్ తినడం మానుకోండి.
సిగరెట్లు తాగడం హానికరం అని అందరికీ తెలుసు. కానీ దానికి బానిసలా మారి ప్రతి రోజూ ఒక పెట్టె మొత్తం కాల్చేసే వారు ఎంతో మంది. మరికొంతమంది కనీసం రోజుకు రెండు నుంచి మూడు సిగరెట్లు అయినా కాలుస్తారు. ఇలా సిగరెట్లు కాల్చేవారు తమ ఆయుష్షును తామే తగ్గించుకుంటున్నట్టు లెక్క. తాజాగా చేసిన ఒక అధ్యయనంలో ఇదే విషయం తెలిసింది. మీరు తాగే ఒక్కో సిగరెట్ మీ ఆయుష్షును కొన్ని నిమిషాలు తగ్గించేస్తుంది. ఇది ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
అధ్యయనం ప్రకారం ఒక సిగరెట్ ఒక వ్యక్తి ఆయుష్షను తగ్గించేస్తుంది. ఒక వ్యక్తి ఇరవై సిగరెట్లు తాగితే అతని ఆయుష్షు కనీసం ఏడుగంటలు తగ్గిపోయే అవకాశం ఉంది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసిఎల్) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
పురుషులు ఎంత? మహిళలు ఎంత?
సిగరెట్ తాగే అలవాటు ఉన్న మగవారు తాము కాల్చే ఒక సిగరెట్ కు 17 నిమిషాల ఆయుష్షును తగ్గించుకుంటారు. ఇక మహిళలు ఒక సిగరెట్‌కు 22 నిమిషాల ఆయుష్షును కోల్పోతారు. 1996లో మహిళలు రోజుకు సగటున 13.6 సిగరెట్లు తాగేవారు. ఇప్పుడు సిగరెట్లు తాగే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది.
ఒక వ్యక్తి కొత్త ఏడాదిలో మొదటి రోజు నుంచే సిగరెట్లు మానేయాలని నిర్ణయం తీసుకుంటే అతని ఆయుష్షు ఎంతో పెరుగుతుంది. రోజుకు పది సిగరెట్లు తాగే వ్యక్తి జనవరి 1 నుంచి సిగరెట్లు కాల్చడమే మానేస్తే ఈ ఏడాది చివరి కల్లా 50 రోజుల జీవితాన్ని తమ ఆయుష్షు నుంచి తగ్గకుండా కాపాడుకోవచ్చు. రు.
ధూమపానం చేసేవారు సిగరెట్లను ఎంత త్వరగా మానేస్తే, వారి జీవితాలు అంత మెరుగ్గా మారుతాయి. ఎక్కువ కాలం వారు ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనం పేర్కొంది. ధూమపానం ఎన్నో పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఏ వయసులోనైనా ధూమపానం మానేయడం వల్ల కనీసం కొన్ని రోజుల ఆయుష్షునైనా పెంచుకోవచ్చు.
స్మోకింగ్ వల్ల నష్టాలు
ధూమపానం చేయడం వల్ల శరీరంపై విపరీత ప్రభావాలు పడతాయి. కాసేపు మజాగా అనిపించినా శరీరంలో చేరిన ఆ రసాయనాలు ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తాయి. ధూమపానం వల్ల ప్రాణాంతక వ్యాధులైన ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వర పేటిక్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్, అన్న వాహిక క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, మూత్రపిండిల సమస్యలు, కాలేయ సమస్యలు, ప్రేగు సమస్యలు వస్తాయి. వీటిని తట్టుకోవడం చాలా కష్టం.
నికోటిన్ వల్లే
ధూమపానంలో ఉండే నికోటిన్ మనుషులను తమకు బానిసలుగా మార్చుకుంటుంది. అందుకే స్మోకింగ్ కు అలవాటైన వారు అది తాగకుండా ఉండలేరు. సిగరెట్ పొగలో కార్బన్ మోనాక్సైడ్ అతిగా ఉంటుంది. ఇది అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు స్మోకింగ్ కు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)