Desserts with fruits: పండ్లతో ఫ్యాన్సీ డెజర్ట్స్.. ఇంట్లోనే సులువుగా సిద్ధం..-delicious desserts you can make with fruits without sugar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Desserts With Fruits: పండ్లతో ఫ్యాన్సీ డెజర్ట్స్.. ఇంట్లోనే సులువుగా సిద్ధం..

Desserts with fruits: పండ్లతో ఫ్యాన్సీ డెజర్ట్స్.. ఇంట్లోనే సులువుగా సిద్ధం..

Koutik Pranaya Sree HT Telugu
Oct 16, 2023 04:35 PM IST

Desserts with fruits: భోజనం అవ్వగానే ఏదైనా తియ్యటి డెజర్ట్ తినాలనుకుని ఆగిపోతున్నారా? అయితే పండ్లతోనే రుచికరమైన స్వీట్స్ ఎలా చేసుకోవచ్చో చూసేయండి.

పండ్లతో డెజర్ట్స్
పండ్లతో డెజర్ట్స్ (Pinterest)

తీపి తినాలనే కోరిక సాధారణం. చీట్ డే రోజు వాటిని తినాలనుకున్నా కూడా ఎక్కువ కేలరీలు చేరిపోతాయనే భయం. కానీ ఎక్కువ రోజులు తీపికి దూరంగా ఉండటం కూడా కష్టమే. అందుకే పండ్లు, ఖర్జూరాలు, నట్స్ వాడి రుచికరమైన తీపి పదార్థాలు చేసుకోవచ్చు. యాపిల్స్, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, అరటిపండ్లు, బాదాం, వాల్ నట్స్, దాల్చిన చెక్క, తేనె లాంటివి వాడి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

1. డార్క్ చాకోలేట్ పీనట్ బటర్ బనానా బైట్స్:

వీటిని చాలా సులువుగా చేసుకోవచ్చు. డార్క్ చాకోలేట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు. అరటిపండ్లు, పీనట్ బటర్ వాడటం వల్ల పోషక విలువలు మరింత పెరుగుతాయి. పొటాషియం, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

కావాల్సిన పదార్థాలు:

2 పండిన అరటిపండ్లు

పావు కప్పు పీనట్ బటర్

¾ కప్పు బేకింగ్ చాకోలేట్

ఒకటిన్నర చెంచాల కొబ్బరి నూనె

తయారీ విధానం:

  1. అరటిపండ్లను సన్నని ముక్కలుగా కోసుకుని బేకింగ్ షీట్ మీద దూరం దూరంగా పెట్టుకోవాలి.
  2. అరటిపండు ముక్కల మీద పీనట్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మీద మరొక అరటిపండు ముక్క పెట్టుకోవాలి. వీటిని అరగంట పాటూ ఫ్రీజర్ లో ఉంచాలి.
  3. ఇప్పుడు చాకోలేట్ ను కరిగించుకుని ఫ్రీజర్ లో ఉంచుకున్న అరటిపండు ముక్కల్ని తీసుకుని చాకోలేట్ మిశ్రమంలో సగం దాకా మునిగేలా ముంచుకోవాలి.
  4. మళ్లీ బేకింగ్ షీట్ మీద పెట్టుకుని అరగంటసేపు ఫ్రీజర్ లో పెట్టుకుని తీసేస్తే సరి.

2. స్ట్రాబెర్రీ ఫ్రోజెన్ యోగర్ట్:

ఇది పండు ఫ్లేవర్ తో చేసే స్వీట్ యోగర్ట్. ఇది పోషకాలతో నిండి, తిన్న వెంటనే మంచి స్వీట్ తిన్న భావన కలుగుతుంది. స్ట్రాబెర్రీలలో ఉండే పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల స్ట్రాబెర్రీలు

2 చెంచాల తేనె

పావు కప్పు గ్రీక్ యోగర్ట్

సగం చెంచా నిమ్మరసం

తయారీ విధానం:

  1. ముందుగా స్ట్రాబెర్రీలను రాత్రంతా లేదా 3 నుంచి 4 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి.
  2. తర్వాత ఈ స్ట్రాబెర్రీలను బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే తేనె, యోగర్ట్, నిమ్మరసం వేసుకుని ఫుడ్ ప్రాసెసర్ లో వేసుకోవాలి లేదా మిక్సీ వాడొచ్చు.
  3. రెండు నిమిషాలు మిక్సీ పట్టాకా క్రీమీగా తయారవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  4. దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకుని కనీసం ఆరగంటలయ్యాక తింటే చాలు. ఐస్ క్రీం లాగానే అనిపించే కమ్మని స్వీట్ రెడీ అయిపోతుంది.

టాపిక్