DU Admission process: ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్లలో కొత్త విధానం.. వివరాలివే!
DU Admissions 2022: ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ CUET స్కోర్‌ల ఆధారంగా కొత్త అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ప్రక్రియ జరపాలని నిర్ణయించింది.

DU Admission process: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో విద్యార్థులను చేర్చుకునే కొత్త ప్రక్రియను ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదించింది. కొత్త ప్రక్రియ ప్రకారం, విద్యార్థులు వివిధ కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు విద్యా సంస్థ సెంట్రల్ పోర్టల్‌ను రూపొందిస్తుంది. కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ (CSAS)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అడ్మిషన్ జరుగుతుంది."అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో విద్యార్థులను చేర్చుకోవడానికి స్టాండింగ్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను అకడమిక్ కౌన్సిల్ ఆమోదించింది" అని కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు.
విద్యార్థులు CSASలో ప్రవేశం పొందేందుకు మూడు దశలు ఉంటాయి. విశ్వవిద్యాలయం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, మూడు దశల ద్వారా CSAS 2022 దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఫారమ్‌ను సమర్పించడం, ప్రోగ్రామ్‌ల ఎంపిక, సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ జాబితా ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. "కొత్త విధానంలో, విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలల అన్ని అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఒక కేంద్రీకృత పోర్టల్ రూపొందించబడుతుంది. సాధారణ సీట్ల కేటాయింపు విధానంలో నియమాలు, మార్గదర్శకాల ప్రకారం ప్రవేశం జరుగుతుంది" అని యూనివర్సిటి అధికారి తెలిపారు.
CSAS-2022 దరఖాస్తు రుసుము నాన్-రీఫండబుల్ చెల్లింపుగా ఉంటుంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ (ECA) /లేదా స్పోర్ట్స్ సూపర్‌న్యూమరీ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారిక సమాచారం.
CUET(UG) 2022 ఫలితాల ప్రకటన తర్వాత అడ్మిషన్ ప్రక్రియ రెండవ దశ ప్రారంభమవుతుంది. అభ్యర్థి వారు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న ప్రోగ్రామ్‌లను ఎంచుకోవాలి. వారు ఎంచుకున్న అన్ని ప్రోగ్రామ్‌ల కోసం ప్రోగ్రామ్-నిర్దిష్ట CUET (UG) మెరిట్ స్కోర్‌ను నిర్ధారించాలి.
మూడో దశలో మెరిట్ లిస్ట్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే CUET మెరిట్ స్కోర్‌ను కలిగి ఉన్నట్లయితే, ఎక్కువ శాతం మార్కులను (12వ తరగతిలోని ఉత్తమ మూడు సబ్జెక్టులకు) పొందిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్కోరు ఇంకా టై అయితే, పాత అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మొత్తం ప్రక్రియ కేంద్రీకృత CSAS పోర్టల్ ద్వారా జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రవేశానికి, CUET స్కోర్‌కు 50 శాతం వెయిటేజీ కాగా మిగిలినది పరీక్ష ఆధారితంగా ఇవ్వబడుతుంది. తమ అడ్మిషన్‌ను ఉపసంహరించుకోవాలనుకునే వ్యక్తికి రూ. 1,000 వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
స్పాట్ అడ్మిషన్ రౌండ్ ప్రకటించిన తర్వాత అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. మార్గదర్శకాల ప్రకారం, రద్దు, ఉపసంహరణ కారణంగా సీట్ల లభ్యత విషయంలో వివిద రౌండ్ల కేటాయింపులను నిర్వహించవచ్చు.