తల్లి అధిక బరువు ఉంటే కూతుళ్లకూ ఆ ముప్పు.. తేల్చిన అధ్యయనం
తల్లి అధిక బరువు. ఊబకాయం కలిగి ఉంటే కూతుళ్లకూ ఆ ముప్పు ఉంటుందని ఒక అధ్యయనం తేల్చింది.

మహిళలకు ఊబకాయం ఉంటే ఈ అధిక బరువు గల ముప్పు వారి ఆడ పిల్లలకు కూడా ఉంటుందని, కానీ మగ సంతానానికి ఆ ముప్పు ఉండదని ఓ అధ్యయనంలో తేలింది. ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం జరిపిన అధ్యయనం ఈ ఫలితాన్ని ఇచ్చింది.
ఊబకాయం ఇప్పుడు అతి పెద్ద సమస్యగా తయారైంది. ముఖ్యంగా అమెరికాలో వయోజనుల్లో సగం మంది, పిల్లల్లో 20 శాతం మంది ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అక్కడ ఊబకాయంపై మెడికల్ కేర్‌కు 173 బిలియన్ డాలర్లు ఖర్చవుతోందని అంచనా. ఊబకాయం ఉన్న వారికి డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమయ్యే ముప్పు ఎక్కువగా ఉంటోంది.
‘ఊబకాయం లేదా అధిక కొవ్వు గల శరీరం కలిగిన మహిళలకు పుట్టిన ఆడ సంతానానికి ఊబకాయం వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది..’ అని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ ఎంఆర్సీ లైఫ్‌కోర్స్ ఎపిడెమాలజీకి చెందిన నిపుణులు రెబెకా జే మూన్ వివరించారు. ‘ఇలా ఎందుకు జరుగుతోందో మరిన్ని అధ్యయనాల వల్ల తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే ఆడ సంతానంలో శరీర బరువు విషయంలో చిన్న వయస్సులోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా అధ్యయనం సూచిస్తోంది..’ అని వివరించారు.
పరిశోధకులు 240 మంది చిన్నారుల (9 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సులో ఉన్న వారు) లో శరీరంలోని కొవ్వు, కండరాలను పరీక్షించారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని అధిక బరువు, ఒబెసిటీకి స్క్రీనింగ్ టూల్‌గా వాడొచ్చా లేదా నిర్ధారించేందుకు ఈ డేటాను వారు వినియోగించారు.
బాలికలు తమ తల్లిలాగే బీఎంఐ, ఫ్యాట్ మాస్ కలిగి ఉన్నారని అధ్యయనం గుర్తించింది. అధిక బరువు, ఒబెసిటి లేదా అధిక కొవ్వు కలిగిన మహిళలకు పుట్టిన ఆడ సంతానానికి ఒబెసిటీ, అధిక బరువు కలిగి ఉండే ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చింది. అయితే తల్లులు ఊబకాయంతో ఉన్నప్పుడు అబ్బాయిల విషయంలో ఈ ముప్పు ఉన్నట్టు తేలలేదు. అలాగే తండ్రులు ఊబకాయంతో ఉన్నప్పుడు కూడా అబ్బాయిలకు ఈ ముప్పు ఉన్నట్టు తేలలేదు.
సంబంధిత కథనం