Dates Payasam: దీపావళికి స్పెషల్‌గా ఖర్జూర పాయసం చేసేయండి, లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు
Dates Payasam: ఎప్పుడూ ఒకేలాంటి పాయసం కాకుండా ఓసారి ఖర్జూరం పాయసం ప్రయత్నించండి. దీపావళికి లక్ష్మీదేవికి దీన్ని సమర్పిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.
దీపావళి స్వీట్ రెసిపీల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మీకు సులువుగా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ ఇచ్చాము. ఎప్పుడూ ఒకేలాంటి పాయసమే కాదు, ఓసారి ఖర్జూర పాయసం ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. అలాగే బలాన్ని కూడా అందిస్తుంది. దీపావళి నాడు లక్ష్మీదేవి పూజలో కచ్చితంగా స్వీట్ ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈసారి ఖర్జూర పాయసాన్ని చేసి శ్రీ మహాలక్ష్మికి ప్రసాదంగా నివేదించండి. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

ఖర్జూర పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు
ఖర్జూరాలు - పదిహేను
బాదం పప్పులు - గుప్పెడు
పాలు - మూడు కప్పులు
చక్కెర - రెండు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
పిస్తాలు - గుప్పెడు
ఖర్జూర పాయసం రెసిపీ
1. ఖర్జూరాల్లోంచి విత్తనాలు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే పిస్తాలు, బాదం పప్పులు కూడా వేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేసి వేడి చేయాలి.
4. ఆ వేడి పాలలోనే సన్నగా తరిగిన ఖర్జూరాలు, పిస్తా, బాదం పప్పులను వేసి అవి మునిగిపోయే వరకు ఉంచాలి. అవి బాగా నానుతాయి.
5. ఈలోపు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
6. ఆ నెయ్యిలో బాదం, కొన్ని పిస్తాలను రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అదే గిన్నెలో మూడు కప్పుల పాలను వేసి మరిగించాలి.
8. పాలు మరిగి కాస్త చిక్కబడే వరకు అలా ఉంచాలి.
9. తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తో పాటు పాలను కూడా అందులో వేసి కలుపుకోవాలి.
10. దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చక్కెరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. యాలకుల పొడిని కూడా జోడించాలి.
11. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బాదం తరుగు, పిస్తా తరుగును పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
12. అంతే టేస్టీ ఖర్జూర పాయసం రెడీ అయినట్టే.
13. దీన్ని ప్రసాదంగా నివేదించవచ్చు. దీన్ని తింటే ఎంతో ఆరోగ్యం కూడా.
ఖర్జూరం ఉపయోగాలు
ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రోగనిరోధకశక్తి పెరిగి కొన్ని వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఖర్జూరంలో క్యాల్షియం, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఇది రక్త ఉత్పత్తిని పెంచుతుంది. ఖర్జూరంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు రెండు ఖర్జూరాలు తినేవారిలో వ్యాధినిరోధక శక్తి చాలా వరకు పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి ఖర్జూరాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీ పిల్లలకు స్నాక్స్ గా కనీసం రోజుకు రెండు ఖర్జూరాలను ఇచ్చి తినమని చెప్పండి. ఇందులో ఉండే కెరటనాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు మన శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.