Dancing in the Kitchen: రోజూ 20 నిమిషాల డాన్స్ చేస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదా? అధ్యయనం ఏం చెబుతోంది?
Dancing in the Kitchen: రోజు ఇరవై నిమిషాల పాటు డ్యాన్స్ చేస్తే జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండచ్చా?ఫిట్‌నెస్ నిపుణులు, అమెరికా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ఇక్కడ తెలుసుకోవచ్చు.

జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్లడం కుదరక ఇబ్బంది పడుతున్నారా? మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సులభమైన మార్గాన్ని వెతుకుతున్నారా? అయితే మీరు డాన్స్ చేయడం అలవాటు చేసుకోండి. రోజూ క్రమం తప్పకుండా ఇరవై నిమిషాల పాటు డాన్స్ చేయడం వల్ల జిమ్ కు వెళ్లకుండా ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండచ్చట. మీ వ్యాయామ లక్షాలను చేరుకోవచ్చట. బోస్టన్, మసాచుసెట్స్‌లోని నార్తీస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతి ఉదయం మీ వంటగదిలో 20 నిమిషాలు డాన్స్ చేయడం వల్ల మీరు ఫిట్‌గా మారవచ్చని తెలిసింది.
ఇతర వ్యాయామాల లాగే డాన్స్ పనిచేస్తోందా?
NHS (నేషనల్ హెల్త్ సర్వీస్) సూచించిన ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, పెద్దలు వారానికి 150 నిమిషాల సాధారణ లేదా తీవ్రమైన వ్యామామాన్ని చేయాలి. అలాగే WHO సూచనల ప్రకారం పెద్దలు వారానికి 150-300 నిమిషాల మోడరేట్ లేదా 75-150 నిమిషాల తీవ్రమైన వ్యాయామాలను చేయాలని సిఫార్సు చేస్తుంది. ఇందుకోసం చాలామంది జాగింగ్, జిమ్‌కు వెళ్లడం, ఈత కొట్టడం లేదా ఇతర శారీరక కార్యకలాపాలు చేస్తుంటారు. ఎక్కువ మంది డ్యాన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వరు. నిజానికి ఈ కార్యకలాపాల మాదిరిగానే డ్యాన్స్ కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అధ్యయనంలో ఏం తెలిసింది?
ఫిట్‌నెస్ విషయంలో డ్యాన్స్ ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి అధ్యయనం జరిపారు. ఇందులో 18 నుంచి 83 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 48 మంది పాల్గొన్నారు. మోడరేట్ వ్యాయామానికి సమానంగా ఉండాలంటే రోజులో ఎంతసేపు డ్యాన్స్ చేయాల్సి ఉంటుందోనని గమనించారు. సంగీతం వింటూ డ్యాన్స్ చేయడం, సంగీతం లేకుండా డ్యాన్స్ చేయడం వంటి సెషన్లు నిర్వహించి వారి ప్రదర్శనను గమనించారు. సెషన్ల సమయంలో వ్యాయామం తీవ్రతను గమనించేందుకు డ్యాన్స్ వేసే వారి శ్వాస తీసుకునే రేటు, హృదయ స్పందనను కొలిచారు. దీనిని బట్టి వీరంతా మోడరేట్ వ్యాయామం చేసే స్థాయికి చేరుకున్నారని తెలిసింది.
డ్యాన్స్ ద్వారా కేలరీలను ఖర్చు చేయడం స్వేచ్ఛగా శారీరక కార్యకలాపాన్ని ప్రేరేపించేదిగా ఉంటుందా.. లేదా అనే దానిపై స్పష్టత కోసం ఈ ప్రయత్నం చేశారు. సాధారణ వ్యాయామం చేయడానికి, దీనికి గల వ్యత్యాసాన్ని గమనించారు. వారి ఇష్టారీతిన డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం వల్ల పెద్దల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థాయికి చేరుకోగలిగారని అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు సంగీతం పెట్టుకుని డ్యాన్స్ చేసినా, సంగీతం వినకుండా డ్యాన్స్ చేసినా కూడా ఒకే స్థాయిలో ఎంజాయ్ చేశారట. ఈ స్టడీ తర్వాత కుదిరితే సంగీతం లేదంటే, ఏదో ఒక ప్రేరణ తీసుకుని ప్రతి ఒక్కరూ శారీరక కార్యకలాపం చేస్తే మంచిదని తెలిసింది.
“చాలా మంది డాన్స్‌ను తేలికపాటి యాక్టివిటీ లేదా చాలా సులభమైనదిగా భావిస్తారు. కానీ, నిజానికి మీరు ఎవరినైనా డ్యాన్స్ చేసేవాళ్లను దగ్గర్నుండి పరిశీలించినట్లయితే లేదా మీరు వారి పర్సనల్ ట్రైనర్ గా ఉంటే డ్యాన్స్‌లో స్థాయి తీవ్రతను గమనించవచ్చు” అని నిపుణులు తేల్చారు.
సంబంధిత కథనం