Dal Biryani: ఒక్కసారి దాల్ బిర్యానీ చేసి చూడండి, రుచి మామూలుగా ఉండదు
Dal Biryani: కందిపప్పుతో ఒకసారి బిర్యానీ చేసి చూడండి. ఇది మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే ఎంతో రుచిగానూ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Dal Biryani శాఖాహారుల బిర్యానీ... దాల్ బిర్యానీ. బాస్మతి బియ్యం, కంది పప్పు వేసి దీన్ని చేస్తారు. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. కంది పప్పులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి తరచూ ఈ బిర్యానీ తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ బిర్యానీ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, హైబీపీ వంటివి అదుపులో ఉంటాయి. కాబట్టి దాల్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.
దాల్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - అర కిలో
కంది పప్పు - అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి
ఇంగువ - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నూనె - రెండు స్పూన్లు
బిర్యానీ ఆకు - రెండు
కొబ్బరి తురుము - అర కప్పు
లవంగాలు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
టమోటా - ఒకటి
పసుపు - అరస్పూను
వెల్లుల్లి రెబ్బలు - మూడు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
దాల్ బిర్యానీ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట పాటూ నానబెట్టాలి.
2. పప్పును కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. అందులో పసుపు, ఉప్పు, ఇంగువ వేసి ఉడకబెట్టాలి.
3. మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద మరో కుక్కర్ పెట్ట నూనె వేయాలి. అందులో జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి.
5. ఆ నూనెలో ఉల్లిపాయల తరుగును వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసి వేయించుకోవాలి.
6. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
7. టమోటా తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
8. కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటూ వేయించుకోవాలి.
9. ఇందులో ముందుగా నానబెట్టిన బియ్యం వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
10. ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టాలి.
11. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
12. అంతే టేస్టీ దాల్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
దాల్ బిర్యానీ మంచి లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. దాల్ బిర్యానీలో ప్రొటీన్లు పుష్కలంగా నిండి ఉంటాయి. కంది కప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఎక్కువ. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దాల్ బిర్యానీ తినడం వల్ల ఫైబర్ అధికంగా శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.