Dahi Idli: పెరుగు వడలాగే పెరుగు ఇడ్లీ... వేసవిలో చలువ చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ-dahi idli recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Dahi Idli Recipe In Telugu, Know How To Make This Breakfast

Dahi Idli: పెరుగు వడలాగే పెరుగు ఇడ్లీ... వేసవిలో చలువ చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ

Haritha Chappa HT Telugu
Mar 10, 2024 06:00 AM IST

Dahi Idli: పెరుగు వడల్లాగే పెరుగు ఇడ్లీలను కూడా చేయవచ్చు. ఇది వేసవిలో చలువ చేస్తుంది. వీటిని చేయడం చాలా సులువు. పెరుగు ఇడ్లీ రెసిపీ ఎలాగో చూద్దాం.

పెరుగు ఇడ్లీ రెసిపీ
పెరుగు ఇడ్లీ రెసిపీ (youtube)

Dahi Idli: పెరుగు ఇడ్లీలు పిల్లలకు తెగ నచ్చుతాయి. పెరుగు వడల్లాగే... పెరుగు ఇడ్లీలు కూడా టేస్టీగా ఉంటాయి. వేసవికాలంలో ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్‌లో పెరుగు ఇడ్లీ ఒకటి. ముఖ్యంగా పిల్లలకు దీన్ని తినిపించడం వల్ల వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ఈ పెరుగు ఇడ్లీలు చాలా సులువుగా చేయొచ్చు. వీటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

పెరుగు ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఇడ్లీలు - ఎనిమిది

పెరుగు - అర లీటరు

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

నూనె - ఒక స్పూన్

కరివేపాకు - గుప్పెడు

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

దానిమ్మ గింజలు - గుప్పెడు

పెరుగు ఇడ్లీ రెసిపీ

1. పెరుగులో ఒక కప్పులో వేసి బాగా గిలక్కొట్టాలి. అందులో ఉప్పు వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

2. ఒక గంట సేపు అలా ఫ్రిజ్‌లో ఉంటే మంచిది.

3.ఇడ్లీలను ముందుగానే వండుకొని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5.ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

6. ఇడ్లీలను ఒక గిన్నెలో వేసి పైన కాసిన్ని నీళ్లు చల్లుకోండి.

7. తర్వాత ఫ్రిజ్లో పెట్టిన పెరుగును తీసి ఇడ్లీలపై పోయండి.

8. తాళింపు పెట్టుకున్న పోపు గింజలను కూడా ఇడ్లీలపై చల్లండి.

9. చివరగా దానిమ్మ గింజలను పైన చల్లి మళ్ళీ ఫ్రిజ్లో ఒక గంట పాటు ఉంచండి. తర్వాత తీసి తినండి.

10. ఇవి ఎంతో టేస్టీగా ఉంటుంది. వీటిని ఒకసారి తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయి.

ఇడ్లీ... మన దక్షిణ భారతంలో చాలా ప్రముఖమైనది. వారంలో కనీసం రెండు మూడు సార్లయినా ఇడ్లీని టిఫిన్‌గా తినే వారి సంఖ్య ఎక్కువే. కొంతమంది అయితే వారంలో ఏడు రోజులు కూడా ఇడ్లీనే బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు కచ్చితంగా తినాల్సిన వంటకాలలో ఇడ్లీ ఒకటిగా మారిపోయింది. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తాం. కాబట్టి వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎన్ని తిన్నా బరువు పెరగరు. అలాగే ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. ఇక పెరుగు ఇడ్లీలు తినడం వల్ల వేసవిలో వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. శరీరానికి చలువదనం అందుతుంది. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని చల చల్లని పెరుగు ఇడ్లీలు తింటూ ఉంటే ఆ రుచే వేరు. ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఇడ్లీ చాలా అవసరం. ఎందుకంటే ఇడ్లీని పులియబెట్టిన పిండితో చేస్తాము, కాబట్టి దానిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. గుండెకు, కాలేయానికి ఇడ్లీ చేసే మేలు అంతా ఇంతా కాదు.

WhatsApp channel

టాపిక్