Dahi Bhindi Curry: రాజస్థానీ స్టైల్లో దహీ భిండీ కూర ఇలా వండరాంటే అన్నం, చపాతీల్లోకి అదిరిపోతుంది
Dahi Bhindi Curry: బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు కూరగాయ. దీంతో దహీ భిండీ కర్రీ వండుకుని చూడండి… ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దాబా స్టైల్లో బెండకాయ కర్రీ వండుకుని చూడండి. రెసిపీ చాలా సులువు.
బెండకాయలు ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు. బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు తరచూ వండుతూ ఉంటారు. ఎక్కువ సార్లు అలాగే తినడం వల్ల వాటిని తినాలన్న కోరిక కలగదు. అందుకే కాస్త కొత్తగా వండుకోవాలి. బెండకాయతో దాబా స్టైల్లో కూర వండుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం. తడ్కా దహీ బెండకాయ కూరను రాజస్టానీ స్టైల్లో వండితే రుచి అదిరిపోతుంది. ఈ కూరను చపాతీ, అన్నంలోకి వండితే అద్భుతంగా ఉంటుంది.
తడ్కా దహి భిండి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బెండకాయలు - పావు కిలో
నూనె - మూడు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూన్
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
ఉల్లిపాయలు - ఒకటి
పెరుగు - ఒక కప్పు
కారం - ఒక స్పూన్
పసుపు - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
నీరు - తగినంత
మెంతులు - పావు స్పూను
ఇంగువ పొడి - చిటికెడు
కరివేపాకులు - గుప్పెడు
గరం మసాలా - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
దహీ భిండి రెసిపీ
1. ముందుగా ఉల్లిపాయల పేస్టును తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. అందులో ఉల్లిపాయల తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
3. అవి బాగా వేగాక వాటిని బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
4. అవి చల్లారాక మిక్సీలో వేసి ఉల్లిపాయల పేస్టును రుబ్బుకుని పక్కన పెట్టండి.
5. ఇప్పుడు అదే కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో పెద్ద ముక్కలుగా కోసి బెండకాయ ముక్కలను వేసి వేయించాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంగువ వేసి వేయించాలి.
7. అవి వేగాక కరివేపాకులు వేసి వేయించాలి. అందులో ఉల్లిపాయ పేస్టును వేసి కలుపుకోవాలి.
8. అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి.
9. అలాగే కాస్త నీరు వేసి కలుపుకోవాలి. అందులో కప్పు పెరుగును కూడా వేసి కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అలా అయిదు నిమిషాల పాటూ ఉడికించాక పైన కొత్తిమీర చల్లుకోవాలి.
11. అంతే టేస్టీ దహీ భిండీ కూర రెడీ అయినట్టే.
బెండకాయ ఉపయోగాలు
బెండకాయతో చేసిన రెసిపీలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో పీచు, విటమిన్ సి అధికంగా ఉంటుంది. బెండకాయ తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ వంటివి రాకుండా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇది అడ్డుకుంటుంది. బెండకాయను పిల్లలకు తినిపించడం చాలా అవసరం.