Cancer | క్యాన్సర్‌కు ఔషధం దొరికేసిందా? రోగులకు సంజీవనిగా మారిన డోస్టార్‌లిమాబ్!
చరిత్రలో మొట్టమొదటిసారిగా, యునైటెడ్ స్టేట్స్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో జరిగిన ఒక చిన్న క్లినికల్ ట్రయల్ ఆశ్చర్యకర ఫలితాలను ఇచ్చింది. డోస్టార్‌లిమాబ్ అనే డ్రగ్ రోగులలో క్యాన్సర్ వ్యాధిని 100% నిర్మూలించిందని వైద్యులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలితీసుకున్న క్యాన్సర్ మహమ్మారికి ఇక రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తుంది. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఒక గర్భాశయ క్యాన్సర్ ఔషధం చూపిన ఫలితం వైద్యులను ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్ (Rectal Cancer)తో బాధపడుతున్న కొంత మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సలో భాగంగా డోస్టార్‌లిమాబ్ (Dostarlimab) అనే ఔషధాన్ని ప్రయోగించారు. చికిత్స తర్వాత వీరిలో క్యాన్సర్ మటు మాయమైంది. వారి శరీరంలో క్యాన్సర్ కణాలన్నీ అంతమైపోయాయి.
ట్రెండింగ్ వార్తలు
నివేదికల ప్రకారం, క్లినికల్ ట్రయల్‌లోని 18 మంది రోగులు సుమారు ఆరు నెలల పాటు డోస్టార్‌లిమాబ్‌ను తీసుకున్నారు. 12 నెలల తర్వాత వారి క్యాన్సర్ అదృశ్యమైనట్లు వైద్యులు కనుగొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి రోగుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఔషధంపై మరిన్ని పరిశోధనలు జరపాలని వైద్య రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.
క్లినికల్ ట్రయల్స్ హైలైట్స్
- డోస్టార్లిమాబ్ అనేది ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన అణువులతో కూడిన ఔషధం. ఇది మానవ శరీరంలో ప్రత్యామ్నాయ ప్రతిరోధకాలుగా పనిచేస్తుంది. అమెరికా వైద్య శాస్త్రజ్ఞులు ఈ క్యాన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.
- ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా రెక్టల్ క్యాన్సర్ తో పోరాడుతున్న 18 మంది రోగులకు డోస్టార్లిమాబ్ ఔషధం ఇస్తూ పోయారు. ప్రతి మూడు వారాలకు నిర్ణీత మోతాదులలో ఔషధం ఇస్తూపోయారు.
- ట్రయల్ ముగింపులో ఫిజికల్ ఎగ్జామ్, ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా PET స్కాన్‌లు లేదా MRI స్కాన్‌ల ద్వారా స్కాన్ చేశారు. రోగుల శరీరంలో క్యాన్సర్ కణతులు పూర్తిగా అదృశ్యమైనట్లు డాక్టర్లు నిర్ధారించారు.
- డోస్టార్లిమాబ్ ఔషధం చాలా ఖరీదైనది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఈ ఔషధం ధర దాదాపు 11,000 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 8.50 లక్షలు.
- డోస్టార్లిమాబ్ క్యాన్సర్ కణాలను బాహ్యా కణాలుగా చూపిస్తుంది. దీంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి నాశనం చేయడంలో సహాయపడుతుంది. అనంతరం యాంటీబాడీలను అభివృద్ధి చేస్తుంది.
- ఈ తరహా క్లినికల్ ట్రయల్స్ గతంలో 2017లో మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లూయిస్ ఎ. డియాజ్ చేపట్టారు. ఈ అధ్యయనాల ఆధారంగా డోస్టార్లిమాబ్ ఔషధం అభివృద్ధి చేశారు.
- డోస్టార్లిమాబ్ కచ్చితంగా క్యాన్సర్‌ను నిరోధించగల ఔషధం అని డాక్టర్ లూయిస్ ఎ. డియాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న రోగులు అంతకుముందు క్యాన్సర్ నుంచి బయటపడేందుకు అత్యంత బాధాకరమైన కెమోథెరపీ, రేడియేషన్, ఇన్వాసివ్ సర్జరీలు చేసుకున్నారు. అయితే డోస్టార్లిమాబ్ వీరికి ఆ బాధల నుంచి విముక్తి కలిగించి, ప్రాణాలను కాపాడిన ఒక సంజీవనిలా నిలిచింది.
- ట్రీట్మెంట్ ముగిసిన 25 నెలల తర్వాత కూడా రోగుల్లో ఎలాంటి పోస్ట్-ట్రీట్మెంట్ సమస్యలు, క్యాన్సర్ పునరావృతమయ్యే సంకేతాలు కనిపించలేదు.
- ఇలా నయమైన క్యాన్సర్‌కు తదుపరి చికిత్స కూడా అవసరం లేదని అక్కడి వైద్య పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అందరు క్యాన్సర్ రోగులపై ఈ డ్రగ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది. దీనిపై మరింత విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్