Curd VS Butter milk: పెరుగు లేదా మజ్జిగ, ఈ రెండింటిలో వేసవిలో ఏది అధికంగా తీసుకుంటే చలువ?-curd or buttermilk which of the two should be consumed more in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Vs Butter Milk: పెరుగు లేదా మజ్జిగ, ఈ రెండింటిలో వేసవిలో ఏది అధికంగా తీసుకుంటే చలువ?

Curd VS Butter milk: పెరుగు లేదా మజ్జిగ, ఈ రెండింటిలో వేసవిలో ఏది అధికంగా తీసుకుంటే చలువ?

Haritha Chappa HT Telugu
Published May 05, 2024 10:30 AM IST

Curd VS Butter milk: పెరుగు, మజ్జిగ.. రెండూ పాల ఆధారిత ఉత్పత్తులే. ఈ రెండింటిలో వేసవిలో ఏది ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందో వివరిస్తున్నారు పోషక ఆహారం నిపుణులు.

పెరుగు, మజ్జిగలలో ఏది ఆరోగ్యకరం?
పెరుగు, మజ్జిగలలో ఏది ఆరోగ్యకరం? (Pixabay)

Curd VS Butter milk: వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందో అప్పుడు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి చలువ చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ మందికి ఉన్న సందేహం... పెరుగు లేదా మజ్జిగ ఈ రెండిటిలో ఏది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ రెండూ కూడా పాల ఆధారిత ఉత్పత్తులే. నిజానికి ఈ రెండూ ఎంతో మేలు చేస్తాయి. పాలతో పెరుగు తయారైతే, పెరుగుతో మజ్జిగ తయారవుతుంది. కానీ పెరుగు, పాలు ఈ రెండూ శరీరంపై భిన్నంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రెండింటిలో ఏది వేసవిలో తీసుకుంటే ఎక్కువ చలువ చేస్తుందో తెలుసుకుందాం.

పెరుగు వల్ల లాభాలు

పాలను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్వారా పులియబెట్టడం వల్ల పెరుగు తయారవుతుంది. ఇందులో లాక్టోజ్‌ను లాక్టిక్ యాసిడ్ గా బ్యాక్టీరియా మార్చేస్తుంది. దీని వల్ల పెరుగు చిక్కగా మారి క్రీమ్ ఆకృతికి వస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోబయోటిక్స్ లక్షణాలు కూడా అధికం. అంటే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. మన పొట్ట ఆరోగ్యానికీ, జీర్ణక్రియకు ఈ మంచి బ్యాక్టీరియా చాలా అవసరం. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. పెరుగులో లాక్టోజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్ సమస్యతో బాధపడుతున్న వారు... పాలను తాగకూడదు. కానీ పెరుగును మాత్రం తినొచ్చు. ఉదయాన్నే పెరుగు తినడం వల్ల ఆ రోజు అంతటికీ కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

మజ్జిగ వల్ల లాభాలు

ఇక మజ్జిగ విషయానికి వస్తే పాలను, పెరుగును బాగా చిలికి నీరు చేర్చడం ద్వారా మజ్జిగను తయారు చేస్తారు. దీనిలో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, రిబోఫ్లేవిన్ కూడా ఉంటుంది. మజ్జిగలో, పెరుగుతో పోలిస్తే కొవ్వు, కేలరీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి మజ్జిగ అధికంగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. మజ్జిగను ఒక హైడ్రేటింగ్ పానీయంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.

రెండింటిలో ఏది మంచిది?

ఇక పెరుగు లేదా మజ్జిగ... ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుందంటే ఈ రెండూ కూడా మన శరీరానికి అవసరమైనవే. పెరుగుతో స్మూతీస్ వంటివి టేస్టీగా వస్తాయి. పెరుగన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఎండల్లో తిరిగేవారికి పెరుగు కన్నా మజ్జిగ ప్రతిరోజు తాగడం చాలా అవసరం. వడదెబ్బ కొట్టకుండా, శరీర ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడే శక్తి మజ్జిగకు ఉంది. మజ్జిగలో నాలుగు పుదీనా ఆకులు వేసుకొని చల్లగా తాగితే ఎంతటి ఎండలో తిరిగినా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ప్రతిరోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం అలవాటు చేసుకుంటే ఎండలో తిరిగే వారికి ఉపశమనం లభిస్తుంది.

Whats_app_banner