Curd Idli: మీరు పెరుగు వడ తిని ఉంటారు, ఓసారి పెరుగు ఇడ్లీ తిని చూడండి, మీకు నచ్చడం ఖాయం
Curd Idli: పెరుగు గారెలు లేదా పెరుగు వడలు మీరు తినే ఉంటారు. కానీ పెరుగు ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది చాలా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రెసిపీ తెలుసుకోండి.
ఇడ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారం రోజుల పాటూ ఇష్టంగా ఇడ్లీ తినేవారు ఎంతో మంది ఉన్నారు. ఇడ్లీ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం వంటకం. ఇది శ్రీలంకలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇడ్లీని బియ్యం, మినప్పప్పుతో పిండిని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇడ్లీ తయారీకి మినుములు, ఇడ్లీ రవ్వను ఉపయోగిస్తారు. రకరకాల ఇడ్లీలను ప్రస్తుతం తయారుచేస్తున్నారు. ఇడ్లీని రవ్వ, సగ్గుబియ్యం, వెర్మిసెల్లిలో కూడా తయారుచేస్తారు. ఇడ్లీని కేవలం మినుములతో మాత్రమే తయారు చేసినట్లు కన్నడ చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావనలు ఉన్నాయి.
ఇడ్లీ ఎక్కడ పుట్టింది?
పూర్వం ఇడ్లీని మజ్జిగలో నానబెట్టి రుబ్బి తయారుచేసేవారట. పెరుగు, నీరు, మసాలా దినుసులు జోడించి ఇడ్లీకి మంచి రుచిని అందించేవారు. ఈ రోజు మనం తినే ఆధునిక ఇడ్లీ ఇండోనేషియాలో ఉద్భవించిందని చెబుతూ ఉంటారు. ఎందుకంటే పులియబెట్టడం ద్వారా ఆహారాన్ని తయారుచేసే సంప్రదాయ పద్ధతిని అక్కడే అనుసరిస్తున్నారు. ఇడ్లీని ఇండోనేషియాలో ఉండే హిందూ రాజులు దగ్గర పనిచేసే చెఫ్ లు కనిపెట్టి ఉంటారని కూడా చెప్పుకుంటారు. అక్కడి నుంచి ఈ ఆహారం భారతదేశానికి చేరిందని చెప్పకుంటారు. ఇండోనేషియాలో కేట్లీ అని పిలిచే వంటకం ఇడ్లీ లాంటిదేనని చరిత్ర చెబుతోంది.
ఇక్కడ పెరుగు గారెల్లాగే, పెరుగు వడలను ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని రెసిపీ చాలా సులువు.
పెరుగు ఇడ్లీ రెసిపీకి కావల్సిన పదార్థాలు:
ఇడ్లీలు - ఆరు
కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
పచ్చి మిర్చి - ఒకటి
జీలకర్ర - అర స్పూను
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - పావు స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పెరుగు - ఒక కప్పు
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - అర స్పూను
నూనె - అర స్పూను
ఎండు మిర్చి - ఒకటి
పెరుగు ఇడ్లీ రెసిపీ
- పెరుగు ఇడ్లీని తయారుచేసేందుకు ముందుగానే ఇడ్లీని వండి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీరు, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును వేసి అందులో మిక్సీలో రుబ్బిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
- పెరుగు మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఉంచాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, శెనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి పెరుగు మిశ్రమంపై తాలింపులా వేసుకోవాలి.
- ఇక ప్లేటులో ఇడ్లీలను పెట్టుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటే బావుంటుంది. లేదా మినీ ఇడ్లీలు అయినా ఈ రెసిపీ చక్కగా వస్తుంది.
- వాటిని ప్లేటులో పరుచుకున్నాక మిక్సీ జార్లోని పెరుగు మిశ్రమాన్ని వాటిపై పోాయాలి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.
దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పెరుగు ఇడ్లీని ఇష్టపడతారు.