Cucumber Dosa: ఎన్నో రకాల దోశలను మీరు తిని ఉంటారు. ఒకసారి కీరోదోసకాయలతో దోశలను ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దోశెలను కాస్త కొత్తగా తినాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ. ఇది చేయడానికి అయ్యే సమయం కూడా చాలా తక్కువే. కాబట్టి ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి.
బియ్యం - ఒక కప్పు
కీరాదోస - ఒకటి
కొబ్బరి తురుము - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
1. బియ్యాన్ని రెండు గంటల పాటు ముందే నానబెట్టుకోవాలి.
2. కీరాదోస పైన చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుమును, కీరాదోస ముక్కలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
5. ఇప్పుడు అదే మిక్సీలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. ఈ పేస్టును దోసకాయ రుబ్బులో వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
7. దోశ పిండికి ఎంత మందంగా కలుపుకోవాలో అంతా మందంగా ఈ దోశ పిండిని కలుపుకోవాలి. అవసరమైతే నీటిని కూడా కలపాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
9. నూనెపై ఈ దోశల పిండిని దోశెలా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.
10. దీన్ని కొబ్బరి చట్నీతో లేదా టమాటో చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే అందరికీ నచ్చడం ఖాయం.
కీరాదోస ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనితో దోశలు చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. దీనిలో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవికాలంలో కచ్చితంగా తినాల్సిన వాటిలో కీరా దోస ఒకటి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంతోపాటు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మేము కీరాదోస దోశల రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం.