Cake Recipe: నోట్లో పెడితే కరిగిపోయేలా క్రీమీ చీజ్ కేక్ ఇంట్లోనే ఇలా చేసేయండి, పిల్లలకు నచ్చుతుంది
కొత్త ఏడాదికి పిల్లలు కేక్ చేయమని అడుగుతూ ఉంటారు. చాలా మంది తల్లులు కేక్ చేయడం రాదని అంటూ ఉంవటారు. ఈసారి అలా చెప్పకుండా సులువుగా ఇంట్లోనే ఈ క్రీమీ చీజ్ కేక్ చేసేయండి. రెసిపీ ఇదిగో.
కొత్త ఏడాదికి పిల్లలు కచ్చితంగా అడిగేది చీజ్ కేక్. దీన్ని ఇంట్లోనే తయారుచేయమని అడుగుతారు. కానీ చాలా మంది తల్లులు తమకు కేకు చేయడం రాదని అంటారు. నిజానికి ఇంట్లోనే కేకు చాలా సులువుగా చేసేయవచ్చు. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మేము క్రీమీ చీజ్ కేక్ రెసిపీ ఇచ్చాము. ఇది మీ అందరికీ ఎంతో నచ్చుతుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
క్రీమీ చీజ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్రీమ్ చీజ్ - పావు కిలో
విప్డ్ క్రీమ్ - 200 మిల్లీ లీటర్ల
పంచదార పొడి - పావు కప్పు
బిస్కెట్లు - వంద గ్రాములు
బటర్ - 50 గ్రా
వెనీలా ఎసెన్స్ - అర స్పూను
క్రీమీ చీజ్ కేక్ రెసిపీ
- బిస్కెట్లను చేత్తోనే మెత్తగా నలుపుకోవాలి. లేదా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- ఒక గిన్నెలో బటర్, పంచదార, బిస్కెట్ల పొడి వేసి కలపాలి. ఇదంతా పేస్టులా అయ్యేవరకు బాగా కలుపుకోవాలి.
- కేక్ ట్రేలో బటర్ పేపర్‌ను వేసి బిస్కెట్ మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేయాలి.
- ఈ ట్రేను ఫ్రిజ్ లో పెట్టాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో క్రీమీ చీజ్, వెనీలా ఎసెన్స్, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి.
- అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా ఒక గిన్నెలో వేసి బీట్ చేయాలి.
- విప్పింగ్ క్రీమ్ లోనే క్రీమీ చీజ్ కూడా వేసి బాగా బీట్ చేయాలి.
- దీన్ని ఫ్రిజ్ లో ఉంచిన బిస్కెట్ల మిశ్రమంపై స్ప్రెడ్ చేయాలి. దీన్ని రాత్రంతా ఫ్రిజ్ లోనే ఉంచాలి.
- అంతే టేస్టీ చీజ్ కేక్ రెడీ అయినట్టే.
- దీనిపై మీకు ఇష్టమైన పండ్లు, జెల్లీలు వంటివి వేసుకుని సర్వ్ చేయవచ్చు. ఇది చాలా టేస్టీగా, చూసేందుకు అందంగా ఉంటుంది.
ఇలా కేకును చేస్తే చాలా సులువుగా అయిపోతుంది. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు, కాకపోతే ఫ్రిజ్ లో గట్టిపడేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఏమైనా పిల్లలు అడిగినప్పుడల్లా ఈ కేకు చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.