పుల్లపుల్లగా, కారంకారంగా ఏమైనా తినాలనుందా 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఉల్లి మిక్చర్ ట్రై చేయండి!-craving something tangy and spicy try this onion mixture that will be ready in just 5 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పుల్లపుల్లగా, కారంకారంగా ఏమైనా తినాలనుందా 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఉల్లి మిక్చర్ ట్రై చేయండి!

పుల్లపుల్లగా, కారంకారంగా ఏమైనా తినాలనుందా 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఉల్లి మిక్చర్ ట్రై చేయండి!

Ramya Sri Marka HT Telugu

పుల్లపుల్లగా కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఉల్లి మిక్చర్ ట్రై చేయండి. 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రెసిపీ మీ సాయంత్రాన్ని మరింత సరదాగా మార్చుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు.

ఉల్లిమిక్చర్ తయారుచేసుకోవడం ఎలా

సరదాగా సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లి ఉల్లి మిక్చర్ తినే అలవాటు మీకుందా..? అయితే అన్ని వేళలా మీకు నచ్చినట్లుగా ఉల్లి మిక్చర్ ఉండకపోవచ్చు. లేదా కొన్ని ప్రదేశాలలో ఉల్లి మిక్చర్ అందుబాటులోనూ లేకపోవచ్చు. కానీ, అదే ఉల్లి మిక్చర్ ను ఇంట్లో రెడీ చేసుకోవడం మీకూ వస్తే ఇంకా హ్యాపీ కదా. కావాల్సినప్పుడల్లా మిక్చర్ రెడీ చేసుకుని తినేయొచ్చు.

ఉల్లిమిక్చర్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • మందపాటి అటుకులు- ఒక కప్పు
  • పల్లీలు- పావు కప్పు
  • ఉల్లిపాయలు- రెండు పెద్దవి
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం- ఒక స్పూన్ కారం
  • పసుపు- చిటికెడు
  • ధనియాల పొడి- ఒక స్పూన్ ధనియాల పొడి
  • చాట్ మసాలా- ఒక స్పూన్ చాట్ మసాలా
  • కొత్తిమీర- గుప్పెడు
  • నెయ్యి- ఒక స్పూన్
  • నూనె- డీప్ ఫ్రైకి సరిపడా

ఉల్లి మిక్చర్ తయారీ విధానం:

  1. ఉల్లిమిక్చర్ తయారు చేయడం కోసం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
  2. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మందంగా ఉన్న అటుకులు వేసి వేయించుకోవాలి.
  3. నూనెలో బాగా పొంగిన అటుకులను టిష్యూ పేపర్ మీద ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి.
  4. ఆ తర్వాత అదే నూనెలో పావు కప్పు వేరుశనగ గుళ్లు వేసి మాడిపోకుండా వేయించి వాటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి.
  5. ఇప్పుడు వీటిని పైకి కిందకు కదిలించి అందులోని టిష్యూ పేపర్ తీసేయాలి.
  6. రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్ ఇంకా మంచి టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి, ఒక నిమ్మకాయ రసం పిండి అంతా మ్యాష్ చేస్తూ బాగా కలపాలి.
  7. అంతా బాగా కలిసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని కారం, ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు.
  8. కావాలనుకుంటే బయట నుంచి తెచ్చిన మిర్చి బజ్జీలను కూడా ముక్కలుగా చేసుకుని కలుపుకోవచ్చు.
  9. అంతే, ఉల్లి మిక్చర్ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోండి.
  10. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఇది వేడి చేయాల్సిన స్నాక్స్ కాకపోయినా, నిల్వ ఉంచుకోదగ్గదైతే మాత్రం కాదు.

ఉల్లిమిక్చర్ వల్ల కలిగే ఉపయోగాలు:

ఉల్లి మిక్చర్ తినడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఆకలితో ఉండే సమయంలో త్వరగా తినేందుకు సిద్ధంగా ఉండే స్నాక్. ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పల్లీలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల వనరు. ఇవి శక్తిని అందిస్తాయి. నరాలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. శాకాహారులకు ఇది ఒక మంచి, టేస్టీ ప్రోటీన్ స్నాక్ అవుతుంది. చాట్ మసాలా, నిమ్మరసం వంటివి జీర్ణశక్తిని పెంచుతాయి. ఇంట్లో తయారుచేసుకునే ఉల్లి మిక్చర్ మితంగా తింటే ఆరోగ్యకరమైనదే. బయట కొనుగోలు చేసే వాటికన్నా ఇంట్లో మన రుచికి తగ్గట్టు, నూనె, కారం, ఉప్పు నియంత్రించుకుంటూ తయారు చేయవచ్చు. అయితే, ఇది డీప్ ఫ్రైడ్ కాబట్టి తరచూ తినడం మంచిదికాదు. కానీ అప్పుడప్పుడూ రుచిగా, హెల్తీగా తినేందుకు ఇది బెస్ట్ చాయిస్.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం